Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధునిక సాహిత్యంలో జీవకారుణ్య దృష్టితో రచనలు చేసి రసభావ స్ఫోరకంగా పాడిన కవి కోయిల జాషువా. తెలుగు వారి పలుకుబడులు సజీవంగా కనులముందు నర్తిస్తాయి. ప్రతిపద్యం ఓ ఆణిముత్యమై ప్రభవించి ప్రజ్వరిల్లుతుంది. మానవత్వం మధుర సరదేశంగా ధ్వనిస్తుంది. ప్రకృతిలోని ప్రతి అణువు, ప్రతి జీవి ఇతివృత్తమౌతుంది. అలా ఇతి వృత్తమైన ప్రతి అణువు, జీవి విస్ఫోటనమై చరిస్తుంది. అందుకే జాషువా కవిత్వం ఈనాటికీ ఎందరికో మార్గదర్శకమయ్యింది. 'కోయిల పాట'గా నిస్వనం చేస్తుంది. 'కస్తూరి జింకగా' పరిమళిస్తుంది.
జాషువా కవనం ''పుట్టరాని చోట పుట్టుకతన'' కారడవులు దాటి సహృదయుల వనసీమల్లోకి చేరగలిగింది. అందుకే కవి గబ్బిలంతో కవితా సందేశాన్ని పంపడానికి నిర్ణయించుకున్నాడు. '' ఆ జన్మాంత శిక్షలో క్షుధాగ్ని పీడితుడై తుకతుక నడుకు అశ్రు సందేశమును'' లోకానికి అందిస్తున్నాడు. అయితే '' నాదుకన్నీటి కథ సమన్వయము సేయ, నార్ధ్ర హృదయంబు గూడ కొంత వసరంబు'' అని విన్నవిస్తున్నాడు. ఈ కావ్యములో కథానాయకుడు సాటి మానవులచే అంటరానివాడుగా పరిగణింపబడినవాడు. అస్పృశ్యుడు సంఘములో తన ఉనికిని తలచుకొని తుకతుకమండు అవమానాగ్నిని అశ్రు సందేశంగా తెలిపేందుకు, దూతగా చీకటి ముద్దవలెను, దయ్యపు పిల్లవలె నుండిన గబ్బిలాన్ని ఎంచుకున్నాడు. ఈ గబ్బిలము మృగపక్షి జాతులకు చెందిన మానవులచే యీసడింపబడి యింటినుండి తరుము గొట్టబడిన చిన్నపిట్ట. దీని ద్వారా జాషువా జాతి ప్రయోజనాన్ని ఆశించాడు. కరుణరస ప్రధానమైన ఈ కావ్యము జాషువాను జాతీయోద్దారకునిగా నిలబెట్టి అమ్మహాకవి కీర్తి నా చంద్రతారకముగా నిలుపగలిగింది.
చైనా సవాళ్ళు గబ్బిలాలను శుభశకునాలగ భావిస్తారట. ఈ విషయం యాదృశ్చకమే అయినా, జాషువా నిమ్నజాతుల దూతగా గబ్బిలాన్ని పరమేశ్వర సాన్నిధ్యానికి (కైలాస శిఖరానికి) పంపనెంచుకున్నాడు. గబ్బిలంకావ్యంలోని కథనాయకుని కన్నులెదుట నిలిపినట్లు అతని మూర్తిని అనగా రూప గుణస్థితి గతులను ఒకే పద్యంలో చక్కగా వర్ణిస్తాడు.
ఆయభాగ్యుని రక్తంబు నాహరించి
యినుపగజ్జెల తల్లి జీవనము సేయు
గసరిబుసకొట్టు నాతని గాలిసోక
నాలుగు పడగల హైందవ నాగరాజు
ఈ పద్యము గబ్బిలము కావ్యానికే పంచప్రాణము. తనపూరింట దూరిన గబ్బిలముపై సానుభూతితో కథానాయకుడు స్పందిస్తూ నీవు సమస్త దేవతా సన్నిధి నారగింతువు ప్రసాదములు. అంతటి పుణ్యురాలవైన నీవు అన్నములేని పేదవాడను, యంటరానివాడను నాదు నిషిద్ధ గేహమున సొచ్చితివే అని ప్రశ్నిస్తాడు. ఔషధంబులేని అస్పృశ్యతా జాడ్యుడమంద భాగ్యుడనని వాపోతాడు.
