Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మా..బతుకమ్మా
తెలంగాణ చరితకు ఘనకీర్తి నీవమ్మా
నీ రాకతో తెలంగాణ
తీరొక్క పూలవనమై శోభిల్లు నమమ్మా!
నీ రాక కోసం
తెలంగాణ మట్టిన పుట్టిన పువ్వులు
నీ సన్నిధిలో తరించాలని తహతహలాడుతాయి
తెలంగాణలోని పూల తరువులు
తనువంతా పూలకళ్లతో ఎదురుచూస్తాయి..
పసిడి వన్నెల తంగేడుపూలు
వెండి జిలుగుల గునుగుపూలు
నీ కోసమే జనించాయి
నీ సేవలోనే తరిస్తాయి
అందుకేనేమో!
తంగేడు గునుగుపూలను
మా అమ్మలు అక్కలు చెల్లెల్లు
తల దాల్చరు
అవి బతుకమ్మ పూలంటు
కళ్ల కద్దుకొని మొక్కుతారు..
తంగేడు గునుగుపూల సంబరం చూసి
కట్లపూలు కమలాలు కలువపూలు
బంతిపూలు చామంతులు గడ్డిపూలు
గన్నేరు మందార గోరింట రుద్రాక్షలు
గుమ్మడి నీలికట్ల పోకబంతి పట్టుకుచ్చులు
తంగేడు గునుగుపూలతో చెలిమి చేస్తాయి
నీ చెంతకుచేరి ధన్యత పొందుతాయి..
అమ్మా!బతుకమ్మా
మా అమ్మలు నీ ప్రతిరూపాన్ని
తీరొక్కపూలతో రూపొందించి
తొమ్మిది రోజులు నిన్నుకొలిచి
ఆనందంతో ఆడుతారు
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు గౌరమ్మ ఉయ్యాలో
అంటూ పాడుతారు
సద్దుల బతుకమ్మ రోజు
మా అమ్మలు అక్కలు చెల్లెలు
తీరొక్కపువ్వోలే తోచేరు
నీ రూపులాగే కనిపించేరు
మా అమ్మలందరూ
పూలతో రూపుదాల్చిన నీ రూపాన్ని
తలదాల్చి కదులుతూవుంటే
పూలవాగే పారుతున్నట్టు వుంటది..
తొమ్మిదోరోజు చూడచక్కనిరూపు నీదమ్మా
ఆ రోజు నీవు పెద్ద బతుకమ్మా
ఆ రోజు నీవైభవం చూడ రెండుకళ్లు చాలవమ్మా
అంబరాన్ని అంటే సంబరాలు మావమ్మా
గంగమ్మ చెంతకు నీవు చేరితే
చెరువులు కుంటలు వాగులు వంకలు
నీ స్పర్శతో పరవశించేను
ప్రకృతికాంత నిను చూసి
పచ్చ పచ్చగా మురిసేను..
- బూర దేవానందం
9494996143.
సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా