Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పక్షుల కిలకిలలు, కమ్మని తెమ్మెర గారాలు..
పురిటినొప్పులను పుక్కిటపట్టి
అప్పుడే పుట్టిన బిడ్డకు పాడె జోలలు...
ఉదయించిన పుడమికి ఇవే...
ఉషోదయ కిరణాల సరాగాలు
మోస్తున్నాయి రాగాల పల్లకిలో......
నునువెచ్చని కాంతి సోకిన పారిజాతాలు
విచ్చిన విరుల మైమరుపులు...
నూతనోత్సాహం నింపిన ఎదల్లో
మొలకెత్తే ఆశలు ఆ క్షణం ఆశయంగా
అలా తరగలై తడారిన గుండెల్లో
ఇంకుతున్న గలగలల గంగాగమకాలు
మురిపిస్తున్నయి రాగాల పల్లకిలో ..
పొద్దెంట పరిగెత్తే పొద్దుతిరుగుడు పువ్వోలె
వాలిన సూర్యునికి సంధ్యవార్చి సణుగుతూ..
వేవేల చుక్కల్లో వెన్నెల చంద్రుని ఇంట
వేడుకలు జేయగా తళుకుల తారల జంట
హాయిగ ఊయలలూప తన్మయత్వం పొంది
రాలిన పూలలో తిరిగి రాని కాలాన్ని తలచి
మరో ఉదయానికై మలచిన తన మనసును
మల్లెల సుగంధాలతో మోస్తున్నాయి...
మానవత్వపు రాగాల పల్లకిలో.......
- వి. పద్మ
హైదరాబాద్.