Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోడిగూటి తిరుపతి
- 9573929493
సాహితీ ప్రపంచపు ప్రభాత
పద్య కావ్య ఖండికల విదాత
ఆధునిక కవితా పథ విరాజిత
అతడే... నవ యుగ కవి చక్రవర్తి
అక్షర తపశ్వి ….గుర్రం జాషువా
తరాల ఛాందస సాహిత్యంపై
కలం ఎక్కుపెట్టిన అక్షర యోధుడు
కుహనా పండిత ఆధిపత్యంపై
ధిక్కార స్వరమెత్తిన కవన వీరుడు
అల్పాక్షరాలకు పదునుబెట్టి
వివర్ణ పదాలకు మెరుగులద్ది
నిర్జీవ వాక్యాలకు జీవం పోసి
మహాద్భుత కావ్య ఖండాలు
శిల్ఫీకరించిన విశ్వ కవి సామ్రాట్
దళిత రోధనే ధ్వనిగా ...
క్షుద్బాదే కావ్యాత్మగా ...
వేదనా దృశ్యమే వస్తువుగా
పద్య "నదుల" పరుగులెత్తించినవాడు
గబ్బిలం, పిరదౌసి, కాందిశీకులు వంటి
విప్లవాత్మక కావ్యాలు ప్రతిష్టించినవాడు
అవమానించిన నోటనే ….
మధుర శ్రీనాధునిగా కీర్తింపబడ్డవాడు
కవి కోకిల గొంతు మూగబోతేనేమి?
కవీంద్ధ్రుడు"జాషువా" నిష్క్రమిస్తేనేమి/
ఆ పద్య కావ్యాలు ... జన పెదాలపై
పరమ పదమై పల్లవిస్తుంటాయి
ఆ మహా మనీషి ... గగన సీమలో
విశ్వ నరుడిగా విరాజిల్లుతాడు