Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పింగళి. భాగ్యలక్ష్మి
సెల్: 9704725609
గుఱ్ఱం జాఘవా తెలుగు సాహితీ పూతోటలో విరబూసిన సాహితీ సుగంధపు పుష్పం.ఆయన పేరు వింటేనే మల్లెలు పరిమళల్న వెదజల్లుతాయి.గులాబీలు గుభాళిస్తాయి. సాహితీ పూతోటలో ఆయనదొక ప్రముఖ స్థానం. ఆయన కవితా కంఠం విలక్షణం. ఆయన పద్యాలలోని శబ్ద సౌందర్యం గుండెలను తాకుతుంది. కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపై తిరగబడ్డ మహాకవి. సంఘసంస్కరణే ఆయన కావ్య లక్షణం. వర్గ సంఘర్షణ, ఆర్థిక వ్యత్యాసాలు, దోపిడి వర్గాలపై తిరుగుబాటు చేసిన ఈ అభ్యుదయవాది 1895 సెప్టెంబర్ 28న వీరయ్య,లింగమ్మ దంపతులకు యింట జన్మించారు. తల్లిదండ్రులు వేర్వేరు కులాలు కావడంతో అందరు ఆ కుటుంబాన్ని చిన్న చూపు చూసేవారు. జాఘవా వినుకొండలో ప్రైమరీ స్కూల్లో చేరారు. స్కూల్లో చేరినప్పటి నుండి అంటరానితనం జాఘవాను పీడించింది. ఎన్నో అవమానాలను కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నత విద్యను వినుకొండలోనే విజయవంతంగా పూర్తి చేశారు.
1910లో మేరీని వివాహం చేసుకున్నారు. చిన్న వయసైనా ఆమె కూడా జాఘవా భావాలను అనుగుణంగా నుడుచుకుంటు అన్నింటా ఆయనకు అండాదందగా వుంటూ ఎప్పుడు ఆయన వెన్నంటే వుండేవారు. పెళ్ళి తర్వాత జాఘవా మిషనరీ పాఠశాలలో నెలకు వెయి రూపాయల జీతంపై చేరారు. ఆ తర్వాత రాజమండ్రీ వెళ్ళి 1915-1916లలో అక్కడ సినిమా ప్రచారకునిగా పని చేశారు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలోని కథను,సంభాషణలను చదువుతూ పోవడమే సినిమా ప్రచారకుని పని. ఆ తర్వాత గుంటూరులో టాఫరన్ చర్చి నడుపుతున్నపుడు ఉపాధ్యయ శిక్షణాలయంలో ఉపాధ్యాయునిగా పది సంవత్సరాలు పనిచేశారు. ఇంకా ఆ తర్వాత గుంటూరులోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థుల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు.
ఇలా ఉపాధ్యాయ వృత్తిని మొదలుపెట్టినప్పటి నుండి అంటే చిన్నతనం నుండి జాఘవాకు సాహిత్యం,కవిత్వాలపై మక్కువ ఎక్కువ. అలాగే సృజనాత్మక శక్తి కూడా వుండేది. బొమ్మలు గీయడం,పాటలు పాడటం చేసేవారు. బాల్య స్నేహితుడు, ఆ తర్వాతి కాలంలో రచయిత అయిన దోపాల పిచ్చయ్య శాస్త్రిగారి సాహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆశక్తి కలిగింది.జూపూడి హనుమత్ శాస్త్రిగారి దగ్గర మేఘ సందేశం, రఘవంశం, కుమార సంభవం నేర్చుకున్నారు. సాహిత్యం ఉన్నత వర్గాలకు పరిమితమైన ఆరోజుల్లోనే జాఘవా తమ కులలా, జాతులపై జరిగిన దాడులను, వివక్షతలను, జీవన సంఘర్షణలను, దుర్బర బతుకుల వెదనను అక్షరీకరిస్తూ అసలు సిసలైన కవిత్వాన్ని, సాహిత్యాన్ని సృష్టించారు. తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక భవాలు ప్రవేశించిన కాలంలో అట్టడుగు వర్గాల ప్రజలు కావ్య వస్తువులుగా వున్న సమయంలోనే పద్యాలకు ప్రాణంపోసి సామాజిక దురన్యాయలను ఎండగడుతూ కాలమనే చూరకత్తిని ఝళిపిస్తూ సాహితీ కథన రంగాన మెరుపు తీగలా వచ్చిన కలం యోధుడు గుఱ్ఱం జాఘవా. ఛందస భావాల సాహిత్యాన్ని ఒక ఊపుఊపి ఆధునిక భావాలకు అట్టడుగు వర్గాలగాథలకు పట్టంకట్టి తెలుగు సాహితీ కళామ తల్లికి అక్షర నీరాజనం అర్పించిన కవికోకిల.భావకవితా యుగంలో వాటికి అతీతంగా వుంటూ మానవ జీవితాన్ని సందేశాత్మకంగా, ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱం జాఘవా. ఏ వస్తువు తీసుకున్నా దానిని కవితాత్మకంగా తీర్చిదిద్దడం ఆయన అద్వితీయ ప్రతిభకు నిదర్శనం.
ఈ ప్రతిభమూర్తి కరుణ రసార్థమైనటువంటి భావజాలంతో హృదయ వేదనలను ఎంతో ఆవేదనా భరితంగా తన కవిత్వంలో వినిపించారు.అలాగే తరతరాలుగా అగ్రవర్ణాలవారు దళితులపై దండయాత్ర చేస్తూ వారిని వెలిబాటకు బలి చేస్తుంటే ఆయన చలించిపోయారు. దళితులను నలుగురిలో కించపరుస్తూ, వంచించి అవమాన పరుస్తుంటే ఆ మహాకవి తట్టుకోలేకపోయారు. ఆవేదనా భరతమైన హృదయంతో పద్యమై, పద్యార్థమై గర్జించి తన దళిత ధిక్కార స్వర ప్రభంజనం వినిపించారు. అలాగే ఒక పక్క అంటరానితనం ఆర్థిక అసమానతలు వర్ణ,కుల వ్యవస్థలతో సమాజం విలయ తాండవం చేస్తూ, ఇంకా దోపిడీ వర్గాలు అసమానతలను పెంచి పోషిస్తుంటే వాటన్నింటిని చూసి చలించి, జ్వలించి బాధాతప్త హృదయుడై ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు,వేలు వ్యయింతూరు కాని దుఃఖితులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలలో మెతుకు విదల్చనోని నిలదోసిన సాంఘిక విప్లవ కారుడు. ఇంకా ముప్పది మూడు కోట్ల దేవతలున్న భారతావనిలో అభాగ్యుల ఆర్తనాధాలు ఎవరికి వినిపిస్తాయి అంటూ ఆవేదన చెందిన కారుణ్యమూర్తి. అందుకే ఆయన తన కలానికి మరింత పదునుపెట్టి మానవీయధృక్పధానికి అద్దంపట్టే పద్యాలు దళిత వేదనే ధ్వనిగా, కరుణ రసావిష్కరణే కావ్యాత్మగా, అణగారిన జాతిజనుల ఈతిబాధలనే కావ్య వస్తువులుగా, సామాన్యుల భాషా పదాలే పద్యా శిల్పాలుగా వినిపిస్తూ పద్యాలకు ప్రాణంపోసిన కవి దిగ్గజం జాఘవా.
