Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--వురిమళ్ల సునంద, ఖమ్మం
సెల్: 9441815722
గురజాడ...ఈ పేరు వినగానే తెలుగు సాహిత్యం పులకించిపోతుంది. భాషామతల్లి కన్నులు కాంతులు వెదజల్లుతాయి. ఆధునిక భాషా సాహిత్యాల యుగకర్తగా గురజాడ అప్పారావు పేరు అజరామరం. తెలుగు భాషా సాహిత్యాంలో వచ్చిన రెండు పెద్ద మార్పులలో మొదటిది వెయ్యేళ్ళ క్రితం కవులు తెచ్చిన మార్పు మొదటిది అయితే సుమారుగా నూటా పాతిక సంవత్సరాల క్రితం వచ్చిన మార్పు రెండవదిగా చెప్పవచ్చు. ఇది గురజాడ అప్పారావు ద్వారా (1862-1915) వచ్చింది. ఈ రెండు మార్పులకు వెనుక ఉన్నవి రెండు విధాలైన చారిత్రక పరిస్థితులని అర్థం అవుతుంది. నన్నయ్య, పాల్కురికి సోమనాధుడి కాలంలో తెలుగు భాషా వికాసానికి అనుమైన సామాజికత పునాదిగా వుంది. భూ స్వామ్యవర్గం వారి అవసరాలు, నమ్మకాలు, అభిరుచులు అప్పటి నాగరికతలో ప్రతిఫలించిననట్లుగానే భాషి సాహిత్యాలలోనూ ప్రతిఫలించాయి.
ప్యూడల్ వర్గం, ఆ వర్గ భావాలు గురజాడ అప్పారావు కాలం వరకూ పాతుకుపోయి ఉండటం వలన ఎనిమిది శతాబ్దాలు గడిచే వరకూ సాహిత్యంలో పురాణ రచన(నుండి) దశ నుండి ప్రబంధ రచన వంటి చిన్న చిన్న మార్పులు తప్ప పెద్దగా మార్పులు జరగలేదు. కఠిన శైలిలో కాకుండా కొత సులభ శైలిలో బసవపురాణం, పాల్కురికి సోమనాధుడు 12వ శతాబద్దం, రంగనాథ రామాయణం 13వ శతాబ్దం, పల్నాటి వీర చరిత్ర, 14వ శతాబద్దంలో కొంత కొత్త పోకడలు వచ్చాయి కానీ అంతగా ప్రభావితం చేయలేదు. అయితే గురజాడ అప్పారావు కాలానికి కాస్త ముందు నుంచి ఆంగ్లేయుల పాలన మూలంగా ప్యూడలిజం క్షీణించడం, పెట్టుబడిదారీ బంధాలు నానాటికీ గట్టి పడడంతో పాటుగా ఇంతకు పూర్వం లేని విధంగా ఆధునిక విద్య వ్యాపించడం, హేతు బద్దమైన శాస్త్రీయ దృష్టిని అలవర్చుకునే మధ్య తరగతి విద్యావంతులు రూపొందడం జరిగింది. మొదటి మార్పు వల్ల సంస్కృత భాషా సాహిత్యాల పట్టు కొంత సడలిం ప్రజాస్వామ్యానికి వాడుక భాష కాని సంస్కృతం స్థానంలో తెలుగు భాష నెమ్మదిగా చోటు చేసుకోవడం జరిగింది.
ఇక రెండవ పెద్ద మార్పు వల్ల ప్రజల వాడుకలో లేని ప్రాచీన తెలుగు భాషా సాహిత్యాల హోరు తగ్గి వ్యవహారిక భాష కావ్య భాష అయ్యింది. తెలుగును కావ్యభాషగా రూపొందించడం ఒక మహోపకారం. ఇది గురజాడ అప్పారావు తెచ్చిన రెండవ పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు. ఈ రెండో మార్పు యదార్ధ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, పురోగతిక దారి చూపి విస్తృత ప్రజానీకంతో వెనవేసుకుంది. దివి నుండి భూవికి భాషా సాహిత్యాలను తీసుకురావడంతో గురజాడ అపర భగీరధుని ప్రాత వహించారు. తన యొక్క దీక్ష దక్షతలతో ఈ చారిత్రక అవశ్యకతను సాధించడంతో ఆధునిక భాషా సాహిత్యాల యుగాన్ని ప్రారంభించిన ఘనత గురజాడకు దక్కింది. అందుకే గురజాడను ఆధునిక భాషా సాహిత్యాల యుగకర్త అనడంలో ఎంతైనా ఔచిత్యం ఉంది.ఈ విధంగా ఆధునిక భాషా సాహిత్యాలకు ఆరంభకుడైన గురజాడ వెంకట అప్పారావు జీవిత విశేషాలు తెలుసుకుందా. గురజాడ వెంకట అప్పారావు కుటుంబం కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి తరలివచ్చింది. గురజాడ తండ్రి వెంకట రామదాసు, తల్లి కౌశలమ్మ, గురజాడ తన మాతామహుల ఇంట 1862 సెప్టెంబర్ 21న విశాఖపట్నం ఎలమంచిల తాలూకాలోని రాయవరంలో జన్మించారు. వీరి తండ్రి చీపురుపల్లిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు పదేళ్ళ వయసు వరుకు అక్కడ చదువుకున్నారు. అనంతరం బి.ఏ పట్టా తీసుకునే వరకు విజయనగరంలో గిడుగు రామమూర్తితో కలిసి చదువుకున్నారు. వీరిద్దరూ చిన్నప్పటి నుండి ప్రాణమిత్రులు. గురజాడ విద్యాభ్యాసం పేదరికంలో సాగింది. ఉదారుడైన విజయనగరం మహారాజు కాలేజీ ప్రిన్స్ పాల్ సి. చంద్ర శేఖర శ్రాస్తి తమ ఇంట వసతి, భోజనం కల్పించారు. వారి సహకారంతో మెట్రిక్యూలేషన్ పూర్తి చేశారు. అప్పడే కవిత్వం రాయడం మొదలు పెట్టిన గురజాడ 'కుక్కు' అన్న ఇంగ్లీషు పద్యాన్ని రాశాడు. ఆ తర్వాత 1883 'సారంగధర' అనే ఇంగ్లీషు పద్యకావ్యం ప్రచురణ అయ్యింది. ఈ కావ్యాన్ని మెచ్చుకొని అప్పటి ప్రముఖ కలకత్తా పత్రిక 'రీస్ అండ్ రయ్యత్' (రాజు, రైతు) అన్న ఇంగ్లీషు పత్రికాధిపతి శంభు చంద్ర ముఖర్జీ దానిని తన పత్రికలో రెండవసారి ప్రచురించడం జరిగింది. ఇవే కాకుండా 'చంద్రహాసం', అన్న ఇంకొక పెద్ద ఇంగ్లీషు కావ్యం రాశారు. ఈ విధంగా మొదలైన గురజాడ రచనా వ్యాసంగంతో విజయనగరం మహారాజు ఆనంద గజపతితో పరిచయం ఏర్పడటానికి ఆ పరిచయమే ఆత్మీయతా అనుబంధంగా మారడం జరిగింది.
ఆ సమయంలోనే ఆనంద గజపతి మహారాజు విశాఖ మండలంలో జరుగుతూ ఉన్న కన్యాశుల్క వివాహాల వివరాలు సేకరించడం ఆ వివరాలతో బయటపడిన అతిదారుణ విషయాలు గురజాడ 'కన్యాశుల్కం' రాయడనికి ప్రేరణగా నిలిచింది. 'కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్ల అవుతుందో కాదో తెలియక పోయినా బేరసారాలు కొనసాగేవి'. ఈ విషయం ఆనంద గజపతిని ఎంతో కలిచివేసింది. తనను ఇంతగా బాధించిన ఈ దారుణ దురాచారాన్ని యితివృత్తంగా చేసుకుని నాటకం రాయమని తన మిత్రుడైన గురజాడకు సూచించారని అందుకే గురజాడ రాసి వుంటారని అంటారు కొందరు. ఏది ఏమైనా గురజాడ రాసిన 'కన్యాశుల్కం' రెండు కూర్పుల పీఠికల్లోనూ (1897,1909) అంకిత పత్రంలోనూ ఉన్న గురజాడ ప్రవచనాలు ఆధునిక భాషా సాహిత్యాలకు పవిత్రపదేశాలు. అవి ఆయన ప్రారంభించిన ఉద్యమానికి రళ్ళు. కావ్యభాష కంటే తెలిసేది వాడుక భాష కాబట్టి 'కన్యాశుల్కం' వడుక భాషలో రాశాడు. ఇటువంటి రచనలూ గురజాడను ఆధునిక సాహిత్య యుగకర్తను చేశాయి.
''సాంఘిక అవినీతి క్రిములతో నిండిన దుర్భర దాస్యం నుండి మహిళలను కాపాడడానికి'' సమాజాన్ని అప్రతిష్ట పాలు చేసే పరిస్థితిని కళ్ళ ఎదుట పెట్టి, నైతిక భావాల ఉన్నత ప్రమాణాన్ని ప్రాచుర్యానికి తేవ కంటే ఉత్తమమైన ఉండదు అంటారు గురజాడ. రాను రాను వారి పరిప ఇతర రచనలలోనూ కనిపిస్తూంది. సంఘంతో సాహిత్యానికి ఉండవలిసిన సన్నిహిత అనుబంధాన్ని, సాహిత్యా ప్రయోజనాన్ని నొక్కి చెప్పే ఉద్ఘోష ఇది. సమాజ శ్రేయస్సుకు పాటుపడటం ఆయన 'దీక్షా విధి'.
గురజాడ రచనలు:
కాటికి కాళ్ళు కాచుకొని వున్న ముసలి పెళ్ళి కొడుకులకు పసిపిల్లిల్ని డబ్బు కక్కుర్తి వల్ల అమ్ముకోవడం గురజాడ దృష్టిలో సమాజాన్ని అప్రతిష్టపాలు చేసే పూర్ణమ్మ కథ. 'మలిన చిత్తులకు' అగ్రకులాలు 'మలిన వృత్తులకు' నీచకులాలు విధించిన వర్ణ ధర్మం, అధర్మధర్మం, 'లవణరాజుకల' మంచి అన్నది మాల అయితే మాలనే అగుదున్ అని ధిక్కార స్వరం వినిపించిన గురజాడ స్త్రీల ఆత్మ రక్షణ కోసం ప్రతిఘటనను ప్రతిపాదిస్తూ 'కన్యక' సౌధామిని అన్న అసంపూర్ణ నవల రాశారు. అ మనిషి చేసిన రాయి రప్పకు మహిమ కలదని సాగి మొక్కుతు మనుషూలుంటే రాయి రప్పల కంటే కనిష్టంగా చూసేవారి పట్ల నిరసనతో 'మనిషి' అనేది. మత మూఢాచారాలను ఖండిస్తూ 'దేవుడు చేసిన మునుషుల్లారా, మునుషులు చేసిన దేవుళ్ళారా మీపేరేమిటి' వేశ్యా వ్యామోహం గురించి ఎగతాళి చేస్తూ 'దిద్దుబాటు' సంస్కర్త హృదయం అలాగే వేశ్యా వివాహాల ప్రతిపాదన మధురవాణి సంస్కర్త హృదయంలోని సరళప్రాత. వితంతు వివాహాలను ప్రోత్సాహం ఇస్తూ 'కన్యాశుల్కంలోని బుచ్చము, కొండు భట్టేయంలో పార్వతి సకల కులాల సహపంక్తి భోజనాలను సమర్ఫిస్తూ ముత్యాల సరమూలు, స్త్రీ విద్యకు ప్రోత్సాహం ఇచ్చే 'దిద్దుబాటు' లాంటి వెన్నో గొప్ప రచనలు చేసిన గురజాడ కొత్త దృక్కోణంతో 'దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్'అన్న కొత్త సత్యాన్ని చాటిచెబుతారు.
