Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భానుడి తొలికిరణాలకు ముందు
వనితలందరు కూడి
ముద్దు ముచ్చటల తోటి
పూల సజ్జలు నింపి
భక్తి శ్రద్ధలు కలగలిపి
నిలిపినారు తల్లి బతుకమ్మను
బతుకమ్మ అనిన
నూరేళ్ళ బతుకునిచ్చునని
సకల సