Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాకు నచ్చిన మంచి పుస్తకం శీర్షికన మానవతకు మకుటమిడిన ప్రజ్ఞాశాలి సాహిత్యము, వైద్యవృత్తి, సేవాభావము, ఈ మూడింటిని ఊపిరిగా నింపుకొని గగనతలం నుండి భూమాత పొత్తిళ్లలో ఒదిగిన గొప్ప సేవకుడు వైద్యరంగంలో వజ్ర కిరీటం డాక్టర్ రమణ యశస్వి. 'న్యూమరిక్కులు' అనే కవితా ప్రక్రియను సృష్టించి నూతన ఒరవడికి భాష్యం చెబుతూ "భలే మంచిరోజు'" అనే ఓ కొత్త కవితా సంపుటి పేరుతో ప్రత్యేకమైన తేదీలను తీసుకొని న్యూస్‌ని లిరిక్కులతో జోడించి వాటిని సాహితీ పూతోటలో వీరబూయించి సాహితీ వినీలా కాశంలో మకుటంలేని మహారాజులా వేయి కాంతుల వెలుగులతో వెలిగిపోతున్నారు డాక్టర్ రమణ యశ్వస్వి.
అందరూ చిరునవ్వుల దరహాసాలు చిందిస్తూ నవ్వుతు, తుళ్ళుతు కేరింతలతో ఆనంద క్షణాలని ప్రతి ఒక్కరూ వీక్షించాలని ఈ పుస్తకానికి 'భలే మంచిరోజు' అనే పేరుపెట్టి సంవత్సరం మొత్తంలో ప్రతి దినానికి వున్న ప్రాముఖ్యతని ఆ ప్రాముఖ్యతలోని గొప్పతనాన్ని తెలియజేస్తూ ఎంతో అందమైన పేరు పెట్టి సాహితీ వినీలాకాశంలో సరికొత్త వెలుగుల్ని విరక్తిజి మ్ముతున్నారు. ఈ న్యూమరిక్కులు చక్కని సున్నిత భావాలు, మంచి హృదయస్పందనతో ముగ్ద మనోహరoగా వున్నాయి. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరికి మంచి ఉపయోగకరం, ఆరోగ్య కరం ఈ పుస్తకం.
ముందుగా నూతన ఒరవడికి భాష్యం చెబుతూ, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కోటి కాంతుల నూతన సంవత్సరం సరికొత్త ప్రణాళికలకు విజయ సోపానమంటూ చాలా చక్కగా అభివర్ణించారు. వేగం, మద్యం, సెల్లు, రోడ్లతో ఎలా మృత్యువాత పడుతున్నారో రహదారి భద్రతా దినోత్సవంలో గుర్తు చేశారు. జనవరి మూడు సావిత్రి భాయిపూలే జయంతిని జాతీయ మహిళా టీచర్ల దినోత్సవంగా జరుపుకొంటున్నారని గుర్తు చేస్తూ సావిత్రి భాయి పూలే నేటికీ వికసిస్తున్న అణచివేత నుండి ఆవిర్భవించిన 'చైతన్య బాణం' అంటూ ఆమెను అద్భుతంగా ప్రశంసించారు. ఇంకా జనవరి 4ను బ్రెయిలీ లిపిని గుర్తు చేస్తూ విశ్వ భాషన్నింలో కంటి వెలుగుగా కొనియాడారు. అదేరోజు జన్మించిన న్యూటన్ ను "సైన్స్ పితామహునిగ" కొనియాడారు. జనవరి 8న జన్మించి అంగవైకల్యంతో అద్భుతాలు సృష్టించిన స్టీఫెన్ హాకింగ్ ను సూక్ష్మంలో మోక్షం అన్న చందాన ఈ చిన్ని 5 లైన్లలో యశస్వి చాలా చక్కగా ఆవిష్కరిస్తు జనవరి 8న అయన జన్మదినాన్ని గుర్తు చేశారు. ఇంకా పర్యావరణ ప్రేమికుని దినోత్సవం యువజన దినోత్సవం తెలియజేస్తూ యువతని మేల్కొల్పారు.
ఆరోగ్యానికి సంబందించి ఆయా తేదీలు, వ్యాధులు కనిపెట్టినవారి జయంతులు అన్ని కవర్ చేశారు. "క్యాన్సర్ డే, పోలియో దినోత్సవం, కుష్ఠు వ్యాధి దినోత్సవం... ఈ పేర్లకి టైటిల్స్ కి సంబంధం ఏమిటని అనుమానం రావచ్చు. అంటే ఆ వ్యాధులు గురించి వాటి నివారణకు మందు కనిపెట్టే 'భలే మంచిరోజు వస్తుందని 'భలే' బాగా చెప్పారు. ఇంకా జాతీయ నులిపురుగుల నివారణా దినోత్సవంలో అది ఎలా వస్తుంది, దానికి పరిష్కార మార్గాలు చెప్పి చక్కని సమాచారాన్ని, జ్ఞాన సముపార్జనని అందించారు ఆరోగ్య ఆణిముత్యాల్లాంటి ఈ బుజ్జి బుజ్జి కవితల్లో మరో అద్భుతమైన న్యూమరిక్కు జనవరి 14న మహా శ్వేతాదేవి జననం. ఈమె జీవితం మొత్తాన్ని ఈ న్యూమరిక్కులో ఆవిష్కరిoచి ఆమెకు మంచి గుర్తింపునిచ్చారు.
అలాగే అన్ని కాలాల్లో ఎన్ని పండుగలు వస్తాయో అన్ని పండుగలు, వాటి విశిష్టత, వాటి తేదీలు చాలా అందంగా ఆవిష్కరించారు. ఫిబ్రవరి 2న చిత్తడి నేలల దినోత్సవంగా చెప్తూ దాని ఉపయోగాలు చెప్పారు. ఇంకా పూలకి కూడా మంచి దినోత్సవాలుంటాయని ఆ పూలలోని గుభాళింపులు, పరిమళాలు, సువాసనలతో చూపులకి అందంగా వుంటాయని, అవి స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నాలని యశశ్వి ఆ పూల మీద ప్రేమని ఎంతో అందంగా వ్యక్తీకరించారు. మనం రోజు ఇంత గొప్పగా నవ నాగరిక ప్రపంచంలో ఎంతో కూల్ గా, కులాసాగా, ఆనందంగా జీవిస్తున్నామంటే ఇదంతా వెలుగులు పంచె విద్యుత్, కంప్యూటర్, ఫోన్, టెలిగ్రాఫ్, ప్రింటింగ్ మిషన్, యంత్రాలు లాంటి ఎన్నో పరికరాల్ని ఆవిష్కరించిన ఆవిష్కర్తల జన్మదినాన్ని, వారిలోని గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి తెలియజేశారు.
ఇంకా వివాహ దినోత్సవం దాని విలువ గురించి చెప్తూనే ప్రేమికుల దినోత్సవాన్ని కూడా గుర్తు చేస్తూ నిష్కలముషమైన ప్రేమ మనుష్యుల మధ్య దూరాన్ని తగ్గిస్తుందని ఎంతో అనందంగా చెప్పారు. అలాగే మొట్టమొదటి వైద్యురాలిగా వినుతికెక్కిన ఆనందీబాయి జన్మదినాన్ని ఎంతో అనందంగా గుర్తు చేశారు. మరో భలే మంచిరోజు 'ఆలోచనల దినోత్సవం' గురించి చెప్తూ అవసరం కొత్త ఆవిష్కరణల అమ్మ అంటూ భలే బాగా చెప్పారు. మర్చి 8న 'అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని' గుర్తు చేస్తూ మహిళలు సంఘానికి ప్రాణ వాయువు అంటూ చక్కని ప్రశంసలు కురిపిస్తూనే ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తు చేశారు. అలాగే గణిత శాస్త్రానికి సంభందించి అనేక సిద్ధాంతాలు, సూత్రాలకి సంబంధించిన దినోత్సవాల గురించి కూడా కూలంకుషంగా ప్రస్తావిoచారు.
మర్చి 30న ఇడ్లి దినోత్సవం, ఎంత అద్భుతంగా వుంది. రక రకాల ఇడ్లీలు మర్చి మర్చి తినే ఇడ్లి ప్రియులకు ఇది నిజంగా భలే మంచి రోజండీ. ఇంకా ఆరోగ్యానికి సంభందించి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, హోమియో, ఆయుర్వేదం, అలోపతి దినోత్సవాల గురించి చాలా చక్కగా ప్రస్తావించారు. మనం ముద్దు అంటే ప్రేమకు చిహ్నంగానే చూస్తాం. కానీ యశశ్వి ఏప్రిల్ 13న జవాన్లు, క్రీడాకారులు నేలను ఎంత గొప్పగా ముద్దాడుతారో తెలియజేశారు. అలాగే మర్చి 16న నిద్రా దినోత్సవం. నిద్ర లేనివారికి ఈ నిద్రా దినోత్సవాన్ని గుర్తుపెట్టుకుంటే చాలా చక్కగా కూల్ గా నిద్రపోతారు.
"ప్రతి శ్వేద సౌదo శ్రమ శక్తి నిర్మించినదే" అంటూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే ఒకటిన అంటూ కార్మికులకి బ్రహ్మ రధం పట్టారు. మే 23న అంతర్జాతీయ తాబేళ్ల దినోత్సవం గురించి చెప్తూ చెవులు లేని తాబేలుకి బ్రహ్మ చెముడెంటాని అందరూ ఆశ్చర్యంతో తలమునకాలయ్యే విషయం చెప్పారు. రోగుల మోములపై చిరునవ్వులు పోయించిన మానవతా మూర్తి 'ఫ్లోరెన్స్ నైటింగేల్' జయంతిని మే 12ను నర్సుల దినోత్సవం అని చెప్తూ వీరు ఆత్మీయ స్పర్శకు మారుపేరుగా అభివర్ణించారు. అలాగే మాతృమూర్తి, నాన్న, తల్లితండ్రులు, స్నేహితులు, ఆత్మీయ మిత్రులు, డాక్టర్స్, బాలబాలికలు, సైనికులు ఇలా అందరి దినోత్సవాల్ని గుర్తు చేస్తూ అందరి కలయికె వసుదైక కుటుంబమని చెప్పకనే చెప్పారు. వీటన్నిటిని మించి యశశ్వి గారు వారి మాతృమూర్తి + కనిపించే దైవం తులసీదేవి గారి జన్మ దినాన్ని ఆకాశమంత ఆనందంతో గుర్తు చేశారు.
బహుముఖ ప్రజ్ఞలైన అమితాబ్, మోడీ, గాంధీ, సచిన్, ఒబామా మొదలైన వారి ఎడమ చేతి వాటం గురించి చెప్తూ ఆగస్ట్ 13న లెఫ్ట్ హ్యాండర్స్ డే ఉందని చెప్పారు. ఐస్ క్రీం, చాకోలెట్, బిస్కెట్స్ కి ఓమంచి రోజు ఉంటుందని ఎంతో తియ్యగా చెప్పారు. ఇంకా భార్యల పొగడ్తల దినోత్సవంలో భార్యలని ఎలా లొంగదీసుకోవాలో చాలా చక్కగా చెప్పారు. సహజ సౌందర్యానికి పెట్టని నవ్వు ఆభరణం, ముఖానికి తోరణo అని చెప్తూ 'స్మైల్ ప్లీజ్ ' అంటూ చిరునవ్వుల దినోత్సవాన్ని చిరునవ్వుల దరహాసoతో చెప్పారు. ఇంకా కొబ్బరి కాయను రోజు తింటాం. కానీ దాని పుట్టు పూర్వోత్తరాల్ని అసలు పట్టించుకోము. దానికి ఓ గొప్ప దినం ఉండాలని, ఉందని కూడా చెప్పారు.
ప్రస్తుతం వున్న స్పీడు యుగంలో అందర్నీ మర్చిపోతున్న తరుణంలో ఆరోగ్య పరంగా అవగాహన కలిగిస్తు ఇలా దినోత్సవాల్ని పెట్టి అందర్నీ గుర్తు చేశారు. ఇలా యశశ్వి సృష్టించిన న్యూమరిక్కుల్లో స్పృశించని అంశం లేదు. ప్రవాహ జనితమైన ఒక వస్తువు, కవిత్వము, అద్భుతమైన వ్యక్తులు ఈ పుస్తకంలో దర్శనమిచ్చారు. అటువంటి వారిని పరిచయం చెయ్యడం అందరికి సాధ్యం కాదు. అయన ఓగొప్ప డాక్టరుగా, కవిగా, అన్నింటిని మించి ఓగొప్ప సంఘ సంస్కర్తగా ఆయనకే సాధ్యమైంది. బతికిన క్షణాలు అందరికి ఉంటాయి. కానీ అయన అందర్నీ బతికించారు ఈ న్యూమరిక్కుల ద్వారా. ఇంకా జాతీయ, అంతర్జాతీయ అంశాలు స్పృశించారు. ఇలా "భలే మంచిరోజు" పుస్తకం అందరికి చక్కని సమాచారం ఇచ్చింది. ఇది అందరూ తప్పక చదవవలసిన పుస్తకం. ఇంత మంచి పుస్తకం ప్రతి స్కూల్లో, గ్రంధాలయాల్లో మరీ ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వుండి తీరాలి. ఇంత మంచి అద్భుతమైన "భలే మంచిరోజు" న్యూమరిక్కుల కవితా సంపుటిని సాహితీ పూతోటలో విరభూయించిన సేవాతాత్పరుడు, సాహితీ విశ్వంభరుడు డాక్టర్ రమణ గారికి జేజేలర్పిస్తున్నాను.
పింగళి. భాగ్యలక్ష్మి,
గుంటూరు,
ఫోన్ నెంబర్. 9704725609