Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువశ్రీ బీర.
9966663569.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకొనే పండుగలు దసరా,బతుకమ్మ గా ప్రశస్తికెక్కాయి...
అందులోనూ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకునే పండుగ... స్త్రీలకు ఎంతో ప్రత్యేకం. దేశంలో మరే ఇతర ప్రాంతాల్లోనూ లేని ఈ బతుకమ్మను పూజించడం తెలంగాణా సంస్కృతి యొక్క విశిష్టత.
' తెలంగాణ ప్రజల గుండె చెప్పుళ్లే, చప్పట్లుగా, కమ్మని పాటలుగా సాగే ఈబతుకమ్మ' చరిత్రకెక్కిన అందమైన పూల పండుగ...తెలంగాణ స్త్రీల మనోభావాలకు, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ.
మహాలయ అమావాస్య నాడు ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు
ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి... తొమ్మిది రోజులపాటు ఈ పండుగ జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో వస్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రసాధనలో బతుకమ్మ ఎంతో విశిష్టతను సంతరించుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రగా ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. వర్షాకాలం చివర శీతాకాలం మొదలవుతూ ఉండటంతో ప్రశాంత వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. .వర్షాలు కురుస్తాయి కాబట్టి రంగురంగుల పూలతో పుడమి అంతా కొత్తఅందాల్ని పులుముకుని సరికొత్త శోభతో మెరిసే సమయం ఇది. పౌర్ణమిలి వెళ్లిన వారానికి పుట్టమన్ను తెచ్చి ఐదంచెల కూర్పుతో అందాల 'బొడ్డెమ్మను' రమ్యంగా తయారుచేసి వెంపలిచెట్టును నాటుతారు...గద్దెల చుట్టూ పుట్టమట్టితో అలికి పచ్చపిండితో అందంగా ముగ్గులువేసి రుద్రాక్షపూలతో అలంకరిస్తారు. ఈ తంతు అంతా కన్నెపిల్లలే చేస్తారు. ఒక వారంపాటు పెళ్లికాని పిల్లలే బతుకమ్మను ఆడుకుంటారు. ఆ తర్వాత మహాలయ అమావాస్య నాడు ముత్తైదువులు ఎంతో భక్తి శ్రద్ధలతో మొదటిరోజు బతుకమ్మను తయారుచేస్తారు. ఈ మొదటిరోజు బతుకమ్మనే ఎంగిలిపూల బతుకమ్మ అంటారు... ఆరోజు నుండి మొదలుకొని దసరాకు రెండురోజుల ముందు వరకు ఆడతారు...అంగరంగ వైభవంగా తొమ్మిదొద్దుల బతుకమ్మను చేస్తారు అదే సద్దుల బతుకమ్మ ఈరోజు చిన్నాపెద్దా, ముసలీముతక, పురుషులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. చెరువుగట్ల దగ్గర ఎంతో కోలాహలంగా ఉంటుంది...అందరూ కలిసి బంధుమిత్రుల సమేతంగా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొనే సరదాల పండుగ ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ మన బతుకు చిత్రం. బతుకమ్మ తెలంగాణా స్త్రీల జీవితం. అంతేకాదు, బతుకమ్మ 'ఆట..పాట' మన వారసత్వ సంపద. ! అన్నింటికీ మూలం స్త్రీ, అందుకే ఇది ముఖ్యంగా స్త్రీల పండుగ.
