Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినుగొండ వినువీధులు తాకవద్దని ఈసడించుకుంటుంటె
అంటరానితనం కరాళ నృత్యం చేస్తున్న పాడుకాలంలో....
ముక్కు పచ్చలారని పసిబిడ్డకు కంటనీరు జలపాతమై వర్షించె
కులమతాల సంకుచిత విషనాగుబుసలకు గుండెలుమాడి...
ఆ బాలజాషూవా లో మొలిచిందో అకుంఠిత దీక్ష అలా మొదలైన కావ్యరచన సిరాధారలై జాలువారె
"నిమ్నజాతుల కన్నీటి నీరదములు
పిడుగులై దేశమును కాల్చివేయునని"హెచ్చరించె
అప్సరసలను చెక్కిన శిల్పి ఆమె కంటికొనలలో అజరామరుడే అంటూ రాళ్ళలో నిద్రించు శిల్పాలను వెలికితీసిన శిల్పి చాతుర్యానికి అబ్బురపడె....
బంగరురంగు పూలగుత్తులతో చెరువుగట్టుపై చేలగట్లపై మొలిచే నల్లతుమ్మ చెట్లకు అద్భుతంగా నిర్మించుకునే గిజిగాడి గూడుతో గాడ్పుబిడ్డలతో కలిసి ఊయలలూగె...
పరదాపద్దతి మాన్పిరో సిరికి కుప్పలుగా పోసి అంగళ్ళలో మేలిమాణిక్యాలను రత్నాలను అమ్మినారంటూ కృష్ణరాయల పురవీధులలో గర్వంగా పారశీకగుర్రాలపై తిరిగె....
చిత్రాంగి ప్రేమకు బలియైన సారంగధరుని రక్తపు ఆనవాళ్ళను రాజకోట గోడలపై ఇప్పటికీ చూపించే గబ్బిలంతో తిరిగి కన్నీరు కార్చె...
ఎంత పుణ్యం చేసుకుందో తెలుగు కళామతల్లి ఇంతచక్కని బిడ్డను కన్నది అందుకే భారతమ్మ సిగలోన పద్మభూషణుడయె....
నవయుగ కవి చక్రవర్తి యై కవితా విశారద చేత కవికోకిల గానాలు ఆలపించి కళాప్రపూర్ణుడై గండపెండేర ధారణతో సాహితీ వినీలాకాశంలో వెలుగులీనుతూ...
సుకవి జీవించు ప్రజల నాల్కులయందు అన్నట్లుగా చిరంజీవుడై సాహిత్య సంచారం చేసిన "గుర్రం జాషువా మహానుభావా" అందుకో నా అక్షర నీరాజనార్చన...
- వకుళ వాసు, హన్మకొండ
9989198334