Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ జిల్లాల్లో మహిళలు అత్యంత ఉత్సాహంతో జరుపుకునే పండుగ బతుకమ్మ. ప్రతి పల్లెలో ప్రతి ఊరిలో మహిళలు అందరూ సమిష్టిగా సంతోషంగా తొమ్మిది రోజులు జరుపుకునే పండుగ. బతుకమ్మ పండుగ. సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, కుటుంబ విలువలకు, ఆత్మీయ అనుబంధాలకు ప్రతీక. ఆశ్వయుజ మాసంలో శుక్ల పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య నాడు మొదలుపెట్టే బతుకమ్మ పండుగను అమావాస్య లేక 'ఎంగిలిపూల బతుకమ్మ' అంటారు. ఆరోజు అమ్మవారికి నువ్వులు, నూకలను నైవేద్యంగా పెడతారు. రెండవ రోజు 'అటుకుల బతుకమ్మ' లోచప్పిడి పప్పు, బెల్లం, అటుకులు నైవేద్యాలు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఆరోజు ముద్దపప్పు, పాలు, బెల్లం, వంటకాలను ప్రసాదంగా పెడతారు. నాలుగవ రోజు నాన బియ్యం బతుకమ్మ. పాలు, బెల్లం, నానబెట్టిన బియ్యంతో నైవేద్యంగా పెడతారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ లో బియ్యపు పిండిలో చక్కెర, పాలు,ఇలాచిపొడి,కలిపి ఉండ్రాళ్ళంత గుండ్రంగా కట్టి ప్రసాదం పెడతారు. ఆరో రోజు అలిగిన(అర్రెమి) ఈరోజు బతుకమ్మ ఆట, పాటలు వుండవు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మలో సకినాల పిండితో వేపకాయలుగా చేస్తారు. ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మలో నువ్వులు, వెన్న, బెల్లం, నెయ్యితో నైవేద్యం చేస్తారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మలో ఐదు రకాల నైవేద్యాలు పెరుగన్నం,కొబ్బరి, నువ్వులు, పులిహోర, నిమ్మకాయలతో చేసిన వంటకాలతో పాటు గోధుమ రొట్టెలు,బెల్లంతో కలిపి మలీద లడ్డూలు చేసి జగన్మాతకు నైవేద్యం పెడతారు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈపండుగ. తెలంగాణ రాష్ట్రమంతటా నిర్వహిస్తారు. అయితే పండుగ ఆచరించే విధానంలో చాలా వైవిధ్యం కనిపిస్తుంది
బతుకమ్మ పండుగ స్త్రీల సమానత్వాన్ని కోరుకునే పండుగ. స్త్రీలకు స్వేచ్ఛనిచ్చిన పండుగ. బతుకమ్మ పండుగ భయాలను తొలగించి భాగ్యాలను కలిగిస్తుందని విశ్వసిస్తూ సామూహికంగా సంతోషంగా జరుపుకుంటారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన బతుకమ్మ పండుగకు ఆధారమైన చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ధర్మాంగుడి కథ ను బతుకమ్మ పాటలలో పాడతారు. పూర్వకాలంలో ధర్మాంగదుడు అనే రాజుకు సత్యవతి అనే భార్య ఉండేది. వారికి వంద మంది కొడుకులని వారు యుద్ధంలో శత్రువుల చేతిలో మరణించారని ఆ రాజదంపతులు పట్టరాని దుఃఖంలో ఉండగా వారికి లక్ష్మీదేవి కలలో కనిపించి నేనే మీ కడుపున పుడతానుఁ అని చెప్పిందట. ఆ విధంగా లక్ష్మీదేవి వారి కుమార్తెగా పుట్టిందని ఆమె బతుకమ్మ అయిందని, అందుకే బతుకమ్మను దేవతగా కొలుస్తూ ప్రతి సంవత్సరము పండుగ జరుపుకునే సంప్రదాయం ఏర్పడింది అని అంటారు. బతుకమ్మ పాటలు కుల వృత్తులకు సంబంధించిన పాటలు, ఆడపిల్ల జీవితానికి సంబంధించిన పాటలు, అత్తవారి ఇంటిలో ఏ విధంగా మెలగాలని వివరించే పాటలు ఉన్నాయి. ఏ పాట అయినప్పటికీ ముఖ్యంగా ఆడవారిని దృష్టిలో పెట్టుకుని వారికి శుభం కలగాలని ఉద్దేశంతో పాడే పాటలు అనేకం ఉన్నాయి బతుకమ్మ అంటే పుట్టుక, జీవితానికి సంబంధించిన పండుగ. ప్రకృతిలో లభించే రకరకాల పూలను సేకరించి బతుకమ్మను పేర్చుతారు. ముఖ్యంగా తంగేడు పూలు, రకరకాల రంగులద్ది గునుగు పూలను ఉపయోగిస్తారు. అంతేకాకుండా బంతి, చేమంతి, మందార, తామర, గన్నేరు, గోరింట, గడ్డిపూలు, గుమ్మడి పూలు,కట్లపూలు,అల్లిపూలు మొదలగు ప్రకృతిలో లభించే రకరకాల పూలతో విభిన్న రంగులతో ఆకర్షణీయంగా చిన్న బతుకమ్మలు మొదలుకుని ఐదారు అడుగులకు మించిన బతుకమ్మలను కూడా పేర్చుతారు.
