Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తంగేడు,గునుగు,గుమ్మడి...
బంతి,మందార, నీలాంబరాలు...
రంగురంగుల పూలు...
నూటొక్క పూలు...
తీరుతీరునా తీర్తురతివలు...!
వారి ఓరిమికి, కళానైపుణ్యానికి మచ్చుతునకలు బతుకమ్మ పేర్పులు...
పసుపు కుంకుమ శోభలతో కనువిందు చేసే కళావీచికలు...
తెలంగాణ సంస్కృతికి గోడ చేర్పులు...!!
ప్రకృతి,పర్యావరణములతో
చెలిమి కూర్పులు...
ఇరుగుపొరుగుతో సామరస్యమును
పెంచే నేర్పులు...
నదీనదముల కలుషితములను
పరిమార్చే ఓదార్పులు...!!!
వ్యాయామం, ఆటపాటలు కలగలిసిన సందడితో సుదతులకు ఆటవిడుపులు...
పోషకాల నైవేద్యాలతో,ఇచ్చిపుచ్చుకొను
వాయినాలతో సత్సంబంధాల పాదుకొల్పులు...!!!!
పసిడి వర్ణపు తంగేడు పూలతో మెరిసిపోయే బతుకమ్మ...
పూలదొంతరల పరిమళాలతో విరాజిల్లే బతుకమ్మ...!!!!!
జనపదాలతో మమేకమై పాటల పల్లకీలో ఊరేగే బతుకమ్మ...
దేశ విదేశాలలో జరుపుకునే సంబరం బతుకమ్మ...
అతివల ఆనందోత్సాహాల నిలయం బతుకమ్మ...
తెలంగాణా సంస్కృతి వైభవ చిహ్నం
బతుకమ్మ...!!!!!!!!
- చంద్రకళ. దీకొండ,
స్కూల్ అసిస్టెంట్,
మల్కాజిగిరి, మేడ్చల్ జిల్లా.
మొబైల్ నెంబర్:-9381361384