Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతటా ఆమె
దుఃఖమై పారుతుంది.
కాలాన్ని లెక్కించలేదు కానీ
ఎన్నో ఏళ్లుగా కనురెప్పలకు
దుఃఖాన్ని మోస్తున్న ఈ నేల ఆ ఆకాశం
ఏడ్చి ఏడ్చి వాటి కళ్ళన్ని ఎర్రబడిపోయాయి.
అచేతనమో అలవాటో మరి
దేహం వదిలిన గాయాల తడి
రోడ్డుపై ఇంకా పచ్చిగానే ఉంది .
ఆమె పుట్టుక ఒక్కసారే కానీ
నిత్యం ఏదో ఓ చోట
మరణాన్ని శ్వాసిస్తూనే ఉన్నది .
లోకం తన కబంధ హస్తాలతో
ఎన్నో యుగాలుగా
ఆమెను శిలగా చిత్రించి
స్వేచ్ఛ హృదయాన్ని నూరి పోస్తున్నది .
అప్పటికి ఇప్పటికి మధ్య వ్యత్యాసంలో
ఆమెకు మంచి రోజులొచ్చాయన్నారు .
మారింది ఆమె కాదు
తన చిరునామా మాత్రమే మరి ,
ఇంతకు ముందులా చెత్తకుప్పల్లోనో
ముళ్ల కంపల్లోనో లేక వీధి చివర వదిలెల్లిన మాంసపు ముద్దగానో కాదు .
ఆమె నిత్యం దేశ నిర్వచనమై
నలుదిక్కుల నినాదమై ప్రవహిస్తున్నది .
తన గాయాల నగ్నదేహాన్ని మోస్తూ
వీధి వీధిన నివాళులు కురుస్తున్నయి.
అందుకేనేమో తనని
దేశ ముఖచిత్రంగ చిత్రించమని
ఆమె కొనఊపిరి కోరుతున్నది
అవును ఇప్పుడు దేశమంటే ఆమెనే .
ఆమె పుట్టడమే సందేహమైన చోట
బతికి బట్ట కట్టడం ప్రపంచానికి సందేశమవుతున్నది .
తన మరణం ఒక విప్లవగీతమై వర్ధిల్లుతున్నది.
ఒక్కో మరణానికి ఒక్కో కన్నీటిపువ్వును అర్పిస్తున్న ఓ తంగేడుచెట్టు
ఇదే ఆఖరి అర్పణగా కావాలని
ఎన్నిసార్లు దుఃఖనదిగా మారిందో..
గుండెల్లో దుఃఖాన్ని నింపుకొని
రాలిన తంగేడుపువ్వు
ఆమెకు ఎర్రమన్ను కప్పుతూ
బతుకమ్మ బతుకు...
జననంలో మరణానివైన నీవు
మరణంలోనూ జననానివై
ఊరూరా ఆడపడుచుల
బతుకమ్మ ఉద్యమపాటగా
కలకాలం బతుకమని ఆమెపై పడి నివాళి అర్పిస్తున్నది.
- రామ్ పెరుమాండ్ల