Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితం అంటే
అంతెరుగని కొలిమి
పోలికలేని కుంపటి
కొలిమిలో కాలిపోయిన పేదోడి
పేదరికపు కాంతుల ప్రశ్నల తాకిడి
ఆ బాధలో చిక్కిన
గాధలివి
వేడి సెగల గోసలివి
ముచ్చుకుందలో ముంచెత్తిన
కన్నీటి పంతాలివి
మంచానికి ఆరేసిన
నవారుపట్టి అల్లికల కూర్పులివి
భయానికి అమావాస్యలో
చిక్కిన శారదరాత్రులివి
ఇంటి ముందు "కనికి" పేరిన
నాచులోని జ్వాలలివి
కసాయి పాలనలో
చెట్టు కాయల కోసం
గుక్క వట్టిన నోరుతో
యేనలో తప్పిన గొఱ్ఱపిల్లలమైతిమి
బొంగులకు పట్టిన
బూజు అల్లికల మద్యలో
పందిరి తాటి ఆకుల జంటతో
రాలిపోయే తుప్పు పొట్టులమైతిమి
శివాలెత్తే ఆడది కూడా
పడగ ముడుసుకొని మూలకు నక్కినా..
జీవంలేని వానపాములమైతిమి
చీలికలు రాని గరక పోసలమైతిమి
ఎంత గరకపోసలమైన
పశువులకు బంగారమే కదా..
ఎర లేని ఉచ్చులో చేప ఎట్ల పడుదువు..
నవారు అల్లికలు లేని మంచంలో
కునుకు ఎట్లా తీద్దువు..?
వేదరికం అంచునా కొట్టుమిట్టాడిన
ఎండుబావి గడ్డకి నిలబడి
రాళ్లు విసరడానికి
నేను... తాటి బింకిని గాను
అదృష్టం అంటే అలుపెరుగని
అల్పజీవిని
పూల పళ్ళెంలో కూర లేకపోతే
కారం నూనెతో సద్దుకూనె
మధ్యతరగతి "సెమట సుక్కని"..!!
_తాళ్ళపల్లి శివకుమార్
మీదికొండ, స్టేషన్ ఘనపూర్
9133232326.