గురజాడ 1910లో రాసిన దేశభక్తి గీతం ప్రపంచగీతంగా చెప్పుకోవచ్చు. రవీంద్రనాథ్ టాగూర్ ఇంటా-బయటా అన్ నవలలో కూడా గురజాడ భావం ప్రతిధ్వనిస్తుంది. దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా అంటారు. పాడిపంటలు పొంగిపోర్లే దారిలో నువు పాటు పడమనీ, కళలు ఎన్నో నేర్చుకొని దేశి సరుకులు నింపమని అంతేకాకుండా మట్టి గొప్పలు చెప్పుకోవడం మానేసి మేలు కూర్చేది చేసి జనులకు చూపమనీ 'సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడ్పడాలనీ, అన్నదమ్ములను జాతులు మతములన్నియు మెలగమని ప్రబోధించే దేశభక్తి గీతంలో ఇంకా ఏమంటారంటే యిసురోమని మనుషులుంటే దేశప్రగతి బాగుపడుతుంది అంటారు. ఈ గీతం దేశసమైక్యత, మత సామరస్యం, దేశ శ్రేయస్సును ప్రబోధిస్తుంది. ఇంకా వర్ణభేదాలు కల్ల కావాలనీ, యెల్లలోకం ఒక్క ఇల్లుగా వుండాలని, జాతి బంధాలున్న గొలుసూలు జారిపోయి, మతాలన్నీ మాసిపోయి జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగుతుందని అంటారు. ఈ విధమైన గురజాడ ఆశయాలు ఆదర్శాలు మనుధైక కుటుంబ భావనకు ప్రతిధ్వనులు. గురజాడ తన ఆశయాలను ఆదర్శాలను వెల్లడించాక ఇప్పటి వరకు ఎన్నో దశాబ్దాలు గడిచాయి. అయినా అనకున్నంత మార్పురాలేదు. అభివృద్ది ఫలితాలు సామాన్యులకు పూర్తిగా అందడంలేదు. దేశమంటే మట్టిగానే కానీ మనుషులుగా భావించడం లేదు.
గురజాడ సాహిత్య సమాలోచన: గురజాడ నాటకం, కధానిక, కావ్యం... ఇలా అనేక ప్రక్రియల్లో రచనలు చేశారు. నాటకం ~ ఈ ప్రక్రియానే 'కన్యాశుల్కం' నాటకం వ్యవహారిక భాషకు పట్టంకట్టిన దృశ్యకావ్యం. మరొకటి 1906లో రచించిన కొండు భట్టీయం. ఇందో అద్భుతమైన నాటకం. ఈ నాటకం సాంఘిక దురాచారాల మీద సూటిగా దాడి చేసిన గొప్ప నాటకం.
కథ: గురజాడ ఐదు కథలను రాశారు. 1. దిద్దుబాటు, 2. సంస్కర్త హృదయం, 3. వెకటిలాడి 4. పెద్ద మసీదు, 5. మీ పేరేమిటి ఈ ఐదు కథలు సంస్కరణోద్యమాన్ని బలోపేతం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. సమాజాన్ని పీడించే సాంఘిక సమస్యలపట్ల గురజాడకు ఆవేశం కంటే ఆలోచనే అధికంగా ఉండేది. మానవతా దృష్టి, వాస్తవాలకు అక్షర రూపం ఇచ్చి పాఠకులకు అందజేసేవారు. ఈ విధంగా సమాజాన్ని చైతన్య పరిచేందుకు సమాజంలోని దురాచారాలను రూపుమాపేందుకు నాటకం కథలే కాకుండా ముత్యాల సరాలు కూడా రచించారు.
కవితలు/గేయాలు/గీతాలు: గురజాడ రాసిన కవితల్లో కథాత్మాక కవితలు, ముత్యాల సరాలు, పిల్లలు పాటలు, వ్యంగగీతం, నీలగిరి పాటలు, సంప్రదాయ కవితలు, ఆంగ్లీ గీతాలు మొదలైనవి ఎన్నో రాసిన గురజాడ తనది ప్రజల ఉద్యమం దానిని ఎవరిని సంతోషపెట్టడానికైనా వదులుకోలేదు.... నా ఆశయం, ప్రజల ఆశయం, సంస్కార వంతుల సదభిప్రాయం నాకు అండగా వుంది అన్నారు గురజాడ.
ఈ విధంగా గురజాడ ఆధునిక భాషా సాహిత్యాల యుగకర్తగా పేరొందారు. గురజాడ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే పేదరికం నుంచి వచ్చిన కవి గురజాడ. 1884 విజయనగరం మహారాజు కాతజీ హైస్కూల్ లో 25 రూపాయల జీతంతో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. 1885లో దేవరపల్లి గ్రామనివాసి అయిన శ్రీ ఎల్లాప్రగడ సన్యాసిరాజు కుమార్తె అప్పల నర్సమ్మతో వివాహం జరిగింది. 1886లో ఉద్యోగానికి సెలవుపెట్టి డిప్యూటి కలెక్టర్ ఆఫీసులో హెడ్ క్లర్క్ గా, 1887లో కాలేజీలో లెక్చరర్ గా వంద రూపాయల జీతంతో, 1891లో లెక్చరర్ గా నూటా పాతిక రూపాయలతో, 1895తో సంస్థాన శాసన పరిశోధక పదవిని చేపట్టారు. 1913లో రూ.140 పెన్షన్ తో ఉద్యోగ విరమణ చేశారు. వీరికి ఇద్దరు కమార్తెలు ఓలేటి లక్ష్మీ నర్సమ్మ, పులిగెడ్డ కొండయమ్మ, ఒక కుమారుడు వేంకట రామదాసు. 1913లో మద్రాసు విశ్వ విద్యాలయం 'ఫెల్లో' పదవి ఇచ్చింది. ఈ విధంగా ఉపాధ్యా, లెక్చరర్ ఉద్యోగాలను పరిశోధక, ఫెల్లో పదవిని నిర్వహించిన గురజాడ 1915 నవంబర్ 30న మరణించారు.
ఈ విధంగా గురజాడ కవితా వాహిని అనేక పాయలుగా తెలుగు సాహిత్యంలో ప్రవహించినది. గురజాడ అప్పారావు వెలుగుదారి చూపిన మూల పురుషుడుగా, నవ కవితా పితగా, నాటక కర్తగా, వాడుక భాషా నిర్మాతగా, ఖ్యాతికెక్కారు. భాషా సాహిత్యాల విషయంలోనే కాదు సర్వే విషయాలలోనూ ప్రజాహితాన్ని త్రికరణ శుద్ధి కోరిన గురజాడ. అపాసాన దశలో సైతం తాను నమ్మిన ఆదర్శాల కోసం తపించి పోయారు. ప్రాణం పోవడానికి కొన్ని క్షణాల ముందర కూడా బతికి వుంటే ఆహార శాస్త్రం మీద పుస్తకం రాస్తానని డాక్షరుతో అన్న మహామనిషి. తెలుగు ప్రజల హృదయాల్లో గురజాడ సదా చిరంజీవి. తెలుగు సాహిత్య యుగకర్తగా అజరామరుడే. అభ్యుదయ కవితా పితామహుడుగా, 'కవిశేఖర' బిరుదాంకితుడుగా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గురజాడ తన రచనల ద్వారా సమాజ మార్పు కోసం నిరంతరం కృషి చేసిన గురజాడ ప్రజాహితాన్ని త్రికరణ శుద్ధితో కోరుకున్నా మహనీయుడు. అలాంటి గురజాడ అడుగుజాడల్లో నడవడం కవులు రచయితాలుగా మన విద్యుక్తధర్మం, గురజాడకు సాహిత్య వారసులుగా మనం సమాజ శ్రేయస్సుకు సంబంధించిన సాహిత్యాన్ని సృజన చేయాలి. మన తెలుగు భాషను కాపాడుకుంటూ ముందుకు సాగాలి.