Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కె.రోహిణి దేవి,
హన్మకొండ- అర్బన్
9177580750
'కవికోకిల కరము తోడ
సాహితీ సుక్షేత్రమందు కృషీవలుడై,
అనావృష్ఠి, గాలివానల్ని ' పసిడి ' పంటగా
'గబ్బిలం' నందు దండిగా పండించినావు!
కవితావిశారదా!
అప్పువడ్డది సుమీ భరతావని మీ సేవలకు,
నరుని కష్టబెట్టి నారాయణుని గొల్చెడి,
ధర్మశీలురున్న ధరణిలోన
గబ్బిలమొక్కటే ముప్పది మూడుకోట్ల దేవతల ప్రశ్నించ-
వాయుమార్గాన పయనించి సాగిపోయే!
కవిదిగ్గజా!
క్షుధాగ్ని పీడితుల క్షుత్తులార్చిన,
మీ కరముల మధురఫలములకు
వరియించె గండపెండేరమె వీ కరకంకణముగాను!
విశ్వకవి సామ్రాట్టువై
గజారోహణమెక్కి పగటి దీపాల పల్లకిలో నూరేగి
ఆగామి యుగంలో అడుగిడిన 'గబ్బిలం'
పీడక వర్గాల నణగద్రోక్కించినావు
ఓ! నవయుగ కవి చక్రవర్తి
నీ వాక్కులు చిరస్మరణీయమై
తెలుగు కళామతల్లి కంఠహారములైనాయి!
కవి దిగ్గజా!
మీ సుకావ్య స్పర్శ దశదిశల కీర్తిపతాకమై
ధళిత సూర్యుడి శిరసు నలరించిన ' అగ్నికిరీటం'!