Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పింగళి. భాగ్యలక్ష్మి, గుంటూరు.
ఫోన్ నెంబర్ 9704725609
బాల సుబ్రహ్మణ్యం ఈ పేరు వింటేనే తెలుగు నేల, తెలుగు తల్లి, తెలుగు సినీ కళామతల్లి ఆనందంతో పులకరించి పోతుంది. ఎందుకంటె అయన గాత్రం నవరసాలూరే గాత్రం, తేనెలూరే పాట. కోయిలలు కూడ మైమరచి వినేలా పాడటం అయన ప్రత్యేకత. ఆయన పలుకులు భాషకు పట్టాభిషేకం చేస్తాయి. అమృతం కన్నా తీయనైన అయన పాటకు ప్రకృతి సైతం ఆనందంతో పులకరించి పోతుంది. పక్షులు సైతం తమ కిల కిలా రావములను ఆపి గిక్కరించి మరీ అయన పాటను వింటాయి. ఇంతటి
ప్రాధాన్యతను సంతరించుకున్న గాన గంధర్వుడు మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం నిజంగా మనందరి అదృష్టం. బాలు గారు 1946 జూన్, 4న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోటమ్మపేట గ్రామంలో తండ్రి శ్రీపతి పండితారాజ్యుల సాంబమూర్తి, తల్లి శకుoతల గార్ల ఇంట సినీ కళామతల్లి ముద్దు బిడ్డగా జన్మించారు. చిన్న తనం నుండి చదువులో ఎంతో చురుకుగా, ఉత్సాహంగా ఉండేవారు. చదువుతో పాటు బాల్యం నుంచే పాటలు కూడ నేర్చుకున్నారు. బాలు గారు ఇంజనీరింగ్ విద్యను అబ్య సిస్తున్న టైములో టైఫాయిడ్ రావడంతో అనారోగ్యానికి గురయ్యి ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే ఆపేసారు.
క్రమక్రమంగా ఆరోగ్యం కుదుట పడటంతో మళ్ళీ పాటల ప్రస్థానంలోకి అడుగుపెట్టారు. వివిధ సాoస్కృతిక శాఖల వారు నిర్వహించె పాటల పోటీల్లో పాల్గొని ఎన్నో అవార్డులని, బహుమతుల్ని గెలుపొందారు. ఆ సమయంలోనే మద్రాస్ లోని తెలుగు కల్చరల్ ఆర్గనైజషన్ వారు నిర్వహించిన సంగీత పోటీల్లో పాల్గొని బాలసుబ్రహ్మణ్యం ప్రధమ బహుమతిని గెలుచుకొన్నారు. ఈ గెలుపు ఆయనకు మరో మలుపుగా మారింది. ఈ నేపథ్యంలో సినీ సంగీత దర్శకులు ఎస్.పి. కోదండపాణి ఆయనకు తన సినిమాలో పాడేoదుకు చక్కని అవకాశం ఇచ్చారు. 1966 డిసెంబర్ 15న "శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న" చిత్రం కోసం మద్రాస్ లోని ప్రియా గార్డెన్స్ థియేటర్ లో "ఏమి వింత మోహమో" అనే పాటను తొలిసారిగా పి. సుశీల, ఈలపాట రాఘవయ్య, పి. బి. శ్రీనివాస్ గార్లతో కలసి ఎంతో శ్రావ్యoగా పాడారు. మొదట్లో బాలుగారు చిన్న చిన్న హీరోలకు, కమెడియన్సుకు ఎక్కువగా పడేవారు. ఒకసారి ఎస్.పి. కోదండపాణి ఓ చక్కని సలహా ఇచ్చారు. అగ్ర హీరోల గొంతుని అనుకరిస్తూ పాడమన్నారు. కోదండపాణి గారి సలహాని తు.చ. తప్పకుండ పాటిస్తూ అగ్ర హీరోల గొంతుని అనుకరిస్తూ ఆచం అలానే పాడటం మొదలుపెట్టారు బాలు. ఇది చాలా అద్భుతంగా పనిచేయడంతో అక్కడినుంచి బాలు తన గాత్రంతో విశ్వరూపం చూపించారు. అప్పటి నుంచి బాలు సినీ పాటల పూతోటలో ఎంతో ఎత్తు ఎదిగారు.తెలుగు తెరకు తనే నెంబర్ వన్ గాయకుడుగా నిరూపించుకున్నారు.