''ఆలయంబున నీవు వ్రేలాడు వేళ
శివుని చెవినీకు కొంత చేరువుగనుండు
మౌని ఖగరాజ్ణి పూజారిలేని వేళ
విన్నవింపుము నాదు జీవితపు చరిత'' అని అంటాడు.
ఇందులోను వ్యంగ్యోక్తి యిమిడియున్నది. దేవాలయాల తలుపులు మూసి గాలి వెలుతురు లేక చీకటి గుయ్యారాలు లాగా ఉండుటచే గబ్బిలాల కావాస యోగ్యములనియు, గబ్బిలములు మూలల్లో నివసిస్తాయి గనుక భగవంతుని (శివుని) చెవినీకు కొంత దగ్గరలో ఉంటుందనియు, ఎవ్వరూ వినకుండ నెమ్మదిగా చెప్పుటకు వీలుంటుందనియు, పూజారి లేనప్పుడు వెసులుబాటు చూచుకుని తన జీవిత చరిత్ర చెప్పమని ప్రాధేయపడతాడు. ఎన్ని దేశాలు దిరిగిన నేమినీకు నీవు నావలె పుట్టుబానిసవు గాదూ అని జాలి గొలుప పలుకుతాడు. తంజావూరు రాజ్యము నుండి ప్రయాణం కొనసాగించి కైలాసము చేరమంటాడు. కైలాస నాధునికి తనగోడు తెలుపమంటాడు.
జాషువా ఏడు ఖండకావ్యాలను వ్రాశాడు. వీనిలో ఒక్కొక్క ఖండ కృతిలో సుమారు ముప్పై నుండి నలుబది ముక్తకాల వరకు ఉంటాయి. ఈ ప్రక్రియలో జాషువా దేశభక్తునిగా, మాతృభక్తునిగా, పురాణ పురుష పాత్రోద్ధారకునిగా సకల జీవరాశుల పరిశీలకునిగా, రాజకీయజ్ఞునిగా, పంచమ జాతుల పరస్పర వైషమ్య నిర్మూలకునిగా, హరిజనోద్ధారునిగా గోచరిస్తాడు. జాషువా ఖండికలలో యెక్కుడు భాగము సామాజిక స్పృహతోను అనుభవాలతోను గూర్చినవే. అన్నీ కరుణరసాత్మకములే. వీనిలో ప్రధానముగా పశుపక్ష్యాదులను గురించి, జాషువా జీవకారుణ్యదృష్టిని గురించి తెలుసుకోవాలి.
జాషువా రాసిన ఖండకావ్యాలలో మొదటి భాగములో గిజిగాడు, సాలీడు, నెమలినెలత, తుమ్మెద పెండ్లికొడుకు, రెండోభాగంలో జాకీ, మూడో భాగంలో గోవు గురించి, నాల్గో భాగంలో కోతిని గురించి, ఆరో భాగములో లైకా మొదలగు పశుపక్ష్యాదుల గురించి ఎంతో కరుణ రసాత్మకముగా వర్ణించినారు. తెలుగు సాహిత్యలోకాన ఎంతోమంది కవులు ఏదో ఒక సందర్భాన జంతువుల గురించి, పక్షుల గురించిన ప్రస్థావన తెచ్చివుంటారు. పాల్కురికి సోమనాధుడు 'కోడిపుంజు'' ఉషోదయ మేలుకొలుపు గీతం ఎలా ఉంటుందో తొలి కోడి కనువిచ్చి.... అంటూ అద్భుతమైన వర్ణన చేశాడు. అయితే గబ్బిలాన్ని అపశకునంగా భావించే రోజుల్లో దానిని దూతగా తీసుకుని కావ్యాన్ని రచించినది, అలాంటి స్పృహను కలిగించినది మాత్రం జాషువానేనని చెప్పాలి.