అలాగే అంబేద్కర్ లాంటి మహాకవులు మనుధర్మ శాస్త్రాన్ని పక్కకు నెట్టి సరికోత్త రాజాంగాన్ని సృష్టించి దళిత వాడల్లో వెలుగులు నింపారు. అదే కాలంలో కలం ఝళించిన జాఘవా దళితుల యదార్ధ దృశ్యాలను ఆర్థ్ర హృదయంతో రసవత్ కావ్యాలుగా, అఖండ కావ్యాలుగా చిత్రించి దళిత సాహిత్యానికి పెద్దపీట వేశారు. ఇంకా మన జీవితాన్ని ఎంతో సందేశాత్మకంగా తీర్చిదిద్దారు. ఇంకానేటి ఆధునిక దళిత సాహిత్యోధ్యమంలోని కావులకు గొప్ప ప్రేరణ అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
అలాగే ఆయన రాసిన కావ్యాలలో ఃగబ్బిలంః అత్యద్భుతమైన గొప్ప కావ్యంగా అభివర్ణించవచ్చు. అంటరాని కులాన్ని, ఒక దళితుణ్ణీ కథానాయకుడిగా చేసి గబ్బిలం కావ్యం రాసి సంచలనం సృష్టించారు జాఘవా. కథానాయకుడు తనగోడును కాశీనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే ఈ కావ్యం కధాంశం. మహాపురుషులు జన్మించిన ఈభరతావని కర్మభూమిలో దళితుడికి గుడిలో ప్రవేశంలేదు. కాని గబ్బిలానికి ఉందని చెప్తూ దళితుల దయనీయ పరిస్థితి ఉందంటూ హృదయ విదారకంగా ఈ కావ్యంలో వర్ణించడం మనసున్న ఏ మనిషినైనా తీవ్రంగా ఆలోచింప జేస్తుంది. ఈ కావ్యంలో కధానాయకుడు దరిద్రుడు, క్షుద్చాదోపీడితుడు. సంఘం వెలివేసినవాడు. వాస్తవానికి దగ్గరగా వుండి ఈ కావ్యం ఆనాటి దళితుల జీవన విధానానికి అద్దం పడుతుంది. ఈ కథలో కన్పించే దృశ్యాలన్ని కూడా ఆనాటి చారిత్రక, సామాజిక స్థితిగతుల్ని ఎంతో హృదయ విధారకంగా మన కళ్ళముందుంచారు. కరుణరసం ఉట్టిపడుతు అందర్నీ కంటతడి పెట్టించిన ఈ గబ్బిలం కావ్యం ఒక దళితుని సజీవ జీవన వేదనకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. మరో వెయ్యేళ్ళ తర్వాత కూడా ఈ కావ్యం చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలుస్తుందని ఘంటాపధంగా చెప్పవచ్చు.
జాఘవా తెలుగు సాహితీలోకానికి అద్భుతమైన ఖండకావ్యాలు రాశారు. ఆయన రాసినటువంటి ఖండ కావ్యాలు తెలుగు సాహిత్యంలో పూర్వం కూడా లేవనే చెప్పవచ్చు. ఆయన రాసిన ఖండ కావ్యాలు మహత్తరమైన ఒరవడికి కొత్తదైన రచనా విధానానికి మార్గం ఏర్పరచి ఆమహాకవిలోని మానవతావాదానికి అద్దం పట్టాయి. ఈకావ్యాలన్ని కూడా ఇలా సమత,మమత, మానవతల్ని తన కవితా పాదాలుగా చేసుకొని సామాజిక చైతన్యంతోపాటు సామాజిక స్పృహతో కూడిన ఖండ కావ్యాలను సాహితీ పూతోటలో విరబూయించి మరో అందమైన అద్భుత కావ్యం ఃకొత్తలోకంః. ఈ కావ్యం ఎన్నో మరెన్నో సరికొత్త ఆలోచనల్ని రేకెత్తించింది. ఒక కొత్త సాంఘిక వ్యవస్థ కోసం ఆయన పడ్డ తపన, ఒక సరికొత్త మార్పు కోసం ఆయన కన్న కలలు, సాంఘిక, సామాజిక చైతన్యం కోసం ఆయనపడ్డ తపన ఈ కొత్తలోకం కావ్యంలోని ప్రతి పద్యాపాదంలో ఎంతో గొప్పగా స్పూరించింది.
అలాగే జాఘవాకి స్త్రీలంటే అమితమైన గౌరవభావముండేది. ప్రభంధ కవుల విపరీతపు వర్ణనలు జాఘవా ముంతాజ్ మహల్ కావ్యంలో లేక పోవడం ఆయనలోని గోప్ప సంస్కారానికి నిదర్శనం. ఆయన ముంతాజ్మహల్ మదుర ప్రణయాన్ని ఎంతో ఔచిద్యంతో, శబ్ధ సౌందర్యంతో అవసరమైనంత మేరకే వర్ణించారు. దీనిని బట్టి జాఘవా ఎంత సామాజిక ధృక్పధంతో రాశారో మనం అర్ధం చేసుకోవచ్చు. ఆయన మృదుమధుర కరుణ రసభరితం, సేయత, మమత, మానవతల కలబోతల నిలయం ఆయన హృదయం. అందుకే ఆయన సత్యహరిశ్చంధ్రలోని పద్యాలను అంత అద్భుతంగా రాయగలిగారు. ఈ సత్య హరిశ్చంద్రలోని పద్యాలు ఎప్పటికి మరెప్పటికి సువర్ణాక్షరాలతో లిఖింపబడతాయి.
