Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి రమణీయతని
రసరమ్యంగా రంజింపజేసే
పూల ఆరాధన....
పుడమి తల్లి యదపై పురుడోసుకున్న
కరుణాలతల్లిని జూసి
పులకించేను వేవేల మనసులు...
తీరొక్క పూలను తెచ్చి
వరుస వరుసల అలంకరణతో
పర్వతాలనే దించే
లయబద్ద సాంప్రదాయానికిదీ
మహత్తర వేడుక....
అనురాగ ఆప్యాయతల
ఆత్మీయ బంధాలు
బాంధవ్యాలను నిలబెట్టే
ఊరిజనుల పండుగ.....
మానవత్వ విలువలనే పెంచి
అసమానత తొలగించే
పరిపూర్ణతకిదే నిదర్శనం....
జీవన విధానానికి అనుసంధానమై
శోభాయమానంగా వెలిగే
ఫల పుష్పాదుల పూజ....
ఆధ్యాత్మిక ఆయుర్వేదాన్ని
బతుకులలో నింపే
ప్రాణవాయువు పండుగ.....
ఆడబిడ్డల ఆనందాన్ని
యదలోని ప్రేమలను
పువ్వులుగా పూయించే
మమకారపు పండుగ.....
తంగేడు పూల బంగారు వర్ణం
సీతజడల సిగ్గులు
గునుగు గుమ్మడి హొయలు
తీరొక్క పూలతో
ఇంతి ఇంతి చేయి కలిపి
ఇంద్రధనుస్సులా పూయించేను
పున్నమి వెలుగుల కాంతులనే....
స్త్రీల జాతర పూల జాతర
ఊరి జనుల జాతర
పరవశాన్నే అలుముకున్నా
నారీమణుల పండుగ సందడి.....
ఆనంద సాగరాల తేలియాడి
నిత్యనూతన పరిమళాలు వెదజల్లగా
ఊరిచెరువు బతుకమ్మలతో
పూల ముగ్గులేసినట్లు.....
తెలంగాణలో పుట్టి లోకమంతా కొలిచేలా
వంతు వంతుల వాయనాలతో
అన్నగత జీవుల
ప్రసాద నివేదన అందుకుని
తిరిగి రావమ్మా బతుకమ్మ ఏటేటా....
- శ్రీలతరమేశ్ గోస్కుల
హుజురాబాద్
7013943368