Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుట్టు పూర్వోత్తరం తెల్వనోళ్లు
కూడు గూడు.గుడ్డకు నోచుకోనోళ్లు
లోకమంతా కాలి నడకన చుట్టేస్తూ ...
బిక్షాటకులుగా బతుకు నెట్టుకొస్తున్నోళ్లు
కటిక దారిద్య్రం చుట్టుముట్టి ...
కన్నీటి సంద్రంలో కొట్టుకుపోతునోళ్లు
జనావాసాలకు దూరంగా…
మురికి కూపాలకు చేరువుగా…
జంతువులవలె జీవనం సాగిస్తున్నోళ్లు
ఈ దేశంలో పుట్టినా…
ఏ ఆధా(ర్)రం లేనోళ్లు
ఏ "పౌరసత్వం" దక్కనోళ్లు
ఏళ్లకేళ్ళుగా ఇక్కడే ఉన్నా...
ఏ "హక్కులు" దక్కనోళ్లు
ఏ జనాభా లెక్కల్లో ఎక్కనోళ్లు
ప్రభుత్వాలెన్ని మారినా...
ఏ ప్రగతి ఫలాలు అందనోళ్లు
ఏ నేతల దయకు నోచనోళ్లు
పథకాలు, ప్యాకేజీలంటూ ...
కుళ్లు "సుద్దులు" దట్టించు ఏలికలారా…!
మీ స్వార్థ ప్రయోజనాల పక్కనెట్టి
ఈ సంచార జీవులను
కనీసం మనుషులుగా గుర్తిస్తే..
కాస్తంత "చేయూత" అందిస్తే...
జీవనోపాధి "మార్గం" చూపిస్తే ...
ఎండబారిన "ఎద" ఎదల్లో ...
ఒయాసిస్సులు తొణికిసలాడవా…!
మోడుబారిన బతుకుల్లో…
నవ "వసంతాలు" వెల్లివిరియవా…!
సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట
9573996828