ఇంత గొప్పగా కావ్యాలు రాస్తున్నా కూడ ఆయన రెండు రకాలుగా వివక్షకు గురయ్యాడు. సమాజంలో ఒక పౌరునిగా వివక్షకు గురయ్యారు. ఒక కవిగా ఆయనకుండేటువంటి ఖ్యాతినిగాని ఆయన గొప్పతనాన్నిగాని గుర్తించడానికి ఆనాటి సమకాలీన పండితులు, కవులు కూడ ఆయన్ని దరిచేరనివ్వలేదు. ఈవిధంగా ఇటు కవిగా, అటు పౌరునిగా ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొన్నారు. అందుకే ఆయన హృదయం జ్వలించి అశ్వరేఖలుగారాలింది. మానవతా సౌరభాల్ని కూడ వెదజల్లింది. పేదరికంలోపుట్టి పేదల ఆకలి బాధలను చవిచూశాడు గనుకనే నగ సత్యాల్ని, కళ్ళకు కట్టినట్లు, కంటతడి పెట్టించే విధంగా రాయగలిగారు. అడుగడుగున పరాభవాల సుడిగుండంపై ధైర్యంగా నడవగలిగాడు కనుకనే ఖండ కావ్యాలను అద్భుతంగా ఖండఖండాలుగా ఖండాంతరాలు విరజిమ్మి తనలోని కవిహృదయాన్ని, సాహితీ వినుమీధుల్లో ఎగురవేశారు ఈ మానవతావాది.
ఆయన రచనా వ్యాసాంగంతో పాటు అనేక కీలక పదవుల్ని కూడ చేపట్టారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా పనిచేశారు. అలాగే మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేశారు. ఇంకా 1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం కూడ లభించింది. ఇలా ఆయన ఏ పదవినలంకరించినా ఆ పదవికే వన్నెతెచ్చే విధంగా ఎంతో వినయ విధేయతలతో పనిచేస్తూ అందరికి ఆదర్శవంతగా నిలిచారు. ఇంకా ఈ కవితాదీప్తి తన జీవితం ఎన్నో పాఠాలు నేర్పిందంటూ ఇద్దరు గురువులున్నారు అంటారు. ఒకరు పేదరకమైతే మరోకరు కులమత బేధం అంటూ చిరునవ్వుతో చలోక్తులు విసిరేవారు. ఒకరు తనలో సహనాన్ని నేర్పుతే మరొకరు ఎదిరించే శక్తిని నేర్పించారేకాని, బానిసగా మార్చులేదు అంటారు. కులమతాల్ని, దారిద్య్రాన్ని, కూడ చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలిచాను వాటిపై కత్తికట్టాను. అయితే నా కత్తి నా కవిత్వమే అంటూ ఎంతోగర్వంగా చెప్పకున్నారు గుఱ్ఱం జాఘవా.
ఈ నవయుగ కవిచక్రవర్తి, కవితా జ్యోతి ఆణిముత్యాలాంటి 36 గ్రంథాలు, ఎన్నో మరెన్నో ఖండికలు రాసి సాహితీ ప్రియులకందించారు. ఈ ఆణిముత్యాలు రుక్కిణీ కళ్యాణం చిదానంద ప్రభాత్వం, కుశలవాపాఖ్యానం, కోకిల, సంసార సాగరం, శివాణి ప్రబంధం, మీరాభాయి, కృష్ణా దేవరాయలు, సఖీ, బుద్దుడు, తెలుగు తల్లి, శిశువు, భాష సందేశం, భీష్ముడు, అనసూయ, సందేహడోల, అనాధ, ఫిరజేసి, ముంతాజ్ మహల్, వివేకానంద, ఆంధ్రభోజుడు, గబ్బిలము, బాపూజీ, నేతాజీ వంటి అద్భుతమైన కావ్యాలని సాహితీ పుతోటలో విరబూయించి సాహితీ ప్రియులమదిలో చిరస్థాయిగా నిలిచారు.
