Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా|| నూనె అంకమ్మరావు,
చరవాణి :9397907776
దేశభక్తి ప్రబోధాత్మకంగా జాతిని సమైక్యపరుస్తూ తెలుగు కవిత్వాన్ని సృష్టించిన ధీరోదాత్తుడు గురజాడ అప్పారావు. వీరి ప్రబోధాత్మక గేయాలను తెలుగు ప్రజలంతా ఆరాధించారు.
''దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టిమాటలు కట్టిపెట్టోరు
గట్టిమేల్ తలపెట్టవోరు'' అంటూ
దేశాన్ని ప్రేమించు, ఆ దేశానికి మంచిని కలిగించే భావాన్ని పెంచుకో, ప్రగల్భాలు పలకటం మాని నిక్కచ్చిగా మానవులకు మంచిచేసే పనిని నేర్చుకోమన్నాడు. ఎప్పుడైతే పరులకు ఉపకారం చేయాలనే ఆలోచన వస్తుందో అప్పుడు దేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని పలికారు.
సాంస్కృతిక పునరుజ్జీవనమవుతున్న రోజుల్లో జన్మించిన గురజాడ ''సమాజంలో మంచికి మంచి, చెడుకు చెడు చేయడం కన్నా సాహిత్యపరమావధిలేదు'' అంటూ భాషను ఆధునీకరించి ''అక్షరం''తో చెడును తనుమాడేందుకు కంకణ బద్ధులయ్యారు. దానిని ఉద్యమంలా చేపట్టి ప్రజా ఉద్యమంలా మార్చి విశ్రాంతి అనేది తన జీవితానికి లేదని ఒక వేళ అలాంటి పరిస్థితితే దాపురిస్తే, వస్తే అంతకన్నా మరణం మేలని భావించారు. ఆధునిక యుగకర్త గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యన్నంతటినీ ఒంటిచేత్తో ఆధునీకరించే ప్రయత్నం చేశారు. మనం ఏ భాషలో మాట్లాడుతున్నామో అదే భాషలో గ్రంథ రచన సాగితే ఎక్కువ మందికి సాహిత్యం అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడి ఆయన తొలిసారిగా 'కన్యాశుల్కం' అనే నాటకాన్ని వ్రాశారు.
గురజాడని ఆంధ్ర సాహిత్యలోకంలో కొత్త యుగానికి ప్రారంభకులుగా సాహిత్యకారులు, ఉద్యమకారులు గుర్తించారు. సాహిత్యం ఏ ఒక్కరిసొత్తు కాదని, అది అందరి సొమ్ము అని బాహాటంగా చెప్తారు. జాతీయోద్యమం భారతదేశమంతా వ్యాపిస్తున్న తరుణంలో యువకుల్లో జాతయభావాన్ని రేకేత్తించేందుకు ఎల్లలు దాటిన దేశభక్తిని ప్రబోధించడానికి 'దేశభక్తి' అనే గేయాన్ని రాశాడు. తెలుగులో ఇదే మొదటి దేభశక్తి గేయం. ఇది మొదట కృష్ణా పత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత రాయప్రోలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటివాళ్ళు తెలుగులో చక్కటి దేశభక్తి గేయాల్ని రాశారు.అయితే అన్ని దేశభక్తి గేయాలకు భిన్నమైంది గురజాడ రాసిన దేశభక్తి గేయం. మా దేశం చాలా గొప్పదని, భిన్నమైన వ్యక్తులతో కళకళలాడుతోందని కాకుండా, ఒక దేశం బాగుపడాలంటే ఆ దేశంలో నివసించే ప్రజలంతా ఎలా ఉండాలో తెలియజేస్తారు. 14 రచణాలతో ''దేశమును ప్రేమించుమన్నా మంచి యన్నది పెంచుమన్నా'' అనే గేయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జాతీయ గీతం ''జనగణమన '' కన్నా ఓ ఏడాది ముందే రాశారు గురజాడ.
