Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తీరొక్క పూవుల్ని బేరాలాడి అంగట్ల కొనుక్కొచ్చి
పెరట్లపారిన గుమ్మడి చెట్టుకు మంచిగున్న ఆకులు నాలుగు తెంపి
అక్కడెక్కడో అందంగ గనపడే గుమ్మడి పూల కోసం దొర్లాడి
అట్లిట్ల తెంపుకున్నంక మనసుకు నిమ్మలమాయె
సోపతోళ్ళకన్నా మంచిపూలు దొరికితే గా సంబురమే వేరు
ఇంట్ల పనులన్నీ చేసుకొని నిమ్మలంగ సాపేసుకొని
నిండా నీళ్ళు నింపుకున్న తపాల మీద ఇత్తడి తపుకు పెట్టుకొని
ఇగ శ్రీలక్ష్మి నీమహిమలూ గౌరమ్మ అని పాటనందుకుంట
దారాన్ని రెండుపోగులు తీసి తపుకుమీద నాలుగుదిక్కులా పెట్టి
గుమ్మడాకులు పరిషి మొట్టమొదలు తంగేడు పూల కట్టలను తెంపి
ఒక్కొక్క రెమ్మను కుప్పగట్టి అందంగ పేర్శి
ఇగ గిప్పుడు గునుగు రంగుల కట్టలను ముందర పెట్టుకొని
పోకరంగు గునుగుకట్టైనంక చిగురుపచ్చ రంగు గునుగు కాంగనే
ఎరుపురంగు గునుగును పేర్సుకొని ఇంకోపాట దరచోళ దేశాన అందుకొని
గప్పుడు పసుపుముద్దలోలున్న ముద్దబంతుల్ని అందుకొని ఒక్కొక్క పువ్వును జూసుకుంటా
నవ్వులన్ని ఏరి మూటగట్టి నా నవ్వులకు రంగులద్దుకొని
ఇప్పుడు కెంజాయి రంగు ముద్దబంతుల్ని ఇంకోవరుసలో పేర్సుకుంటా
వాని రంగుల్ని నామోముకద్దుకొని సంబురవడ్డ ఇగ రకరకాల రంగులపూలన్నీ ఓవరుసలో పేర్శి కండ్లనింపుకొని మురిషి
ఇగ గుప్పెడు గులాబీలు చేతబట్టి మురిపెంగ పేర్సుకున్న నా ముచ్చటైన జోడి బతుకమ్మలను
చిట్టచివర గుమ్మడిపూ గౌరమ్మను కొలువుతీర్శి నిండుముత్తైదువనై
నూరేండ్లు నిన్నుపేర్సుకొని ఆడుకునే భాగ్యాన్నీయమని దండం బెట్టుకుంట
నాలుగుదిక్కులున్న దారాలపోగులను ముడేసి ముద్దుగ పేర్శిన
బతుకమ్మలను లేపి దేవునర్రల చెక్కపీట పైనపెట్టి
పసుపుకుంకాలను సల్లి తడిబట్ట కప్పి సద్దులు నైవేద్యం బెట్టుకుంటె
పొద్దుగాల పెద్దపనైనట్లు ఇగ ఒక్క కునుకుతీసి చూషెటాల్లకే సాయంత్రం ఐతనే వుండె
దబదబ తయారయ్యి పట్టుచీరగట్టి వున్నకాడికి నగలన్ని పెట్టి ముద్దుగుమ్మలందరం గలిషి
కట్టపంటి వున్న గుళ్ళెకు బోయి ఆడుకుంట
చాన్నాళ్ళకు గల్షిన దోస్తులకు
అలాయ్ బలాయ్ లిచ్చుకొని శిమ్మన్జీకటి దాక ఆడుకోని గౌరమ్మను ఓలలాడించి
మల్లరమ్మంటూ బుద్దులుజెప్పి బుజ్జగించుకుంట చెర్లనీళ్ళల్ల వదిలిపెట్టి
పసుపుగౌరమ్మను ఒకలిపుస్తెలకొకలం పెట్టుకొని వరుసైనోళ్ళం చెంపలకు పూసుకుంట
గప్పుడందరం సద్దుల మూటలిప్పి ఒకలినోట్ల ఒకలంబోసుకుంట
నవ్వుల పూలన్ని దారెంట జల్లుకుంట ముచ్చట్ల సుక్కల్ని దారెంట పర్సుకుంట
సంతోషాల సద్దులతో కడుపునింపుకొని ఇండ్లుజేరి కంటినిండ హాయిగ కునుకుతీస్తం
గివి మా తెలంగాణ మాగాణుల్లో జరుపుకునే మా బంగారు బతుకమ్మ కమ్మని ముచ్చట్లు శనార్తెలు
-వకుళవాసు
9989198334