వైశిష్ట్యం:
నిజాముల పరిపాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలకు గురయ్యారు ముఖ్యంగా మగువలు వారి చేతుల్లో ఎందరో బలయ్యారు. బతుకుపోరాటంలో అలిసిపోయిన ప్రజలు నిజాములకు వ్యతిరేకులు అయ్యారు...తనువు చాలించిన అబలల గుర్తుగా తీరొక్కపువ్వులను కోసుకొచ్చి ఇత్తడి పళ్ళెంలో లేదా రాగి సిబ్బిలోనో వలయాకారంగా పేర్చుకుంటారు. ప్రకృతిలి కాంతకు పసుపుపచ్చ చీర కట్టినట్లుండే అందమైన తంగేడు పూలు తంగేడు పూలకు నీటిని శుద్ధి చేసే గుణముంది. భాద్రపద మాసంలో వర్షాలకు చెరువుల్లో చేరిన మురికి నీరు ఈ తంగేడుపూల చేరికతో శుభ్రమవుతాయి. ఈ బతుకమ్మను పేర్చేందుకు ఎన్నోవర్ణాల పూలు అవసరం. ఇలా అందాల పూవులైన గునుగు, తామర, సీతమ్మ జడకుచ్చులు, గోరెంట, బీర, కట్ల,గుమ్మడి, గోరెంట, రుద్రాక్ష, గన్నేరు, మంకెన మొదలగు పూలను పొద్దుగాలనే సేకరించి తలస్నానాలు చేసుకొని కొత్తబట్టలు కట్టుకొని ఇంట్ల ఉన్న ఆడబిడ్డలంతా ముచ్చటగా కూర్చొని ఎంతో శ్రద్ధతో అందరి బతుకమ్మలకంటే అందంగా మాదే బాఉండాలంటూ ఒకరిపై ఒకరు పోటీలుపడుతూ ఒక పెద్ద బతుకమ్మ ఒక తోడు బతుకమ్మ అని చిన్న బతుకమ్మని పేర్చుకుంటారు.
గౌరమ్మ
గౌరమ్మను చేసి కుంకుమ బొట్లు పెట్టి వాళ్ళు పేర్చుకున్న బతుకమ్మ మీదపెట్టి దండం పెట్టుకొని దేవుని మందిరంలో పెట్టుకుంటారు. గౌరమ్మ అంటే పార్వతీదేవికి ప్రతిరూపమే, ఇలా సాయంత్రం వరకు ఇంట్లో ఉంచి సాయంత్రం వాకిట్లో బతుకమ్మనుపెట్టి దాని చుట్టూ చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుకొని తర్వాత నీళ్లల్లో కలిపేస్తూ ఉంటారు. కొందరు అదే పల్లెలు గ్రామాల్లో అయితే సాయంత్రం భజన మందిరాల దగ్గరకానీ, దేవాలయాల దగ్గరకానీ ఆడపడుచులందరూ చేరుకొని బతుకమ్మలు అందరివి ఒకదగ్గరపెట్టి చుట్టూరా తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఒకరు ముందుగా పాట పాడుతుంటే కోరస్ గా మిగతావారు , లయబద్దంగా పాడుకుంటారుఁ . కొందరు కోలాటాలు ఆడుతూ పాటలు పాడుకుంటూ ఉంటారు. ఈ తంతు అంతా అయ్యాక దగ్గరలో ఉన్న చెరువు, కాలువల్లో పారే నీటిలో నిమజ్జనం చేస్తారు. అయితే ఈ బతుకమ్మ పండుగ జరుపుకునేందుకు అడబిడ్డలందరూ ఎంతో హుషారుగా పుట్టింటికి చేరుకుంటారు. అమ్మమ్మలు తాతయ్యలు బిడ్డలు అల్లుళ్ళు, మనవళ్లు,మనవరాళ్లతో అన్ని ఇండ్లు కన్నులపండుగగా ఉంటాయి. తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మను ఆడుకోడానికి కొత్తబట్టలు, పట్టువస్త్రాలు ధరించి ఉన్నంతలోనే నగలు అందంగా అలంకరించుకొని ముద్దుగుమ్మలంతా ముస్తాబై మసకబడ్డాక చెరువుల దగ్గరవున్న ఖాళీస్థలానికి బతుకమ్మలతో చేరుకుంటారు. కొన్ని గంటలపాటు ఆడుకొన్న తర్వాత కూడా వచ్చిన మగవాళ్ళు చెరువులోకి దిగితే ఒకొక్కరుగా మహిళలు ఈ బతుకమ్మలను వారికి అందిస్తూ నీటిలో వదులుతూ 'పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా మళ్ళీ ఏడాదికి మరలరావమ్మా' అంటూ నిమజ్జనం చేస్తారు. 'సంధ్య చీకట్ల సమయాన నీటిలో దీపాల వెలుగులో కాంతులీనే రంగు రంగుల పూల బతుకమ్మల దృశ్యం చూడముచ్చటగా ఆహ్లాదంగా కనిపిస్తుంది'. తర్వాత తీసుకొచ్చిన సత్తుపిండి లేదా పేలాలపిండి ని ఒకరికొకరు పంచుకొని తిరిగి ఇండ్లు చేరుకుంటారు.
తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు
1.ఎంగిలిపూల బతుకమ్మ
తెలంగాణలో పెత్రామాస ( పెద్దలకు బియ్యమిచ్చే రోజు) రోజే అంటే మహాలయ అమావాస్యనాడు పేర్చుకునే మొదటిరోజు బతుకమ్మనే ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలతో తయారుచేసిన నైవేద్యం పెడతారు.
2.అటుకుల బతుకమ్మ
రెండోరోజు అటుకులను,బెల్లంతో కలిపి నైవేద్యంగా సమర్పించుకుంటారు.
3.ముద్దపప్పు బతుకమ్మ: మూడోరోజు బతుకమ్మకు ముద్దపప్పు, పాలు, బెల్లంను నైవేద్యంగా పెడతారు.
4.నానేబియ్యం బతుకమ్మ: నానబెట్టినబియ్యం,పాలు,బెల్లంను నైవేద్యం గా సమర్పిస్తారు.
5.అట్ల బతుకమ్మ: ఈ ఐదవరోజు అట్లూపోసి నైవేద్యంగా పెట్టుకుంటారు.
6.అలిగిన బతుకమ్మ: ఈరోజు ప్రసాదాలు ఏమీ ఉండవు.
7.వేపకాయల బతుకమ్మ: బియ్యంపిండి బెల్లంతో వేపకాయల ఆకారంగా తయారుచేసి నైవేద్యంగా పెడతారు.
8.వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు,వెన్న లేదా నెయ్యి తో నైవేద్యం చేసి పెడతారు.
9.సద్దుల బతుకమ్మ: ఇది ఆఖరిరోజు కాబట్టి ఐదు రకాల నైవేద్యాలు తయారుచేస్తారు అవి పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం, పేలాలపిండి లేదా సత్తుపిండిని నేవేధ్యంగా సమర్పిస్తారు.
ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిసాంప్రదాయను చాటుతోంది. మనసైన చెలులతో మధురజ్ఞాపకాలను పంచుకుంటూ,కొత్తపెళ్లికూతుళ్ళ వాయనాలతో, వరసైన వదినల పరాచికాలతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవటం విశేషం. ఈ పండుగలి తెలంగాణా ప్రజల ప్రేమ ఆప్యాయతలు, సంతోషాలు దుఃఖాలు వెరసి తెలంగాణ ప్రజల బతుకులకు బాధలకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకొనే ఈ పండుగ బతుకమ్మ పాటలతో బతుకుదెరువు నేర్పిన మమతానురాగాల పూల పండుగ, ఈ పండుగను చిన్న పెద్ద, ధనిక బీద బేధం లేకుండా ముదితలంతా ముచ్చటగా జరుపుకుంటారు. ఈపండుగ ఎన్నాళ్లనుంచో కలహాలున్న వారినీ ఇట్టే కలిపేస్తుంది. స్నేహాన్ని , మానవత్వాన్ని మనుషుల మనసుల్లో నింపుతుంది. కానీ నేడు వాతావరణం కాలుష్య కోరల్లో చిక్కుకొని ప్రకృతిలో పచ్చదనం ప్రశ్నర్ధాకమౌతుంది. పల్లెల్లోనే అక్కడక్కడా కనిపించే తంగేడుపూల పరిమళం పట్టణ వాసులకు కలలోని మాటగానే మిలిగిపోతున్నది. మనిషి స్వార్థంతో కాక పర్యావరణ కాంక్షతో యోచించి ప్రకృతిని కాపాడి తెలంగాణా భావితరాలు కూడా బతుకమ్మను ఆడేలా చూడడం ఇప్పుడు మనముందున్న పెద్ద సవాల్ ! వివిధ జాతుల పూలన్నీ సమైక్యతతో ఉన్నట్లే, మానవులంతా కలిసి మెలసి ఉండాలని ప్రభోధించే పండుగే ఈ బతుకమ్మ.
ఒక ఋతువు తర్వాత మరొక ఋతువు చక్ర భ్రమణంలో భ్రమిస్తూ వస్తుంటాయి. ఋతువు పూర్తయి మళ్లీ వచ్చేవరకు అది విశ్రాంతిని పొందుతుందనే అభిప్రాయం స్త్రీలలో ఉండవచ్చు. ప్రకృతి నుంచి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికే సమర్పించుకోవడం బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేయడంలోని అంతర్యం కావొచ్చు.