గూడు కట్టుటలో గిజిగాని పనితనాన్ని పొగడుచు తన చిన్ననాడు గిజిగాని గూళ్ళకు నల్లతుమ్మతోటల వెంట తిరిగిన తన అనుభవాన్ని రంగరించి వివరించాడు. పక్షిరాజ్యంలోని ఓ అందమైన పక్షి గిజిగాడు. పల్లెటూళ్లలో అక్కడక్కడ నీటి వనరుల చెంత, కనుచూపుమేర అల్లంత దూరం విస్తరించిన వరిమళ్ళ మధ్య... అంతెత్తున్న చెట్టుమీద కొమ్మలకు వేలాడుతూ విశ్వామిత్రుడు సృష్టించిన త్రిశంకు స్వర్గంలోని భవనాల్లా ఉంటాయి. చూడటానికి జాడీ ఆకారంలో, తలకు పెట్టుకునే టోపి ఆకారంలో ఉండి గాలివీస్తున్నప్పుడల్లా అటుఇటూ కదులుతూ ఆకర్షణీయంగా ఉంటాయి. అలాంటి గిజిగాని గూళ్ళ నిర్మాణం ముందు, వాని నైపుణ్యం ముందు సివిల్ ఇంజనీర్లు కూడా బలాదూరే.
''తేలిక గడ్డి పోచలను దెచ్చి, రచించెదవీవు తూగుటు
య్యేల గృహంబు, మానవులకేరికి సాధ్యముగాదు, దానిలో
జాలరు, లందులో జిలుగు శయ్యలు నంతిపురంబులొప్పగా
మేలుభళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాడు! నీడజా!
గిజిగాడు పక్షి చూడటానికి చాలా చిన్నది. అది మన అరచేతి ప్రమాణంలో ఇమిడిపోతుంది. అలాంటి బుల్లిపిట్ట గూడు నిర్మాణ కౌశలం ఎనలేనిది. ఇటువంటి అద్భుతమైన ఇంటి నిర్మాణాన్ని అంత చిన్నపక్షి నిర్మించిందంటే నిజంగా నమ్మలేని నిజం. అలాంటి విషయాన్ని జాషువా తన కవితా వస్తువుగా ఎంచుకోవటం చూస్తే జాషువా పరిశీలనాదృష్టి ఎలాంటిదో అవగతమవుతుంది. గిజిగాడు మగపక్షే. ఆడపక్షులు ఇళ్ళలో కోలాహలంగా తిరుగుతూ సందడి చేసే పిచ్చుకల్లా ఉంటాయి. మగవాటికి మాత్రం పొట్టపై భాగంలో పచ్చరంగు ఉంటుంది. మగపక్షులు తేలిక గడ్డిపోచలను, ఈత ఆకులను తెచ్చి వాటిని ఒకదానికొకటి ముడివేస్తాయి. అలా అల్లుతూ 18 రోజుల్లో గూడు నిర్మిస్తాయి. ఇందులో టోపి లాంటి నిర్మాణానికే 8 రోజులు పడుతోంది. కట్టడం పూర్తయ్యాక తమ దివ్యసౌధానికి ఆడపక్షిని తెస్తాయి. అది ఆ గృహాన్ని మెచ్చేలా చేస్తాయి. ఆ తర్వాత అవి జతగూడతాయి. తమ వంశాన్ని అభివృద్ధి చేసుకుంటాయి. వీటికి ప్రధాన ఆహారం ధాన్యం. ఒక్కో సారి చిన్న చిన్న క్రిమికీట కాదులు, నత్తలను కూడా తింటాయి.
