Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శశికళ.బి,
ఆ.వె
వసుధలోన బుట్టె వాసవీ కన్యక
కుసుమ రాజు యింట కూతురిగను
కుసుమ కోమలముగ ముసిముసి నగవులు
అతడు సంతసిల్లె సుతను జూచి !
ఆ.వె
మేని రంగు జూడ మేలిమి బంగారు
కలువ రేకు వంటి కనుల దీరు
నీలి కురులు జూడ నీలాల మేఘాలు
నిరుపమాన వనిత ధరణి లోన!
ఆ.వె
చదువు సంధ్య నేర్చి సంస్కార వతియయ్యె
హృదయ మంత జూడ మృదువుగాను
మధుర భాషణంబు మర్యాద మన్నన
మంద హాస వదన సుందరాంగి !
ఆ.వె
తనువు నందు లేవు తామస గుణములు
సత్వ గుణము నిండె యాత్మ యంత
రాజసముగ వెలిగి రాణించు చుండెను
యెన్న దగిన యట్టి కన్య యామె !
ఆ.వె
ఆట పాట లోన మేటిగా యుండెను
నీతి వంతమైన రీతి కలిగి
తోటి వారాలామె బాటలో నడిచిరి
శుక్ల పక్ష చంద్ర శోభ కలిగి!