Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బతుకమ్మా బతుకు....
నిత్యం మానభంగాలకు గురవుతున్న
భరిస్తూ బ్రతుకు
ప్రతిఘటిస్తే శవమై మిగులుతావని
తెలుసుకుని బతుకు
నిన్నేన్ని మాటలన్నా
నువ్వు నోరు మూసుకునే బ్రతుకు
నువ్వు నోరు తెరుస్తే నాలుక తెగ్గోస్తారని
తెలుసుకుని బతుకు
కామందులు కామంతో నిను చూస్తే
నువ్వు కళ్ళు మూసుకుని బ్రతుకు
కాదని కళ్ళు తెరిస్తే కాటికి చేరుతావాని
తెలుసుకుని బతుకు
బతుకమ్మా బతుకు
దేశానికి స్వతంత్రం వచ్చి
దశాబ్దాలు గడుస్తున్న
మగాళ్ళ కింద
బానిసలాగే నీ బ్రతుకు
బతుకమ్మా బతుకు
"బేటీ బచావో-బేటీ పడావో"
నినాదమై బతుకు
మనువాదుల పాలనలో
నిత్య అవమానాలతో
జీవచ్చవమై బ్రతుకు
బతుకమ్మా బతుకు
అనుమానంతో మహిళను
మంటల్లో దూకించిన రామ రాజ్యంలో
మహిళను మనిషిగా గుర్తించని
మనువాదుల రాజ్యం లో
స్త్రీ ని ఆది పరాశక్తని కొలిచిన
అపర కాళికా అని పూజించిన
అట్టడుగునే నీ స్థానమని
గుర్తెరిగి బ్రతుకు..
అందుకే..
బతుకమ్మా బతుకు
ఆధిపత్యాన్ని ఎదిరించిన
సమ్మక్క సారక్కవై బతుకు
కామందుల భరతం పట్టిన
పూలందేవై బ్రతుకు..
బతుకమ్మా బతుకు
ఏ బంధాల్లో బందీ కాక
స్వేచ్చా జీవివై బ్రతుకు
ఎవరికీ లొంగక
స్వతంత్రంగా బ్రతుకు
బతుకమ్మా బతుకు
రేపటి వెలుగువై బ్రతుకు
- దిలీప్..వి
జిల్లా కార్యదర్శి
మనవ హక్కుల వేదిక
ఉమ్మడి వరంగల్ జిల్లా
సెల్: 8464030808