అలాగే ఈ జాతికవి, కవితాజ్యోతి సాహిత్యంలో చేసిన సేవలకు లెక్కకు మిన్నగా బిరుదుల్ని, పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఆయన రాసిన క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకడమి అవార్డునందుకొన్నారు. ఆంద్రా విశ్వవిద్యాలయం ఃకళాప్రపూర్ణః బిరుదుతో సత్కరించింది. అలాగే భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసి ఆయన ఖ్యాతిని మరింత ఇనుమడింప జేసింది. ఇంకా కవితా విశారద కవికోకిల, కవిదిగ్గజం, నవయుగ కవి చక్రవర్తి, మధురశ్రీనాధ, కళాప్రపూర్ణ, విశ్వకవి సామ్రాట్ లాంటి ఎన్నో బిరుదుల్ని సొంతం చేసుకొని భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాపితం చేశారు.
అలాగే తిరుపతి వెంకటకవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి జాఘవా కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మధన్యం చేసుకుకొన్నాను అన్నారు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాఘవా భావించారు. ఇంకా జాఘవా పేరుమీద ప్రభుత్వం వారు, తెలుగు అకాడమీ వారు, వారి కుమార్తె ఈ విశ్వకవి పేరుమీద ఎన్నో బిరుదుల్ని ప్రధానం చేస్తున్నారు. తెలుగు అకాడమీ జాఘవా పరిశోధనా కేంద్రంవారు జాఘావా విశీష్ట పురస్కారాన్ని 2012 సెప్టెంబర్ 28న రెండు లక్షల బాపూజీ, నేతాజీ నగదు పురస్కారాన్ని ప్రముఖ కవి ఆచార్య ఎండూరి సుధాకర్కి బహూకరించారు. ఇంకా వీరే దాశరధి రంగాచార్యకి జాఘవా జీవిత సాఫల్య పురస్కారం, ఇంకా కొలకటూరి స్వరూపరాణికి జాఘవా విశిష్టి మహిళాపురస్కారం బహుకరించారు. అలాగే దళిత సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు కాలువ మల్లయ్యకు బహూకరించి జాఘవాగారిమీదున్న అభిమానాన్ని చాటుకున్నారు ప్రభుత్వంవారు.
ఇంకా జాఘవాగారి కుమార్తె హేమలతాలవణం షోడో నెలకొల్పిన జాఘవా షౌండేషన్ ద్వారా భారతీయ భాషలలో మానవీయ విలువలతో కూడిన రచనలు చేసిన సాహిత్య కారులకు జాఘువా సాహిత్యపురస్కారాన్ని అందజేస్తూ కవులకు, రచయితలకు మంచిగుర్తింపునిస్తు ఈతరం సాహితీలోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. జాఘవాగారి పిల్లలు కూడ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారంటే మనమంతా ఎంతో గర్వించతగ్గ విషయం.
ఈ మానవతావాది, చుక్కల్లో చంద్రుడు కులమతాలకతీతంగా సామాజిక చైతన్యంతో ఏవస్తువు తీసుకున్నాదాన్ని కవితాత్మకంగా తీర్చిదిద్దె అద్వితీయ ప్రతిభతో మానవ జీవితాన్ని ఎంతో అద్భుతంగా, సందేశాత్మకంగా తీర్చిదిద్దారు. చదువు పోరాడు అన్న డాక్టర్ అంబేద్కర్ మాటల్ని జీవితంలో నిజంచేసి నిరూపించిన దళిత చైతన్య కవితాదోప్తి గుఱ్ఱం జాఘవా 1971 జూలై24న గుంటూరులో పరమపదించారు. ఆయన పద్యాలు, కావ్యాలు మాత్రం ఆచంద్రార్కం మనందరి నాలకలపై శివతాండవం చేస్తూనే వుంటాయి. అలాగే జాఘవా జీవితం, సాహిత్యం నేటికవులకు ఆదర్శం కావాలని ఆశిస్తూ ఈ చుక్కల్లో చంద్రునికి జేజేలర్పిస్తున్నాను.