గిజిగాడి గూళ్ళు వాటి ఆధారానికి, నేలకు మధ్య ఊగుతుంటాయి. దాన్నే రచించెదవీవు తూగుటుయ్యేల గృహంబు అంటారు జాషువా. ఆ గూళ్ళు ఎంత హోరుగాలికైనా అలా ఊగుతాయే కానీ ఊడిపడవు. పడితే ఆధారంగా ఉన్న కొమ్మ విరిగినప్పుడే అంత చక్కటి నిర్మాణం మనషులెవ్వరికీ సాధ్యం కాదని గిజిగాడికి గొప్పదనం ఆపాదిస్తున్నారు. అంతే కాదు ఆ ఇళ్ళు మెరిసే మెరుపులు. అంత:పురాలతో అలరారుతుంటాయి. భళీగిజిగా... నువ్వు పక్షులలో రాజువురా అంటారు. గిజిగాడ్ని నీడజా (నీడపట్టున పుట్టినవాడా) అని ముద్దుగా పిలుస్తారు జాషువా. ఆ గూళ్ళు గాలికి అటుఇటూ కదలడాన్ని కవి... ఔరా! గిజిగా నీకు నీ భార్యకు, నీ పిల్లలకు చల్లటి గాలులు ఊడిగం చేస్తున్నాయంటారు. ఈ ప్రయోగంలో పై పద్యంలోని పులుగు ఎకిమీడు (పులుగు అంటే పక్షి, ఎ కి మీడు అంటే రాజు) పదాలకు సార్ధక్యాన్ని కల్పించారు. అంతేకాదు... నీ వైభవానికి ప్రపంచంలో ఎవ్వరూ సాటి రారంటూ .... 'గిజిగాడా నీకు దీర్ఘాయువౌ' అని ఆశీర్వదించారు జాషువా.
మరో ఖండికలో సాలీడు జీవన విధానం గురించి ఐదు పద్యాలలో జాషువా చక్కగా వివరిస్తారు. సమాజంలో చెడ్డగా రూఢికెక్కిన వస్తువులో (ప్రాణుల్లో) మంచిని చూపించడం ఈయన ప్రత్యేకత. లోకంలో సాలీడుకు మంచి పేరు లేదు. సాలీడుకు తన గూడును (అల్లిక) నిర్మించుకోవడంలో మంచి నేర్పు ఉంది. ఈ అల్లికను చూసి ఆకర్షించబడి వచ్చిన పురుగుల్ని తన ఆహారం కోసం వాటిని అల్లికలో బంధించి తినేస్తుంది. జాషువా ఈ సాలీడులోని మోసపూరిత గుణాన్ని కాకదాని అల్లికలోని గొప్పతనాన్ని పొగుడుతూ ఈ పద్యాలు రచించాడు.
నీలో నూలు తయారు జేయు మరగాని, ప్రత్తిరాట్నంబుగా
నీ, లేదీశ్వరశక్తినీ కడుపులోనే లీనమై యుండునో
యేలీలన్ రచియింతువీ జిలుగునూ! లీపట్టు పుట్టంబు!లో
సాలీడా, నినుమోసగాడవని విశ్వంబేల ఘోషించెడిన్!
అంటూ సాలీడు నేత పనితనాన్ని మెచ్చుకుంటూ, నీలాంటి ఉపాధ్యాయుడు ఈ భూమిమీద ఒక్కడు కూడా కనరాడు. నీ గర్భంలో దాచివుంచితి వా ఏమిటి? నిన్ను మించిన పనివాడు లేడు, కానీ నీలోని చెడు గుణము నీ అసమాన కౌశలమును నాశనము చేస్తోందని జాషువా వాపోతాడు. కవిగా ఆయన భావనా బలం, రచనా చాతుర్యం, సామాజిక స్పృహా, సామాజిక పరిస్థితులకు ఆయన స్పందన వంటి విషయాలన్ని ద్యోతకమవుతాయి. సాలీడు అన్న కవితలో పద్య భావాల్లో ఎక్కడా కవి భావ వ్యక్తీకరణకు నియమాలు అడ్డురాలేదు. అసలు అలాంటి ఆలోచననే రాదు. మరో పద్యాన్ని పరిక్షిస్తే..
