Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెక్కలొచ్చిన పక్షులు గూళ్ళొదులుతాయి
విత్తనం వేసిన తోటమాలికి పళ్లందకపోవచ్చు
అవి విచక్షణ ఉన్న మానవజాతికి చెందవు..
నవమాసాలు మోసి, కని, కళ్ళలో పెట్టుకుని చూసిన తల్లిని..
తన జీ(వి)తాన్ని ఎదుగుదలకు ధారబోసిన తండ్రిని..
దూరం చేసుకుంటున్నారంటే, కసాయి మనసుకు దర్పణమేకదా!
జవసత్వాలుడిగిన దశలో వాళ్ళేంకోరుకుంటారు
నాలుగు మంచిమాటలు, అనారోగ్యానికిన్ని మందులు..అంతేగా
బతుకు బతికించు అని సాటివాళ్ళ విషయంలో అనుకుంటామే
సమస్త జీవజాతిని సమాదరించేది మానవుడేనని చెబుతామే
దానికే గుండెని బండ చేసుకొని వృద్ధాశ్రమాల్లో చేర్చడమా
దేవుళ్లను సైతం కంటతడి పెట్టించే కలియుగ తత్త్వం ఇది అని సరిపెట్టుకందామా
మానవుడు మాధవుడయ్యేది కంటి ఎదురు దైవాలకి సేవచేసినప్పుడే
మారని మనిషి జీవచ్ఛవంతో..
జన్మ వృధాచేసుకునే శలభంతో..సమానం!
-సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్