అప్పటినుంచి ఏ హీరోకి తగ్గట్టుగా ఆ హీరోకి గొంతు మార్చి గమ్మత్తుగా పాడటం ఆయనకి ఓ వరంగా మారింది. ఇంకా విరహాన్ని అద్భుతంగా పలికిoచేవారు. ఒయ్యారాలను గొంతులో ఒలికిస్తారు. ఏపాట పాడిన ఆ హీరోలే పాడారా అన్నంత అనుభూతిని మనకు కలిగించిన ఘనత ఒక్క బాలుగారికి మాత్రమే దక్కుతుంది. అలాగే అల్లు రామలింగయ్యకు, రాజబాబుకు, మాడ వెంకటేశ్వరరావుకు అయన పాడిన వైవిద్య భరితమైన పాటలు ఇప్పటికి మన చెవుల్లో మారుమోగుతూనే వున్నాయి. అంతే కాదు కమలహాసన్ నటించిన "ఇంద్రుడు - చంద్రుడు " చిత్రంలో గొంతును మార్చి కమలహాసన్ కి డబ్బింగ్ చెప్పడమే కాకుండా, జీర గొంతుతో "నచ్చిన ఫుడ్డు, వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు " అనే ఓ చక్కని పాటను అద్భుతంగా పాడి అందర్నీ మైమరిపించడమే కాకుండా తన గాత్రానికి తిరుగులేదని నిరూపించుకున్నారు. ఈ విధంగా తన గాత్రంలోని వైవిధ్యంతోనూ, గాన మాధుర్యంతోనూ అంతకు మించి సినీ పరిశ్రమలోకి అచ్చ తెలుగు పాటలా గాన గంధర్వుడు ప్రవేశించారు.
ఇలా చిన్నవాళ్ళ వాయిస్ ల దగ్గర నుండి పెద్దవాళ్ళ వాయిస్ ల వరకు డబ్బింగ్ చెప్పి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రఖ్యాతిగాoచిన రజనీకాంత్, కమలహాసన్, సల్మాన్‌ఖాన్, అనీల్ కపూర్, గిరీష్ ఖన్నాడ్, జెమిని గణేష్, నగేష్, కార్తీక్, రఘువరన్లకు లెక్కకు మిన్నగా సినిమాలలో డబ్బింగ్ చెప్పి అందరి ప్రశంసలు అందుకున్నారు. అత్యధికoగా కమలహాసన్ సినిమాలకు డబ్బింగ్ చెప్పి కమలహాసన్ కి చాలా మంచి పేరు సంపాదించి పెట్టారు. కమలహాసన్ నటించిన "దశావతారo " చిత్రంలో ఏడు పాత్రలకు బాలు గారే డబ్బింగ్ చెప్పి అల్ టైమ్ రికార్డు సృష్టించారు. ఈ సినిమా సూపర్, డూపర్ హిట్ అవడమే కాకుండా, కలెక్షన్ల వర్షం కురిపించిన ఘనత కూడ బాలు గారి వాయిస్ కె దక్కింది. అలాగే అన్నమయ, శ్రీసాయి మహిమ చిత్రాలకుగాను అయన డబ్బింగ్ ఆర్టిస్ట్ అవార్డులు కూడ అందుకున్నారు.
వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. పాట పడటమే కాదు, చాలా సినిమాలలో అతిధి పత్రాల దగ్గరనుండి ప్రధాన పాత్రల వరకు ఎన్నో పాత్రలకు తన నటనతో జీవం పోసి అందరి ప్రశంసలు అందుకున్నారు. అయన పర్సనాలిటిని బట్టి ఆయనకు ఎక్కువగా కామెడీ పాత్రలే వచ్చేవి.అయన కూడ ఆయా పత్రాలను సమర్ధవంతంగా పోషించి కామెడియన్స్ కి ధీటుగా నిలిచారు. అలాగే దర్శకులు జంధ్యాలగారి సినిమా "మల్లెపందిరి"లో ఓ అందమైన కామెడీ ప్రొఫెషనల్ కిల్లర్ పాత్రనుఎంతో అద్భుతంగా రక్తి కట్టించి నువ్వులు -పువ్వులు విరభూయించారు. ఇంకా "పక్కిoటి అమ్మాయి" సినిమాలో కథను మలుపుతిప్పే ఓ ప్రధాన పాత్రను పోషించారు. ఆ తర్వాత 'వివాహ భోజనంబు, పర్వతాలు పానకాలు, చిరుజల్లు, పవిత్రబంధం ' లాంటి ఎన్నో సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్రని వేసుకున్నారు. అంతేకాదు ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి 'గుణ, తిరుడా -తిరుడా, కెలడి కన్మణి, కాదలన్' లాంటి అద్భుతమైన సినిమాల్లో తమిళంలోను నటించి తన ప్రతిభను చాటుకొని తమిళ ప్రజల అభిమానాన్ని కూడ చూరగొన్నారు.
బాలుగారు సంగీత దర్శకులుగా కూడ సినీ వినీలాకాశంలో జిలుగు వెలుగుల్ని విరజిమ్మా రు. ఈ బహుభాషా కోవిదుడు తెలుగు చిత్రాలకె కాకుండా కన్నడ, తమిళ చిత్రాలకు కూడ తన బాణీలనందిoచి అందరి మన్ననలు అందుకున్నారు. అత్యధికoగా 40 చిత్రాలకు సంగీతాన్ని అందించారు. తెలుగులో 'కన్యాకుమారి' చిత్రానికి మొట్టమొదటగా సంగీత దర్శకత్వం వహించారు. ఆ తర్వాత బాపుగారి తూర్పు వెళ్లే రైలు, జానకి, సీతమ్మ పెళ్ళి లాంటి అద్భుతమైన చిత్రాలకి సంగీతాన్ని అందిచారు.
ఈ అలుపెరుగని బాటసారి సినీ పరిశ్రమకు చేసిన సేవలకు ఎన్నో బిరుదులు ఆయనను వరిoచి గౌరవాన్ని మరింత ఇనుమడిoపజేశాయి. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 15 భాషలలో 40 వేలకు పైగా పాటలు పాడారు. నాలుగు భాషలలో జాతీయ సినీ అవార్డులని అందుకొన్న దేశంలోనే ఏకైక సినీ నేపధ్య గాయకుడు. ఇంకా భారత ప్రభుత్వం "పద్మశ్రీ, పద్మభూషణ్" అవార్డులతో సత్కరించింది. ఇంకా ఈయన గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా రంగాలలో అత్యధికంగా 39 సార్లు రాష్ట్ర ప్రభుత్వం తరపున నంది పురస్కారాల్ని అందుకొని సరికొత్త రికార్డులని సృష్టించిన మహిమాన్విత మూర్తి ఈ నిండు చందురుడు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ బిరుదుని సొంతం చేసుకున్నారు. ఇంకా 2016 నవంబర్‌లో గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ఆయనకు "శతవసంత భారతీయ చలన చిత్ర మూర్తిమత్వ " పురస్కారాన్ని (సెంటినరి అవార్డు ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ 2016) ప్రదానం చేసి వేదంలా ప్రవహించె గోదావరిలా బాలుగారి గానామృతాన్ని నాలుదిశలా ఇనుమడిoప జేశారు. ఇంకా జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడ అందుకొని ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన గాయకునిగ గిన్నిస్ రికార్డులకెక్కారు.
ఇలా ప్రపంచ రికార్డులని సృష్టిస్తు 50 ఏళ్ళుగా కోకిల కంఠంతో సంగీతప్రియులను ఆలరిoచారు. సంగీత దర్శకులకు బాలుగారి పాట పెద్ద ఎస్సెట్ తారలు మారిన, స్వరాలు మారినా యావత్ భారతావనికి బాలు పాట నిత్య నూతనమే. అందుకె ఘంటసాల మాస్టారుగారి తర్వాత అంతటి స్థానాన్ని దక్కించుకున్నారు. పాటలు పాడటం తగ్గిoచినా ఇప్పటికి ఏ పాటయినా ఈ పాట బాలుగారు పాడితేనే బాగుంటుంది అని అనిపిస్తే ఆ పాట బాలుగార్నివెతుక్కుంటూ వచ్చేసి అయన గొంతుకతో శివతాండవం చేస్తుంది అదే బాలు గారికి భగవంతుడిచ్చిన గొప్ప వరం. అందుకే వారి సరిగమలకి, మధురిమలకి వెలకట్టలేము. కాని ఇప్పుడు ఆ అమృతమూర్తి గొంతు మూగబోయిoదని తల్చుకుంటేనే అందరి గుండెలు బరువెక్కుతున్నాయి.
"మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో వుంది " అన్న ఓ సినీ మహాకవి గారు రాసిన పాటని బాలు గారు సార్దకం చేసుకున్నారు. తనకి సినీ గాయకునిగ జీవితాన్ని ప్రసాదించిన ఎస్.పి. కోదండపాణి గారిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్ " అని ఆయన పేరే పెట్టుకొని తన గురుభక్తిని చాటుకున్నారు.
ఈ అవిశ్రాంత గాన గాన గంధర్వుడు వెoడితెర సినీ వినీలాకాశంలో పున్నమి నాటి చంద్రునిలా వెలుగుతూనే 1996లో ఈ టి.వి.లో "పాడుతా తీయగా" అనే కార్యక్రమంలో వీరు బుల్లితెర ప్రవేశం చేసి అక్కడ తన జిలుగు వెలుగుల్ని విరజిమ్మారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది గాయని గాయకులను పరిచయం చేసి వారిని గొప్ప ఉద్దoడ పండితులుగా తీర్చిదిద్దారు. గంగా ప్రవాహంలా సాగిపోతున్న ఈ కార్యక్రమంలో రాబోయే తరానికి తనలాంటి సంగీత దర్శకులను , గాయని, గాయకులను వేల సంఖ్యలో పరిచయం చేస్తు "సరస్వతి దేవి నాకేమిచ్చింది కాదు, నేను సరస్వతి దేవి పాదాలకు ఏమివ్వగలను" అంటూ మ్యూజిక్ నేర్పించిన ఈ చిన్నారుల్ని కానుకగా ఇచ్చిన బాలసుబ్రహ్మణ్యం గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇలా 700లకు పైగా దారావాహికలతో ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని విజయంవంతంగా నిర్వహించారు. ఇంకా విదేశాల్లో సైతం ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈటీవీ ద్వారా ఎంతోమంది విదేశీ గాయకుల్ని సైతం సంగీత ప్రపంచానికి కనుకగా ఇచ్చిన శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రమణ్యం గారు ధన్యజీవి.
అలాగే "స్వరాభిషేకం" మరో అద్భుతమైన, అందమైన కార్యక్రమాన్ని కూడ ఈటి. వి. ద్వారా నిర్వహిస్తు ఇందులో ఎంతోమంది యువ గాయనిగాయకుల్ని వెలుగులోకి తెచ్చి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు ఈ సంగీత సామ్రాట్. ఇంకా మనకున్న కష్టాల్ని, బాధల్ని అన్నింటిని మైమరపింపజేస్తూ తన అపూర్వమైన గానామృతoతో అద్భుత లోకాలకి తీసుకువెళ్లిన ఈ సంగీత సామ్రాట్ మరియు ఈ యేటి మేటి సంగీత యుగ పురుషుడు అయినటువంటి గాన గంధర్వుడు శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్య లేరు అని తలచుకుంటుoటే కన్నీళ్లు జల జలా రాలుతున్నాయి. ఈ సంగీత కళామతల్లి ముద్దు బిడ్డకు ఘన నివాళులర్పిస్తూ..... బాలు గారు మళ్ళీ త్వరలో మన మధ్యలోనే ఒక కుటుంబంలో బాల మేధావిగా పుట్టి సంగీతంలో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను.