Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కందేపి రాణీప్రసాద్
986610378
సాధారణంగా మనం జరుపుకునే పండుగలన్నీ చెడుపై మంచి సాధించే విజయాలకు గుర్తుగా చేసుకునేవే. 'దుష్టశిక్షణ శిష్టరక్షణ' కొరకై దేవుడు ఎత్తే అవతారాలను అంటే పౌరాణిక గాధల నుండి పుట్టుకొచ్చిన పండుగలనే జరుపుకుంటాము. ఇంకా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు కరువు కాటకాలు తాండవమాడినపుడు, అంటువ్యాధులు ప్రబలినపుడు విటిని ఆయాదేవుళ్ళ ఆగ్రహావేశాలుగా భావించి వాటికి ఉపశాంతి కొరకు పూజలు చెయ్యడం కూడా పరిపాటే. మనిషి జీవించడానికి ఆహారం ప్రధానం కాబట్టి వ్యవసాయ పనుల్లో కూడా కొన్ని పండగలు జరుపుకుంటారు. ఏ పూజలు అయినా మూల మోటో శక్తి ఆదిపరాశక్తే. ప్రాచీన కాలాల్లో మాతృస్వామ్య వ్యవస్థే కొనసాగేది. స్త్రీని ఆశ్రయించుకునే కుటుంబవ్యవస్థ నడిచేది. మనిషికి వచ్చిన చాలా కష్టాలకు ఓదార్పుగా దేవతా మూర్తులే కరుణించేవారు. అందరూ శక్తిమాత రూపాలే. గ్రామాల్లోకి అంటువ్యాధులు రాకుండా ఉండాలని ఊరి పొలిమేరల్లోనే మైసమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, పోచమ్మ వంటి దేవతలను గ్రామీణులు ప్రతిష్టించి పూజలు చేసేవాళ్ళు. అలాగే పుట్టిన పిల్లలు మరణించకుండా చల్లగా బతుకు సాగించాలనీ 'బతుకమ్మ' అనే దేవతను సృష్టించుకున్నారు భానపదులు. ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో మమేకమే తమ జీవితం ప్రకృతిలోనే సాగిస్తున్న పల్లె ప్రజలు, ఆ ప్రకృతిలోని పువ్వులతోనే ఒక పండుగను రూపొందించుకొని ఆనందిస్తున్నారు. ప్రకృతిలో దొరికే రకరకాల పువ్వులతోనే బతుకమ్మ పూజింపబడుతుంది.
బతుకమ్మను పండగ అని అంటున్నప్పటికీ ఇది కూడా ఒక నోములాంటిదే. నోములలో వాయనాలిచ్చినట్లు ఈ పండుగలో కూడా వాయనాలిస్తారు. పూల మధ్యలో గౌరమ్మను పెట్టి కాంతలంతా ''నూటొక్క పూవుల కోటి నోముల నోమి'' అన్నట్లుగా గౌరీమాతకు మంగళం పాడుతూ ఉండటంతో ఇదీ నోము వంటిదని అర్థమవుతున్నది.
'శ్రీ గౌరి నీపూజ ఉయ్యాలో
చిత్తదుందున దలుతు ఉయ్యాలో
అంబికా నీకిదే ఉయ్యాలో
అర్ఘ్యంబిచ్చెద ఉయ్యాలో'
- అంటూ పాడే పాటలో తమ నోముకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గౌరీదేవి కరుణ చూపాలని ఆశిస్తారు.
'ఒక్క్కొ పూవేసి చందమామ
ఒక్కజాము ఆమె చందమామ
శివుడింక రాదాయె చందమామ
శివుని పూజావేళాయే చందమామ'
- అంటూ బతుకమ్మపై పేర్చగా మిగిలిన విడి పూలను చల్లుతూ శివ పార్వతుల పాటలే ఎక్కువగా పాడినప్పటికీ ''రామ రామ ఉయ్యాలో శ్రీ రామ రామ ఉయ్యాలో''! అంటూ సీతారాములను కూడా ప్రార్థిస్తూ పాటలు పాడుతారు. గౌరీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిశక్తియే అని నమ్మిన జానపదుల ఆమెనే పరాశక్తిగా పూజించారు.
''శ్రీలక్ష్మి నీ మహిమతా గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
భారతీ సతివయ్యు బ్రహ్మకిల్లాలివై''
- అంటూ ఆమెను కీర్తించారు.
మామూలు పండగలలో వాసన లేని పూవులను దేవుని పూజకు ఉపయోగించరు. కానీ ఈ బతుకమ్మ పండుగలో ప్రకృతిలో లభించే ప్రతి పువ్వునూ దేవుని పూజలో వాడతారు. తంగేడు, గోరంట, గన్నేరు, పొగడ, రుద్రాక్ష వంటి అతిసాధారణ పూలను సైతం పండుగలో అలంకరిస్తారు. ఏ మాత్రం పోషణ లేకపోయినా ఎక్కడ పడితే అక్కడ పెరిగే ఇలాంటి చెట్ల పూలను పూజకు ఉపయోగించడాన్ని 'ప్రకృతి పూజ'గా అభివర్ణించవచ్చు. గ్రామీణులు ప్రకృతిలో పుట్టి పెరిగినవారు కాబట్టి వారు అన్ని రకాల పూవులను సమాన దృష్టితో చూస్తారు. బతుకమ్మలను నీళ్ళలో వదిలిన తర్వాత స్త్రీలు ముత్తైదువలకు పసుపుకుంకుమ, పూలుపండ్లు, రవికలగుడ్డలు వంటివి ఇతర స్త్రీలకు పంచుతారు. ఇలా అందరూ తమ తమ ప్రసాదాలను ఒకరికొకరు పంచుకుంటూ మనుషుల మధ్య అనుబంధాలను పదిల పరచుకుంటూ ఆనందంగా జీవిస్తారు. సమిష్టి కుటుంబాలు మాయమై చిన్న కుటుంబాలవైపు మొగ్గు చూపుతున్న వారందరికీ ఇలాంటి పండుగల వల్లనే తమ బంధువులనూ పుట్టింటి వారినీ కలుసుకోవటానికి సమయం దొరుకుతుంది. ప్రతినిత్యం పనులతో సతమతమయ్యే మహిళా శ్రామికులకు ఈ పండుగ ఉన్న వారంరోజులూ నిజంగా సంబరమే. మహిళా శ్రామికులే కాదు ఆర్థిక సమానత్వం కోసం పోరాడే ఉన్నతోద్యోగులకూ బతుకమ్మ వంటి పండుగలు కాస్తంత ఆటవిడుపును కలిగిస్తాయనటంలో ఎటువంటి సందేహమూలేదు.
దుస్తులు నగల మీద సహజంగానే స్త్రీలకు మక్కువ ఎక్కువ. ఇలా వారి ఇష్టాన్ని దేవతలకూ ఆపాదించి గౌరీదేవి పట్టువస్త్రాలలో శోభాయమానంగా కాంతులు వెదజల్లుతుందని చెపుతారు. అంతేకాక ఆమె సౌందర్యాన్ని వర్ణించడానికి, శక్తి శౌర్యాలను తెలపడానికి మానవ మాత్రులకే కాదు ఇంద్రాది దేవతల తరం కూడా కాదని చెప్పడంలో ప్రజలకు అమ్మవారి మీదనున్న భక్తి ఎంతో మనకు అర్థమవుతున్నది. గౌరీదేవి పలువరసను దానిమ్మగింజులుగా పెదవులను మంకెన పువ్వులతోనూ వర్ణించారు.
''నల్ల వరి బియ్యమా - దుల్లెమొగ్గలో లేక
తెల్ల వజ్రంబులా - ముల్లోకములు ఏలె
తల్లి నీదంతంబుతా గౌరమ్మ దానిమ్మ బీజంబుతా''
గౌరీదేవిని ఇలా వర్ణన చేస్తూ పానకాలు, పోళీలు, పాలమిగడ, అట్లు, జున్ను చక్కెర గరిజెలు, సెటెలు, మడుగుపువ్వలు మొదలైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తామని చెప్పతారు. గ్రామీణులు తమకు అందుబాటులో ఉన్న తమకు తెలిసిన ఆహారాలను దేవికి నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు.
''రుద్రాక్ష చెట్లల్ల ఆట చిలకల్లార పాట చిలకల్లార
కలికి చిలకల్లార కొలికి చిలకల్లార కుదువ్వ గువ్వలు
నీ నోము నీకిత్తునే గౌరమ్మ నా నోముఫలిమివ్వవే"
-అంటూ స్త్రీలు పాటలు పాడుతూ గౌరీని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఇలా పాటలు పాడిన వారికి విన్నవారికీ కూడా గౌరమ్మ అత్యంత శుభాలనిస్తుందని వారి నమ్మకం. అంతేకాక పల్లకీలను, గుర్రాలను, ఏనుగులనీ ఇస్తుందని భావిస్తారు. ఈ పండుగ సమయంలో మెట్ట పంటలన్నీ పండి ఇంటికి చేరతాయి. జొన్నలు, వడ్లు వంటి ఆహార ధాన్యాలు ఇంటినిండా చేరినపుడు సంతోషంతో ప్రకృతిని పూజించే పండుగ ఇదని చెప్పవచ్చు. పంటలు చక్కగా పండి ఇంటికి ధాన్య సంపద రావడానికి కారణం ప్రకృతి కరుణే కారణం. కాబట్టి సంపద ఉన్నచోట లక్ష్మి కొలువుంటుందని ప్రజల విశ్వాసం. ఋతువు మారడం వల్ల వచ్చే పండుగా బతుకమ్మ పండుగను భావిస్తారు.
