Authorization
Wed April 09, 2025 10:48:14 am
- శశికళ.బి
నవరత్న మణులతో నాంచారి నగలు
కవనాలు కవితలు కనక మాలక్ష్మి
చెంపస్వరాలును చెవుల బుట్టలను
ఇంపైన కెంపులు ఇందిరా నగలు
ముత్యాల హారాలు మువ్వలా గొలుసు
నిత్యాభిషేకాలు నీపాద సేవ
పగడాల కడియాలు పసిడి హారాలు
నగుమోము కనుదోయి నల్లనీ కురులు!
గోమేధికము రంగు గొలుసు గాజులును
శ్రీమహాలక్ష్మికి చీర సారెలును
వైడూర్య హారాలు వడ్డాణవంకి
పైడి బొమ్మకు గట్టె పట్టువస్త్రాలు!
వజ్రాల గొలుసులు వరుసలు యేడు
వజ్రాల కంకణం వాలుజడపాళి
ఇంద్ర నీల మణులు యెనలేని నగలు
చంద్రుని చెల్లెలూ చెల్లెలూ చక్కదనాలు!
పైరు పచ్చల చీర పచ్చ హారాలు
తీరైన మోముండె తేజమ్ము తోడ
పుష్య రాగపు రంగు పొగడ పూదండ
ఐశ్వర్య శ్రీలక్ష్మి అలమేలు మంగ
ఏడు వారాలలో యిలవేల్పు లక్ష్మి
వైడూర్య గోమేధి వజ్రాల నగలు
ఆదివారము నాడు అరుదైన కెంపు
ఈదేవి హారాలు యేమి వర్ణింతు.