గురజాడ రాసిన దేశభక్తి గేయంలోని 14 చరణాలు పద్నాలుగు విషయాల్ని సృశిస్తాయి. చిన్నా, పెద్ద అనే తేడాలేకుండా అందరూ అర్ధం చేసుకుని చక్కగా ఆలపించటానికి అనువైన రీతిలో, తేలికైన పదాలతో వ్రాయడం ఆయనకే చెల్లింది. ప్రతీ చరణం ఒక్కో విషయంలో మనలోని మంచితనాన్ని, విలువల్ని, దేశభక్తిని రేకేత్తిస్తాయి. వట్టిమాటలు వద్దని గట్టిపనులు చేయాలని, దేశాన్ని ప్రేమించాలని, మంచిని పెంచుకోవాలని సూచన ప్రాయంగా హెచ్చరిస్తారు. అనాదిగానే దేశానికి పునాదిగా మనది వ్యవసాయ దేశం. శ్రమవిలువ తెలుసుకుని, పనిపాటలు నేర్చుకుని దేశం సుభిక్షంగా ఉండాలంటే పాడిపంటలు పొంగిపొరలే దారిలో నువ్వు పాటు పడవోరు అని హితవు పలికారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి శ్రేయస్సుని మొదటిసారి ప్రస్తావించారు. తిండి కలిగితే కండకలదోరు కండగలవాడేను మనిషోరు, ఈసురోమని మనుషులుంటే, దేశమేగతి బాగుపడనోరు అని ప్రశ్నించారు. దేశసరుకుల్నే కొనమన్నారు. డబ్బు సంపాదించకపోతే కీర్తి ప్రతిష్ఠలు రావని, మనం తయారు చేసిన సరుకుల్ని ఇతర దేశాలలో అమ్ముకున్నప్పుడే అధిక లాభంతో దేశం ఆర్ధికంగా ముందుకు వెళుతోందని చెబుతారు.
వెనక చూసిన కార్యమేమోయి?
మంచిగతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనుక బడితే వెనుకే నోయి?
వెనుకబాటు తనాన్ని అలవర్చుకోకుండా ఉంటేనే ఏ కార్యమైనా మందకొండితనం లేకుండా జరుగుతుందని దాన్ని గ్రహించి మనిషి పని చేయాలి, కాని ముందు గొప్పలు చూసి కాదు అని, విద్యలో పోటీ ఉండాలి, వ్యాపారంలోనే శత్రువులు? అనవసరంగా కలహాలు పెంచుకోవద్దంటారు. నాకు దేశాభిమానముందని గొప్పలు చెప్పుకోవద్దు. జనాలకి మేలుచేసి నిరూపించు కొమ్మంటారు. ఇతరులకు మేలు జరుగుతోందని ఏడ్వవద్దు. ఇతరులకు మేలు చేసేవాళ్ళకు ఎంతో మేలు జరుగుతుందంటారు. ఇతరుల బాగుపడుతున్నాడని ఏడ్చే వారికి ఎప్పుడూ సుఖం లేదని, ఈర్ష్య, అసూయలు మానవునికి శత్రువులని, ఓర్పు, ప్రేమ స్నేహితులని పరుల మేలుకు సంతోషిస్తే ఆనందమని, తద్వారా ఆరోగ్యమని, అదే దేశానికి సగం బలమని పేర్కొంటారు.
స్వంత లాభం కొంత మానుక
పొరుగువాడికి తోడుపడవోయి
దేశమంటే మట్టికాదోయి
దేశమంటే మనుషులోయి!
అని అంటూ కులమత భేదాల్లేకుండా అందరూ ఐకమత్యంతో ఉండాలని, దేశమనే దొడ్డవృక్షానికి ప్రేమలనే పూలును పూయించాలని పరస్పర అవగాహనతో స్పందిస్తే, శ్రమిస్తే సంపదలు కలుగుతాయని, చెమట బిందువులు స్రవిస్తేనే పంటలు పండుతాయని, మనిషి శ్రమకు గుర్తింపే ధనమని, ఆ ధనమే దేశానికి మూల సంపదని, దాంతో అందరూ సుఖంగా జీవిస్తారని ఆశిస్తారు. ప్రజల్లో దేశాభిమానాన్ని రగిలించడమే ధ్యేయంగా గురజాడ ఈ 'దేశభక్తి' గేయాన్ని వ్రాశారు. మనిషి తన విలువని పెంచడానికి దేశభక్తి గేయంలో ఇన్ని సలహాలనిచ్చారు. ఎంతో తేలికైన పదాలతో మనుషుల విలువలు కూడా పెరిగి దానంతటదే దేశం విలువ పెరుగుతుందనేది ఆయన అభిప్రాయం. ఇలాంటి విలువల్ని చిన్నప్పటి నుంచి పెంచాలనే ధ్యేయంతో పిల్లలు పాడుకోవడానికి వీలైన భాషలో వ్రాశారు.
ఈ గేయంలోని భావాలని బట్టి ఇది ఏ దేశానికైనా దేశభక్తి గేయం కాగలిగిన అర్హత ఉంది. ఈ గేయంలో గురజాడ వారి విశ్వజనీనత కనిపిస్తుంది. అందుకే ఈ గేయం 24 జాతీయ, అంతర్జాతీయ భాషల్లోని అనువదింపబడింది. కవిత్వం అందరికీ చేరాలనే ఉద్దేశ్యంతో నవ్యకవిత్వానికి బాటలు వేశారు. ఒక జాతి 'ఫార్సిగజల్' నడకతో ఈ ఛందస్సులో వ్రాశారు. ''గురజాడ మహాకవి అని చెప్పడానికి దేశభక్తి గేయం ఒక్కటి చాలు'' అంటారు శ్రీశ్రీ.
గురజాడ దేశభక్తి గేయం - ప్రముఖుల విశ్లేషణ :
గురజాడ దేశభక్తి గేయాన్ని నార్లవారు విశ్లేషిస్తూ ''గురజాడ తన దేశాన్ని ప్రేమిస్తారు. కానీ ఆ ప్రేమ ఇతర దేశాలను వెలివేయదు. కారణం అన్ని దేశాలూ ' ఏక ప్రపంచమవుతాయి. అందువల్ల దేశభక్తి మీద ఉత్తేజకరమైన గేయం రాసినప్పుడు కూడా ఆయన భారతదేశ చరిత్రనూ, భౌగోళిక పరిస్థితులను ప్రస్తావించారు. దారి తప్పిన దేశభక్తులను మందలిస్తూ ఆయన ఇలా చెప్పారంటూ '' దేశమంటే మట్టికాదోరు - దేశమంటే మనుషులోరు'' అని పేర్కొంటారు.
వసంతరావు బ్రహ్మాజీరావు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఈ గేయములో ఎన్నో గంభీర భావాలు ఇమిడియున్నవి. ఈ గేయము పూర్తిగా గ్రహించుటకు ఏ సందర్భములో ఇది వ్రాయబడినదో తెలిసికొనుట అవసరం. బ్రిటిష్ ప్రభుత్వము మన దేశమును పాలించుటకు, విభజించి పాలించు అను సూత్రము అవలంబించినారు. హిందు మహమ్మదీయ కలహములకు కొంతవరకూ బ్రిటిష్ ప్రభుత్వమే కారణము. ఆ సమయంలో ప్రజల కర్తవ్యాన్ని గుర్తు చేయటానికి గురజాడ ఈ గేయాన్ని రచించినట్లు అభిప్రాయపడ్డారు.
'జాతీయతా స్ఫూర్తి - గురజాడ దేశభక్తి' అని డా||ఎ.బి.కె.ప్రసాద్‌గారు విశ్లేషిస్తూ దేశభక్తి గేయం ద్వారా దేశ సరిహద్దులు దాటి, అంతర్జాతీయ సరిహద్దులు తాకిన గురజాడ జాతీయతా స్ఫూర్తిని అంచనావేయడానికి సార్వత్రిక ప్రపంచ గీతంగా లేక ఐక్యరాజ్యసమితి 'విశ్వకవిత'గా దానిని గుర్తించడం మినహా వేరే కొలమానాలు పనికి రావు. ఆచరణ వాదిగా గురజాడ మనిషి ''దేశభక్తి''కి పెట్టిన అగ్ని పరీక్ష ''దేశాభిమానం నాకు కద్దని వొట్టి గొప్పలు'' చెప్పుకోవద్దనడం, ముగ్గులోకి దిగి ఆచరణలో ప్రజలకు ''మేలు చేసి'' చూపమనడమూ, ''' దేశమంటే మట్టికాదనీ, దేశమంటే మనుషులనీ'' గుర్తించి వ్యవహరించమని భారతదేశ చరిత్రలో మొదటిసారిగా కవితాపరంగా ఉద్బోధించిన మహాకవి గురజాడని, ఇలాంటి భావసంపదని, ఆలోచన స్రవంతిని - తనదైన శైలిలో, అనేక రచనల ద్వారా, ప్రక్రియల ద్వారా అందజేసిన వాటిలో నిస్సందేహంగా, 'దేశభక్తి' గేయం ఒకటని, విశ్వానికే దేశభక్తి, దేశభక్తి గేయాన్ని అందజేసిన ఘనత, ఖ్యాతితోపాటు తెలుగు సాహిత్యంలో 'దేశభక్తి' అన్న భావనకి, ప్రేరణ, ప్రభావాలను అందజేసింది కూడా కేవలం గురజాడకే దక్కింది, వారికే చెల్లిందని వెల్లడించారు.
గురజాడ దేశభక్తి వంటి గేయం భారతీయ సాహిత్యంలోనే లేదని చెప్పాలి. బంకించంద్రుని 'వందేమాతరం', రవీంద్రుని 'జనగణమన', ఇక్బాల్ 'సారేజహాస అచ్ఛా' అను గేయములు గొప్ప జాతీయ గేయములు. అయినను అవి భారతదేశ సంకీర్తనమే ప్రధాన లక్ష్యములుగా గల గేయములు. సాధారణముగా ఏ దేశము జాతీయ గీతమైనను, ఈ ధోరణిలోనే ఉండును. గురజాడ గేయములోని విశేషమేమనగా - ఇది ఒకవైపు స్వదేశియులలో జాతీయాభిమానము నూరిపోయుచునే, ఎల్లలుదాటి ఎగసిపోయి, సమస్త జాతులను, విశ్వ మానవ కోటిని పలుకరించుచున్నది. అందువల్లనే ఏ జాతీయ గేయమునకు లేని విశిష్ఠత దీనికి అబ్బినది. అందుకే ఈ గేయం విశ్వమానవ జాతీయ గీతంగా పరిగణించదగిందని చెప్పవచ్చును.
మానవతావాదం :
'తెలుగులో నవ్యరీతులకు నూతన ప్రమాణాలకు ప్రయత్నించిన మొదటి కవిని నేను. నా కావ్య కళా నవీనం. కావ్య ఇతివృత్తాలు భారతీయం. కవితలో నేను ఉత్తమ ప్రయోజనాలను ఉపలక్షించాను. జీవితాన్ని నూతన దృక్పథంతో దర్శించి కథా కవితా రూపంలో దాని తత్వాన్ని అన్వయించడానికి ప్రయత్నించాను. అని తానే స్వయంగా ఆదిభట్ల నారాయణదాసు గారికి రాసిన (1909) ఉత్తరంలో చెప్పుకున్నారు. గురజాడ 'భోగంపిల్లలో కూడా మానవత్వాన్ని చూడగలిగిన మహా రచయిత.
నేటి వర్తమాన సమాజం. 'వస్తువులకు' ఇస్తున్న ప్రాధాన్యత వ్యక్తులకు ఇవ్వటం లేదు. గురజాడ రచనల్లో అనన్యమైన మానవతా విలువలు, రాజకీయ, సామాజిక, ఆర్ధిక సంస్కరణల సంస్కర్త హృదయం దృగ్గోరచమవుతుంది. ఈ నాటి సమాజ స్థితిలో మంచితనం, మానవత్వం, సత్యం, ధర్మం నీతి, వంటి విలువలకు అర్ధాలు వెతుక్కోవలసిన స్థితి ఉంది. వేళ్ళ మధ్య నుంచి ప్రపంచాన్ని దర్శిస్తున్న వర్తమాన తరానికి, వారికి దిశానిర్ధేశం చేస్తున్న వ్యాపారాత్మక విద్యాసంస్థలు రూపొందించే ''సిలబస్' ఉపాధి కోసమే తప్పా విలువలు నేర్చుకొనేందుకు కాదని బోధిస్తున్నాయి. అందుకే గురజాడ తనకాలం కంటే శతాబ్ధం ముందు కాలాన్ని ఊహించే సాహిత్య కళకు మానవతను సంస్కరణాభిలాషలో అభ్యుదయ పంథాలో అక్షర బద్ధం చేసాడు. గురజాడ వారి ప్రతి రచనలో అద్భుతమైన మానవీయ విలువలు చిత్రణ కనిపిస్తుంది. సంఘ సంస్కరణ అంటే, మనిషి ని మార్చటం అనేది ఆయన రచనల్లోని అంతసూత్రంగా కనిపిస్తుంది.