''పన్నీరు అత్తరు పచ్చిగంధంబును
పరిమళంబుల బుక్క, బాగైన కస్తూరి
పసుపు కుంకుమ గుప్పుచూ
పాటలెన్నో పండుచూ''
- అంటూ గౌరమ్మను పూజిస్తామని ఇలాంటి పాటల ద్వారా తమ మనసులోని భావాలను తెలుపుతారు. ప్రతిఇంటిలోని స్త్రీలు వారి వారి ఊళ్ళలోని చెరువులకు నదులకూ వెళ్ళి సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకుంటారు. ఎంతటి బీదసాదలయినా ఈ పండుగకు కొత్త బట్టలు కుట్టించుకుంటారు. తమ ఆడపిల్లలను ఇంటికి తీసుకువచ్చి వారికి చీరసారెలు, బహుమతులు, మంచి పిండివంటలు ఇస్తారు. అందరూ కలసి ఉత్సావాతంగా జరుపుకునే ఈ సందర్భాన్ని కూడా పాట రూపంలో మలిచారు. ప్రజలు తమ దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలనూ దేవుళ్ళనూ ఆయా ప్రాంతాల విశేషాలనూ పాటల్లో చేర్చి పాడుకుంటారు.
'' బండీకి దగ్గట్టు కోడెలమరించి
కోడెలకు దగ్గట్టు గొలుసులదురించి
గొలుసులకు దగ్గట్టు గజ్జెలమరించి
ఆ బండి బాయెనే భద్రాద్రి దనుక
భద్రాద్రి రాములూ పండోయి పండ్లు
చూచెవారె గానీ కొనేవారె లేరు''
ఆడపిల్లకు పెళ్ళి చేసి అత్తవారింటికి సాగనంపేటప్పుడు తల్లి ఎంతో హితబోధ చేస్తుంది. అత్తవారింట సహనంతో అందరి మెప్పుపొందాలనీ, లేదంటే కుటుంబంతో కలతలు వస్తాయనీ చెప్తారు. పతిభక్తియే పచ్చల పతకమనీ, అత్తమామల ఆదరణే అందెలుగజ్జెలనీ, కులాభిమానమే బలాకీ సొమ్ములనీ, వంశాభిమానమే, వజ్రాల సొమ్ములనీ, కష్టాలే కంకణాలనీ, చుట్టాల బాగోగులే పట్టా గొలుసులనీ, దేశాభిమానమే కాసుల దండలనీ పాటల రూపంలో ఆడపిల్లలకు అత్తవారింటి ఎలా మెలగాలో నేర్పిస్తారు. బతుకమ్మ తన సోదరుని భార్య ఘాతుకానికి బలైనప్పటికీ ఈ పండుగ సందర్భంగా పాడే పాటలతో అమ్మాయి అణగి మణగి ఉండాలనే బోధిస్తారు.
స్త్రీల మాతృత్వానికి సంబంధించిన పాటలు కూడా ఈ పండుగలో ఉన్నాయి. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన ఆహార నియమాలు సైతం వర్ణించారు. వారికి ఏ శాస్త్ర విజ్ఞానం లేకపోయినప్పటికీ తమ అనుభవాలతోనే ఆహార పదార్థాల విలువను గ్రహించారు.
ఒకటో మాసం నెల తన గర్భిణి
జీనగాయ గోరే చెలియా
రెండో మాసం నెల తన గర్భిణి
రేగుబండ్లు గోరే చెలియా''
ప్రస్తు సమాజంలో ఆడపిల్లను బతకనివ్వడం లేదు. బతుకమ్మ పండుగ ద్వారా ఆడపిల్లలు బతికి బట్టకట్టి మరికొంతమందికి బతుకునివ్వాలని ఆశిద్దాం. నియోనేటలో మోర్పాలిటీ రేట్ ప్రకారం ప్రతి వెయ్యి మంది పుట్టిన బిడ్డలతో 29 మంది చనిపోతున్నారు అనేక కారణాల వల్ల. అందులో ఆడపిల్లలే ఎక్కువ నిరాదరణ హత్యలకు గురవుతున్నారు. భూమ్మిదకు రాకుండానే ఇంకా ఎందరో భ్రూణ హత్యలకు గురవుతున్నారు. ఆడపిల్లలనే నిర్లక్ష్యం నిరాదరణలకు గురవడంతో పాటు అనేక అసమానతలను అనుభవిస్తున్నారు. ఈ పండుగ సందర్భంగా ఇక నుంచీ ఇలాంటివి దూరమవ్వాలని భావిద్దాం. బతుకమ్మను ప్రార్ధిద్దాం.
ఆడపిల్లను బతకనివ్వండి - అందరికీ బతుకు నిస్తుంది.