ఇత్తడి లేదా రాగి,లేదా వెదురు సిబ్బిలో గుమ్మడి ఆకులను పరచి బతుకమ్మ అటూ ఇటూ ఒరిగిపోకుండా ఆకులపై నాలుగు వైపులా దారాలను వేయాలి. మొదటి వరుసలో తంగేడు పూలను, తరువాత గునుగుపూలను పేర్చి,రకరకాల పూలనును వరుసగా పేర్చుతూ,మధ్య మధ్యలో బతుకమ్మ ఒకేరకంగా వచ్చేలా సరిచేస్తూ పేర్చుతారు.కింది భాగం వెడల్పుగా ఉండి పైకి వెడల్పు తగ్గించుకుంటూ గోపురం ఆకారంలో బతుకమ్మను తయారుచేసి పై భాగంలో తమలపాకులు మీద పసుపు గౌరమ్మను పెడతారు బతుకమ్మను గౌరమ్మకు పర్యాయంగా భావించి పూజిస్తారు.పెద్ద బతుకమ్మతో (తల్లి బతుకమ్మ) పాటుచిన్న బతుకమ్మను (పిల్ల బతుకమ్మ) పేర్చుతారు.
స్త్రీలు ఎంతో సృజనాత్మకతతో కళాత్మకంగా తీర్చిదిద్దుతారు సాయంత్రం సమయంలో తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా స్త్రీలు,పిల్లలు,పెద్దలు వయోభేదం లేకుండా అందరూ పట్టు పరికిణీలు, పట్టు చీరలు ధరించి రకరకాల నగలతో చూడముచ్చటగా తయారవుతారు అన్ని పండుగల కంటే బతుకమ్మ పండుగ లోనే మహిళలు అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బతుకమ్మను ఇంటి ముంగిళ్ళలో గాని గుడి దగ్గర పెట్టి బతుకమ్మ చుట్టూ స్త్రీలందరూ వలయాకారంగా నిలిచి ఉయ్యాల పాటలు, గౌరమ్మ, చందమామ మొదలగు ఆవృత పదంతో చప్పట్లు కొడుతూ ఒకే మాదిరిగా ఒకే రకమైన చలనంతో కుండలాకారం గా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఉంటారు. తర్వాత దగ్గర లోని వాగు, చెరువు, దగ్గరకు వెళ్లి బతుకమ్మను పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడతారు. లయబద్దంగా వాళ్ళు చేసే నృత్య కనులవిందుగా ఉంటుంది. బతుకమ్మ పండుగకు చేసే పిండి వంటలు నైవేద్యాలు కూడా ఇతర పండుగలతో పోలిస్తే విభిన్నంగా ఉంటాయి. బెల్లం కలిపిన నువ్వుల పొడి, పల్లీలపొడి,చక్కెర కలిపిన కొబ్బరి పొడి, మొక్కజొన్న ల తో తయారుచేసిన సత్తుపిండి, సత్తు పిండి లడ్డూలు, బెల్లం తో తయారుచేసిన పులిహోర పెరుగన్నం చేస్తారు వాటినన్నింటినీ మూటగట్టుకుని బతుకమ్మతో పాటు తీసుకుని వెళతారు ఆడవాళ్లందరూ ఆటా పాటలతో గడిపి అందరూ బతుకమ్మను చెరువులోకి వదులుతారు. నిమజ్జనం చేసిన తరువాత బతుకమ్మలు తేలియాడుతూ కదులుతూ ఉంటే ఆ దృశ్యం ఎంతో రమణీయంగా ఉంటుంది. తరువాత వారి వెంట తెచ్చుకున్న ద్దులను ఇచ్చితిమమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మా వాయనం అంటూ ధనిక, పేద భేదం లేకుండా ఒకరికి ఒకరు పంచుకొని తిని ఆత్మీయ బంధాలను పంచుకుంటారు. ఇరుగు పొరుగు వారు, అక్కచెల్లెళ్ళు, వదిన మరదలు, అత్తా కోడళ్ళు, స్నేహితులు, కలిసి చేసుకునే సామూహిక పండుగ . బతుకమ్మను ఊరేగింపుగా తీసుకువెళ్ళేటప్పుడు అన్నదమ్ములు, మామలు మొదలగు కుటుంబంలోని మగవారు వారికి సహాయంగా రక్షణగా వెళతారు. అంటే కుటుంబంలోని వారంతా కలిసి చేసుకునే పండుగ. తెలంగాణ ఉద్యమంలో ఊరూరా, వాడవాడలా ఊరేగించిన బతుకమ్మ ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ అస్థిత్వ విజయాన్ని సాధించిన బతుకమ్మ తెలంగాణ రాష్ట్రపండుగై అలరించింది,తంగేడు పువ్వు రాష్ట్ర చిహ్నమై నిలిచింది.తరతరాల చరిత్రకు నిలువెత్తు నిదర్శనం మైనది.బతుకమ్మ కన్నెపిల్లలు తమకు మంచి మనసున్న భర్త రావాలని, వివాహితలు భర్త ,పిల్లలు కుటుంబ సంక్షేమాన్ని కోరుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. ఆడపిల్లల భ్రూణ హత్యలు లింగ వివక్షతలు, వరకట్న దురాచారాలు, వారిపై జరుగుతున్న అరాచకాలు మొదలైనవి నశించి ధైర్యంగా స్వేచ్ఛగా ఆనందంగా గడిపే కాలం ఈ బతుకమ్మ పండుగ నుండి రావాలని ఆడవారిని బతుకు దీవించాలని కోరుకుందాం.
✍పులి జమున
మహబూబ్ నగర్, 8500169682.