Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మకూరు సత్యం
మహబుబ్ నగర్
సెల్.8374305513
ఆధునిక తెలుగు కవులలో ఆయనది ప్రత్యేక స్థానం .కవిత్వంలో ఆయన సృషించని అంశం లేదు.ప్రజల మనసుల్లో నిలిచిపోయిన చిరస్మర నీయుడు . సంఘ సంస్కరణ ఆయన కావ్య లక్ష్యం. కుల వివక్ష , వర్గ సంఘర్షణ , ఆర్థిక వ్యత్యాసాలు , దోపిడి వర్గాలపై తిరుగు బాటు చేసిన అభ్యుదయ వాది . చీత్కారాలు ఎదురైనా చోటే సత్కారాలు పొందారు.. ఆయనే గుఱ్ఱం జాషువా.
గుఱ్ఱం వీరయ్య , లింగమాంబలకు 1895 సెప్టెంబర్ 28 న గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని చాట్రగడ్డపాడు అనే కుగ్రామంలో గుఱ్ఱం జాషువా జన్మించారు. తల్లి మాదిగ , తండ్రి యాదవ కులం కావడంతో తండ్రిని కులం నుండి వెలి వేశారు. జాషువా చిన్నప్పటి నుండే అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. చదువుకోవడానికి బడిలో చేరినప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో బాధలు అనుభవించారు.అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేసేవారు.
1910 లో మేరిని పెళ్లి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతానికి ఉద్యోగం చేశాడు.ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్లి 1915,1916 లలో సినిమా ప్రచారకునిగా పని చేశాడు.ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయునిగా 10 ఏళ్లు పని చేశారు.1928 నుండి 1942 వరకు గుంటూరులోని ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు.రెండో ప్రపంచ యుద్ద సమయంలో యుద్ద ప్రచారకునిగా పనిచేశాడు. 1957- 59 మధ్య కాలంలో మద్రాస్ లోని రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్వాహకునిగా పనిచేశారు.
చిన్న తనంలో బొమ్మలు గీయడం, పాటలు పాడటం చేసేవాడు. మిత్రుడు పిచ్చయ్య శాస్త్రి సహచర్యంలో జాషువాకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం , రఘువంశం , కుమార సంభవం నేర్చుకున్నాడు . తన కవిత్వంలో ఆధునిక భావాలకు , అట్టడుగు వర్గాల గాథలకు పట్టం కట్టారు.మానవీయ దృక్పథానికి అద్దం పట్టే పద్యాలు అనేకం రాశారు.
20 వ శతాబ్దం విప్లవ భావాలు ప్రవేశించిన కాలం . రాజులకు , సంస్థానాధీశులకు , భూస్వాములకు ఊడిగంచేసి వారి సంస్కృతిని పురాణాలుగా , కావ్యాలుగా రాసి పబ్బం గడుపుకునే కవులున్న సమయం . ఒక వైపు అంటరానితనం , వర్ణ వివక్ష , కుల వివక్ష కుళ్లి కంపు కొడుతున్నాయి. మరో వైపు కర్మ సిద్ధాంతం పేరుతో దోపిడీని యదేచ్ఛగా కొనసాగిస్తూ అసమానతలను పెంచి పోషించడాన్ని చూసి చలించిపోయారు. అట్టడుగుకులాల , అల్ప సంఖ్యాక వర్గాలను కావ్య వస్తువులుగా చేసుకొని గబ్బిలం కావ్యం రాసి సంచలనం సృష్టించారు జాషువా.సామాజిక దురణ్యాయాలను ఎండగడుతూ అనేక రచనలు చేసారు.
అంటరాని కులాన్ని , ఒక దళితున్ని కథా నాయకు డిగా చేసి గబ్బిలం కావ్యం సృష్టించారు . తన గోడును కాశీనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే కావ్య కథాంశం . దళితులకు గుడిలోకి ప్రవేశం లేదు. కానీ గబ్బిలానికి ఉందంటూ ఈ కావ్యంలో వర్ణించారు.ఈ కావ్యం ఆనాటి దళితుల చారిత్రక , సామాజిక జీవన విధానానికి అద్దం పడుతుంది. సమాజంలోని అంటరానివాని స్థితిని ఇంత హృద్యంగా వేదాంత ధోరణితో కూడిన ధిక్కార స్వరపు కవితా ఝరి ఆయన కవిత్వం. గొప్ప కావ్యాలు రాసినప్పటికీ ఆయన రెండు రకాల వివక్షకు గురయ్యారు.పేదరికంలో పుట్టి పేదల ఆకలి భాదలను చవిచూశారు. కాభట్టే ఆనాటి పరిస్తితులను కళ్ళకు కట్టే విధంగా హృదయం ద్రవిం చే విధంగా రాయగలిగారు.పేదల గురించి చెప్తూ... వాడు చమటొడ్చి ప్రపంచానికి భోజనం పెడతాడు కానీ అతనికి మాత్రం భుక్తి గడవదు అని అంటాడు. ఇతన్ని ఉద్ధరించే దేవుడు లేడు మనిషి మాత్రం ఎట్లా కనికరిస్తాడు. అతను చేసుకున్న పాపమేమిటో అతనికి ఇంత వరకు తెలియదు. ఏటా బొమ్మల విగ్రహాలకు పెళ్లిళ్లు చేయటానికి వందలు , వేలూ ఖర్చు చేస్తారు. కాని పేదల పఖీరుల ఖాళీ పాత్రల్లో ఒక్క మెతుకు కూడా భరతభూమి విదిలించదని ఆవేదన వ్యక్తంచేశారు.
పుట్టుకతో దళితుడైన జాషువా పట్టుదలతో నవయుగ కవి చక్రవర్తి అయి తన కవితా ప్రతిభతో తెలుగు సాహితీ లోకంలో ప్రజ్వరిల్లారు.అగ్రవర్ణ దుర హంకారాలను చవిచూసిన జాషువా తన కలంతోనే వాటిని ఎదుర్కొన్నాడు.నాకు ఇద్దరు గురువులు ...పేదరికం , కుల మత భేదం .ఒకటి సహనాన్ని నేర్పితే , రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచింది అంటారు.వెంకటగిరి రాజావారి ఆహ్వానంపై రైలులో నెల్లూరు ప్రయాణిస్తూ ఓ కవితో పరిచయమై ఆయన కోరిక మేరకు కవితా గానం చేశారు.ముగ్డుడయిన ఆ కవి మీ కవిత్వం అద్భుతంగా ఉందంటూ జాషువా కులం గురించి తెలుసుకొని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడట. ఈ సందర్భంగా జాషువా " నా కవితా వధూటి వద నంబు నెగాదిగ జూచి రూపు రేఖా కమనీయ వైఖరులు గాంచి భళీభళి యన్నవారే మీదే కుల మన్న ప్రశ్న వెలయించి చివాలున లేచి పోవుచో బాకున గ్రుమ్మి నట్లగున్ పార్థివ చంద్ర వచింప సిగ్గుగన్ " అని అంటూ వెంకటగిరి రాజావారికి తన ఆవేదన వెలిబుచ్చారు.
జాషువా కవిత్వాన్ని ఆయన జీవించిన కాలం నాటి ఆర్థిక , రాజకీయ , సామాజిక , సాంఘీక పరిస్థితుల నేపథ్యంలో నుంచి చూడాలి.వ్యవహారిక భాషలో రచనలు చేసి పద్యానికి పట్టం కట్టారు. వస్తువులో మార్పు , పద్య రూపంలో మార్పు , భాషలో మార్పు తెచ్చారు. ఒక జాతికి , ఒక మతానికి , ఒక వర్గానికి మాత్రమే ఇంపుచేయు కవిత్వానికి స్వస్తి పలికాడు.కులం వలన , సామాజిక నేపథ్యం వలన ఆయనను సమాజం ప్రశ్నించి అనేక అవమానాల పాలు చేసింది.ఈ నేపథ్యంలో ఆయన తనలోని మనిషిని, కవిని బతికించుకోడానికి ప్రయత్నం చేశాడు.చుట్టూ ఉన్న సమాజాన్ని , మనుషులను మానవీయంగా ఉండమని హెచ్చరించాడు.
జాషువా ఎన్నో బిరుదులను ,పురస్కారాలను అందుకున్నారు . కవితా విశారద , కవికోకిల , మధుర శ్రీనాథ , కవిదిగ్గజ నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ది చెందారు. తిరుపతి వేంకట కవుల లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి జాషువా కాలికి గండ పెండేరం తొడిగి ఈ కవి పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అంటాడు.ఇది జాషువా కు లభించిన అత్యున్నత పురస్కారం.1964 లో క్రీస్తు చరిత్ర కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.అదే ఏడాది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు.1970 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. గబ్బిలం , పిరదౌసి , బాపూజీ , రుక్మిణి కళ్యాణం, కోకిల , కొత్త లోకం , క్రీస్తు చరిత్ర , స్వయంవరం , నాగార్జున సాగరం , స్మశాన వాటిక , శిశువు , నా కథ తదితర 36 గ్రంధాలు , మరెన్నో కవితా ఖండికలు రాశారు. భావకవిత్వ యుగంలో ఆయన భావ కవిత్వ లక్షణాలకు అతీతంగా ఉంటూ మానవ జీవితాలను సందేశాత్మకంగా చిత్రించారు. ఏ వస్తువు తీసుకున్నా దాన్ని కవితాత్మకంగా చిత్రించే అద్వితీయమైన ప్రతిభ ఆయనది.ప్రతికూల పరిస్తితులను ఎదుర్కొని , మనో దైర్యంతో , స్వయం కృషితో సాహిత్య సేద్యం చేసి తిరుగులేదని నిరూపించుకున్న జాషువా జీవితం స్ఫూర్తిదాయకం .ఆయన 1971 జూలై 24 న కన్నుమూశారు. జాషువా కవిత్వంలోని మానవీయ విలువల్ని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారానే ఆ మహాకవికి ఇచ్చే నిజమైన నివాళి.