Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వురిమళ్ల సునంద, ఖమ్మం
9441815722
బతుకమ్మ.... ఈ మాట వినగానే "బతుకమ్మా బతుకు.. నిండు నూరేళ్ళు చల్లగా బతుకు" అని దీవిస్తున్నట్టుగా ఉంటుంది. అలా పువ్వుల్లా పరిమళిస్తూ, జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ బతుకాలని ఆడబిడ్డలంతా ఆనందంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ అన్ని పండుగల లాంటిది కాదు.
సాధారణంగా పండుగల్లో కొన్ని ప్రముఖమైన పూలను మాలలుగా అల్లి భగవంతుని మెళ్ళో వేస్తారు. ఆకులతో వినాయక చవితి, శివరాత్రి పూజలు చేస్తారు. కానీ పూలనే దేవతలుగా, ఏ ముఖ్యమైన పూలనో కాకుండా శరదృతువులో పూచే ప్రతి పూవును సేకరించి, భక్తి శ్రద్ధలతో ఆ పూలను పూజించే పండుగ. మహోన్నత సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.
పూలను ప్రేమించి, గౌరవించి వాటిని బతుకనీయడంలోనే మన హృదయ ఔన్నత్యం ఉందని తెలియజేసే సందేశం ఇందులో ఉన్నది. మన తెలంగాణ రాష్ట్ర పండుగగా గౌరవం పొందిన పండుగ ఇది.వేల సంవత్సరాల క్రితం నుండే బతుకమ్మ ఇంటింటి ఆడబిడ్డగా ఆదరింపబడి పూజలందుకున్నది.
నైజాం నవాబుల కాలంలో, జమిందారీ వ్యవస్థలో అనాదరణకు అవమానాలకు గురైనా, సామాన్య పల్లె ప్రజలు బతుకమ్మను తమ బతుకులో భాగంగా చేసుకుని ప్రాణంగా జరుపుకుంటూ వస్తున్నారు.
మొదటగా బతుకమ్మ పండుగ విశేషాలు తెలుసుకుంటుంటే చాలా ఆనందంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ బతుకమ్మ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుందాం. రాష్ట్ర కూటులు అనే రాజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే సమయంలో వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళ రాజులతో జరిగిన యుద్ధంలో చాళుక్యులు రాష్ట్రకూటులకు సహాయంగా నిలిచారు. తర్వాత తరానికి ప్రతినిధి అయిన రాజేంద్ర చోళుడు వేములవాడ నుండి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించడంతో కలత చెందిన తెలంగాణ ప్రజలు పూలన్నీ తెచ్చి బతుకమ్మను పేర్చి తమ బాధను రాజుకు తెలియజేస్తారు. బృహదమ్మ పేరు నుండే బతుకమ్మ పేరు వచ్చిందని చెబుతారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు శివుడు లేని పార్వతి గురించి పాటలు పాడుతూ జరుపుకుంటారని ప్రతీతి.
ఈ పండుగకు మరో కథనం కూడా ఉంది. వేల సంవత్సరాల క్రితమే ఆదివాసీలు బతుకు తెరువు చూపే అమ్మగా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారనడానికి ఋజువులుగా మూడవ శతాబ్దానికి చెందిన ప్రతిమలు పెద్దపల్లి జిల్లలోని నేల కొండపల్లి, నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరం ప్రాంతాల్లో లభించాయని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తెలంగాణలో రాజ్య వ్యవస్థ ఏర్పడక ముందు నుంచే బతుకమ్మను పూజించడం ఆనవాయితీగా వస్తుందని తెలిస్తోంది. క్రీ.పూ ఒకటో శతాబ్దం నాటి శాసనంలో బ్రహ్మ లిపిలో రాసిన " బతక తమ్సురో ఖచి(వి) బిరహ పథహ" అన్న అక్షరాలను బట్టి ఆనాటి నుండే పండుగ మూలాలు ఉన్నాయని తెలుస్తోంది.
బతుకమ్మ పండుగ పూర్తిగా ప్రకృతిని ఆరాధించే పండుగ. ప్రకృతి పంచభూతాల సంగమం. ప్రకృతి జీవుల మనుగడకు ఆధారం. ప్రకృతితో మనిషికి అవినాభావ సంబంధం ఉంది. నీరు సమృద్ధిగా దొరికే శరత్ ఋతువులో, వాగులు వంకలు అలుగులు పారుతూ పొంగి పొరలే సమయంలో ఈ పండుగ జరుపుకోవడం విశేషం. పంచభూతాల్లో మానవుడికి భూమితో, నీటితో కల అనుబంధానికి గుర్తుగా ప్రకృతి ప్రసాదించిన పూలను సేకరించడం, ఈ పండుగను ఆరుబయటే చేసుకోవడం చూస్తూంటాం.
మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఎనభై శాతం పైగా ప్రజలు పల్లెల్లో నివసిస్తారు. వాళ్ళు చూపించే ప్రకృతి ఆరాధనకు చిహ్నం.
బతుకమ్మ పండుగ జానపదుల పండుగ.
మొదట్లో స్వేచ్ఛగా చేసుకునే ఈ పండుగ.. పురుషాధిక్య ప్రపంచంలో ఎందరో స్త్రీలు బలై పోతూ ఉన్నారు.వారు లేని సమాజాన్ని ఊహిఃచలేమని తెలిసి కూడా వారిపై ఆగని అకృత్యాలు మనల్ని కలవరపెడుతున్నాయి. ఈ పండుగలో స్త్రీలు ఎదలోని సొదలను ఒకరికొకరు పాట, ఆట ద్వారా కలబోసుకుంటారు. ఈ బతుకమ్మ పాటల్లో సాహిత్యం చాలా బాగుంటుంది. గ్రామీణ స్త్రీలు తమ కష్ట సుఖాలు, అనుభవాలు అన్నదమ్ములు,అమ్మగారిల్లు, మమకారాలు.అత్తింట్లో ఉండే ఆచారాలు పెండ్లి పేరంటాలు,వీర మరణం పొందిన వారు, దేవతలు, చరిత్రలో జరిగిన సంఘటనలు కావేవి పాటకు అనర్హం అని అనేక రకాల పాటలు పాడుకుంటూ లయబద్దంగా పాదాలను కదుపుతూ, చేతులతో చప్పట్లు చరుస్తూ బతుకమ్మల చుట్టూ చేరి పాడుకుంటారు.
పెత్రమాస ఎంగిలి పూల బతుకమ్మ తో మొదలై సద్దుల బతుకమ్మతో తొమ్మిది రోజులు జరుపుకుంటారు. రోజుకొక నైవేద్యం పెట్టి పూజిస్తారు.
ఎంగిలి పూల బతుకమ్మ (మొదటి) రోజు పప్పు పలారంతో పాటు పెసరపప్పు పులగం వండి నైవేద్యం పెడతారు. రెండో రోజున రొట్టెలు (మలీద ముద్దలు), మూడో రోజు ముద్దపప్పు, నాల్గో రోజున నానబెట్టిన బియ్యం, ఐదో రోజు బియ్యం పిండిలో బెల్లం వేసి అట్లు చేస్తారు. ఇక ఆరో రోజు అలకల బతుకమ్మ అని బతుకమ్మ ను పేర్చరు. అర్రెం అనికూడా అంటారు. ఏడవ రోజు వేపకాయలు, ఎనిమిదో రోజు వెన్న ముద్దలు. తొమ్మిదో రోజు తొమ్మిది రకాల సద్దులు తయారు చేసే నైవేద్యం పెడతారు. ఇవన్నీ సాయంకాలం బతుకమ్మలు ఆడే ప్రదేశాలకు తీసుకుని వెళతారు. అక్కడ నీళ్ళు చల్లి మధ్యలో ఓ వెంపలి మొక్కను నాటి చెట్టుకు తాము పేర్చుకుని వచ్చిన బతుకమ్మలకు పసుపు కుంకుమ లతో పూజలు చేసి తెచ్చిన పసుపు కొద్దిగా అందరి నుంచి తీసి పెద్ద గౌరమ్మ చేస్తారు. చుట్టూ తిరిగి ఆటలు పాటలు కోలాటాలు అయ్యాక బతుకమ్మలను చెరువులు, దొరువుల్లో నిమజ్జనం చేస్తారు. పసుపు గౌరమ్మను పల్లెంలో పెట్టి పైన మరో పల్లెం కప్పి ఓలలాడించే పాట (ఆడబిడ్డకు చెప్పే సుద్దులు) పాడి పసుపు అంతా పంచుకుని, ఆ తర్వాత తెచ్చిన నైవేద్యాలు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ పంచుకుని తిని వస్తూ వస్తూ కూడా పాటలు పాడుతూ ఇల్లు చేరుకుంటారు. చివరి రోజు బతుకమ్మ పుట్టుక గురించి కథలు కూడా చెబుతారు.
ధరచోళ దేశంలో ధర్మాంగుడనే రాజుకు వందమంది పుత్రులు కలిగారు వారు శత్రువులు చేతిలో చనిపోతారు. అప్పుడు లక్ష్మీదేవిని పూజించడంతో అమ్మవారే స్వయంగా కూతురుగా జన్మించిందనీ, అందరూ ఆమెను బతుకమ్మా చల్లగా అని దీవించడంతో బతుకమ్మ అనే పేరు వచ్చిందనే కథ. అలాగే ఓ వృద్ధ దంపతులకు ఏడుగురు కొడుకుల తర్వాత ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారు. వాళ్ళు కాశికి వెళుతూ చెల్లిని జాగ్రత్తగా చూసుకొమ్మని కొడుకులు కోడళ్ళకు చెప్పి వెళతారు. చిన్న కోడలు ఈ అమ్మాయిని భర్తతో చంపిస్తుంది.. అడవిలో ఆ అమ్మాయి రక్తం చిందిన చోట పూల వనమై విస్తరిస్తుంది. తల్లిదండ్రులు తిరుగు ప్రయాణంలో ఆ తోట చూసి ఆ తోటలో పూచిన పూలు కోయబోతే మనుష్య భాషలో మాట్లాడి తమను బతుకమ్మ గా పేర్చి అత్తారింటికి పంపించమని కోరాయనీ.. అందులోనే మరో విషయం పార్వతీ పరమేశ్వరులు కైలాసం నుంచి భూమి మీదకి వస్తున్నప్పుడు పచ్చగా కనిపించే తంగేడు పూల చెట్టు కోయబోతుంటే తన అన్న చంపిన విషయం చెప్పి బాధ పడిందని అప్పుడు పార్వతి దేవి దీవించి నువ్వు చల్లగా బతుకమ్మా అని దీవించి వెళ్ళిందని.. అప్పటి నుండి ముఖ్యంగా తంగేడు పూలు మిగిలిన తీరొక్క పూలన్నీ తెచ్చి బతుకమ్మను పేర్చి ప్రతి సంవత్సరం ఆడపడుచు లాంచనాలతో పంపుతారనే కథ.. ఇలా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.
ఏది ఏమైనా ఈ పండుగ మహిళల అస్తిత్వ ప్రతీక గడీల ఆగడాలను అరికట్టడానికి ఉదయమంగా రూపెత్తిన పండుగ. ఇది పేద మధ్యతరగతి ప్రజల పండుగ. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన పండుగ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపడం చాలా సంతోషం.