గురజాడ వారు వర్ణ వ్యవస్థకు అస్పృశ్యతకు వ్యతిరేకంగా రాసిన గేయం ''ముత్యాలు సరాలు'' మూఢచారాల ముసుగులో మానవత్వం మంటగలిపిన సంఘటనలు కోకొల్లలుగా దర్శనమిస్తాయి. పాత విషయాలను క్రొత్తగా నేర్చుకోవలసిన ఆవశ్యకతను నొక్కిచెబుతారు. అక్షరాలను ఆయుధాలుగా మలచిన తీరు అద్భుతం.
గుత్తునా ముత్యాల నరములు
కూర్చుకొని తమైన మాటల
కొత్తపాతల మేలు కలయిక
క్రొమ్మెరుంగులు జిమ్మగా
పాత క్రొత్తల మేలు కలయిక సమాజంలో అనివార్యమని చెబుతారు. 'మంచిగతమున కొంచమేనోరు' అని పాత వరుసల నిరసనకు కాదని, మంచి గతమునా కలదనే క్రొత్త పల్లవులు అవసరమని వివరిస్తారు. మానవత్వపు నీడన ఏవగించుకునే విద్య ప్రస్తుతం సమాజంలో ఉందని వాపోతారు. మానవత్వం మనిషి మనిషిని దగ్గర చేర్చాలి. మతాలన్ని ఇదే సూత్రాన్ని వివరిస్తున్నాయని చెబుతారు.
యెల్లలోకము నొక్కయిల్లై
వర్ణభేదములెల్ల కల్లై
వేలనేరుగని ప్రేమ బంధము
వేడుకలు కురియ
మతాల సారం కన్నా మానవత్వపు దూరం నిరసించదగినది. కాని మనిషి స్వార్ధంతో మానవీయ విలువలను వదిలేస్తున్న వ్యవస్థ వర్తమానంతో ఉంది. కాని జ్ఞానంతో కూడిన చదువు నేర్పితే వర్తమాన భావితరాల వారు మతాలను నిరసించకుండానే 'మనిషి'లుగా ఎదిగే అవకాశాలున్నాయి.
మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును
అంత స్వర్గ సుఖంబులన్నవి
యవనీ విలసిల్లున్
వర్తమానంలో తల్లిదండ్రుల పట్ల అమానవీయ వైఖరి ప్రదర్శిస్తున్న వ్యక్తుల సమూహంను నిత్యం చూస్తునే ఉన్నాం. ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపేసే వారు, వారు వృద్ధాప్యంలో ఉంటే సేవ చేయలేని పిల్లలు, వారిని శ్మశానంలో వదిలిపెడుతున్న దైన్య చిత్రాలు మీడియాలో చూస్తునే ఉన్నాం. బాధ్యతల్ని గుర్తు చేయటానికి తల్లిదండ్రులు, సంఘసంస్కర్తలు అవసరమే. వ్యవస్థ మారాలంటే వ్యక్తుల్లో విలువలపై దాడి చేస్తున్నారు. మానవతా వాదాన్ని మట్టిగలుపుతున్నారు. సంపదలు ఉంటే సంసారాలు - బంధాలు సఖ్యంగా ఉంటాయనే భ్రమలో కొంతమంది బతికేస్తున్నారు. మనుషుల మధ్య సఖ్యతకు ఐక్యత అవసరం. అంటరాని తనం ఇంకా కొనసాగుతూనే ఉంది. పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కన్యక, పూర్ణమ్మ, కాసులు వంటి రచనల్లో కూడా గురజాడ వారు తన మానవతా వాదాన్ని విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును. ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును. ఇది గురజాడ వారి ప్రేమతత్వం.