Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరి ప్రసాద్ చెలమల్లు 9493388201
నాకు చావాలనుంది
నేను చేసిన తప్పులెన్నో
నన్ను తొలిచేస్తున్నాయి
నలుగురిని
కలవనీయలే
ఒకరంటే ఒకరికి
ద్వేషభావం రగిలించా
ఎన్నో మానభంగాలు
ఎన్నో హత్యలు
ఎన్ని సార్లో రక్తపుటేరులు పారించా
సరిహద్దులు
గిరిగీతలు
తినే తిండిపై
నడిచే దారిపై ఆంక్షలు విధించా
అందరూ ఒక్కటైతే
నా మనుగడకే ముప్పని
అడుగడుగునా అదిరిస్తూ
బెదిరిస్తూ హల్ చల్ చేస్తున్నా
వేషం
భాష లో సైతం వేరు చేసా
నా స్వార్ధం కోసం
సంఘాన్ని విభజించా
అధికారం అందాలంటే
నేనే పాచిక
నా బలమే లెక్కల్లో ఘనం
తూచుతూ
ప్రతి పల్లె నా చుట్టూ పరిభ్రమణం
చీమలను చూసి
సంఘ జీవనం నేర్చుకోకుండా
కత్తెర వేసా
కోతి రొట్టెముక్క కథని జొప్పించా
పనికో మనిషిని
పనికో ముట్టుని ఎవడు సృష్టించాడో
ఎవడు ఏ పనిచేస్తాడో
వాడ్ని అంటిపెట్టుకున్నా
వాడ్ని వదలకుండా వుంటున్నా
నేను పుట్టినప్పట్నుంచి
ఇప్పటిదాకా నా చరిత్ర తవ్విన కొద్దీ
అన్నీ అకృత్యాలే
నా వల్ల వాడు ఆలోచించట్లే
అక్షరం మెదల్లో పాతుకుపోయినా
నన్ను వాటేసుకుని
సభ్యత మరచిపోతున్నాడు
విచక్షణ మరచి
విద్రోహం వైపు నా వల్ల
నాకు చావాలనుంది
నన్ను చావనీయట్లే
నేను చస్తే బాధ పడేది కొందరైతే
సంతోషించేది ఎందరో
అందుకే చడీ చప్పుడు
లేకుండా నిష్క్రమిస్తా
నేనే కులాన్ని