పురువుంగుంపును మోసపుచ్చుటకు గాబోల్దొంగమగ్గాలపై
మురిపెంపుంబని యుల్లిపట్టువలిపంబుల్ నేసి, నీమందిరాం
తర దేశంబున నారగట్టి యొకపొంతం బొంచినా వోరి ట
క్కరి! సాలీడవు కాదు, దొంగవని వఖ్ఖాణింపవే లోకముల్
అంటూ అద్భుతంగా, వ్యాఖ్య అవసరం లేకుండా, కాస్త భాష తెలిస్తే చాలు. చదివిన కొద్దీ ఆనందము అధికమవుతుంది.
తుమ్మెద పెండ్లి కొడుకునే కవితలో ఈ వ్యంగ్యాన్ని చూస్తే ఇట్లే తెలిసిపోతుంది.
''మొన్న వివాహమాడితివి, ముద్దుపడంతుల బెండ్లియైన యం
త, న్నవ మల్లికామధు నందబులజొచ్చితి, వెంతకాల మీ
క్రొన్నన తీవెజొంపముల, గూతలు పెట్టెద? వింకనైన రా
కున్న జగంబు మెచ్చదనియుం దలపోయ వదేల షట్పదా!
దీని ద్వారా కవి చెప్పదలచుకొన్న విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.
'నెమలి నెలత' అనే మరో కవితలో నెమలి గురించి అద్భుతముగా వర్ణించారు.
'' తలపై గల్కితురాయి, కంఠమున సిద్ధాతళ్కు గ్రొమ్మెల్కప
చ్చలహారంబు ధరించి, కాటుక విలాసం బొప్ప వాలంటి ఱె
ప్పల నానందము నిండ నర్తిత నిజ ప్రాణేశ్వరు, జూచు నె
మ్ములరాణీ! యిటుచూడవే నుతిశతంబుల్ నీకు నీ భర్తకున్''
'కోతి' అనే మరో కవితలో చాలా చక్కటి భావాన్ని వ్యక్తపరుస్తారు. మనిషి పూర్వీకుడుగా కోతిని పేర్కొంటున్నారు శాస్త్రజ్ఞులు మనిషిలో కోతిచేష్టలు మిక్కటంగా ఉండుటకు అదియే కారణమని వారి ఉద్దేశం. పురాణకాలం నుండి మనిషికి కోతికి అనుబంధం ఉంది. హనుమంతుడు శ్రీరాముని నమ్మిన బంటుగా కీర్తిగాంచాడు. కోతి చేష్టలు హాస్యాయుతంగా ఉంటాయి. మనిషికి కోతికి జీవ లక్షణాలలో గల తేడా ఏమన మనిషికి వయసు మీరిన తర్వాత వృద్ధాప్య లక్షణాలు గోచరిస్తాయి. కాని కోతికి పుట్టుకతోనే ముసలి రూపు వస్తుంది. ఏమైనా హాస్యానికి పెట్టిందిపేరు కోతి చేష్టలే.
చిత్రమై నీదు చిలిపి చేష్టలు జూచి
బోకరింపు జూచి, బొమలు సూచి
విస్మరింపగలదు విశ్వమొక్క క్షణంబు
సంకటమున ప్రకృతి పంకిలమును
ప్రేయసిముందు అనేక వెకిలి చేష్టలు చేయుటకు ప్రయత్నించు ప్రియుని ముద్దుగా కోతి అని ప్రియురాలు పిలుచుకోనుట సహజమేకదా? జాషువా ఈ వివరాలన్ని కోతిని గూర్చి ఇస్తూ కోతికి ఒక చక్కటి బిరుదుని కూడా బహుకరించాడు. అదియే 'రామదూతల రాణి' ఎట్లనగా వివరిస్తూ
కరువులకు కారకులు సో
మరి పౌరులటన్న నిజముమదినెంచక, యే
మెరుగని నీపై బలుముట
దురాగతము గాదె రామదూతల రాణి!... అంటారు
జాషువా ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నారు. ఇంటిలోని దొంగను ఈశ్వరుడు కూడ పట్టలేడని ఒక సామెత ఉంది. మనుషులలోనే సోమరులు ఒక తెగ ఉన్నారు. వారు పనిపాటలు చేయరు. కర్మ(పని) సిద్ధాంతాన్ని నమ్మరు. అయితే తిండికి మాత్రం పోతురాజులు. అట్టివారి వలననే దేశంలో కరువు వస్తుంది కాని కోతుల వలన కాదని జాషువా ఖండితంగా చెప్పారు. బిక్షులను, దొంగ స్వాములను జాషువా సోమరిపోతులుగానే పరిగణిస్తున్నాడు. ఇటువంటి సోమరులు సంఘం నిండ వుండగా తప్పంత మన దగ్గర పెట్టుకుని, కోతులను కరువుకు కారణం అనడం హాస్యాస్పదం అని జాషువా ఉద్ఘాటిస్తున్నాడు.
మరో ఖండికలో 'గోవును' గూర్చి అద్భుతముగా వర్ణిస్తారు. సాధు జంతువైన ఆవును గోమాతగా పూజిస్తారని, ఆవుపాలు ఎంతో శ్రేష్టమైనవని, నిను నమ్ముకుని ఎంతోమంది జీవిస్తున్నారని చెప్తారు.
నీ గంగడోలు నందము
నీ గుండ్రని క్రొమ్ముతీరు, నీనడబెడగున్
వ్రేగైన పొదుగు కుదురున్
నీ గిట్టల సొగసు ప్రేక్షణీయములు గదా? అంటూ
ఇవ్వటమేకాని, ప్రతిఫలము నాశించవని, నీరుద్రావి, పచ్చికమేసి జీవించే సచ్చరితవు గలదానవని కీర్తిస్తాడు. కానీ కొంతమంది దయలేని వారై నిన్ను ఆహారంగా భుజించుటకు క్రూరంగా వధిస్తున్నారని జీవకారుణాన్ని ప్రకటిస్తారు. మరో కవితా ఖండిక 'జాకీ' రెండో భాగములోనిది. ఇందులో
''నోరు లేదు చేరి నీ వొనరించు
పనులలోన వింత భాషగలదు
నీవు నేను దప్ప నితరులెఱుంగరు
కనులతోడు నవ్వగలవు నీవు... అంటూ
తన ప్రేమతో పెంచుకున్న పెంపుడు జంతువు కుక్కను గురించి ఆవేదనగా చెప్తారు. ఏనాడో ఋణపడి నన్నిన్నాళ్ళు సేవిస్తూ ఉన్నావు. నాకు మర్యాద పూర్వకంగా తోక ఆడిస్తూ స్వాగతం పలికేదానవు. కానీ ఇప్పుడు నన్ను వీడి వెళ్ళిపోయావు అని నిన్ను మరువటం కష్టమేనని క్రుంగి పోయారు. మరో సందర్భంలో 'లైకా' కవితలో ''ఆకసపు బాటసారీ/ లైకా! నీ మరణమొక యలంకృతి, రష్యా/ రాకెటు సృష్టి చరిత్రకు /నీకివె మావేడి కంటి నీటి నివాళుల్'' అంటూ అనంత రోదసీ మండల యాత్రసేయగా వెళ్ళినావా లయికా, శునకాంగనామణి అని సంబోధిస్తాడు.
ఈ విధంగా విభిన్న వస్తువులతో జాషువా పద్యఖండికల్ని వైవిధ్యపూరితమైన అంశాలతో రాసి విస్తృతమైన ప్రచారంలోకి తీసుకొచ్చాడు. ఆయన రాసిన ఖండికలన్నింటిని కలిపి ఖండకావ్యాల పేరుతో ఏడు భాగాలుగా ప్రచురించాడు. అందులోని పశుపక్ష్యాదులను గురించి వివరించిన రేఖామాత్ర పరిచయమిది.
డా|| నూనె అంకమ్మరావు
చరవాణి : 9397907776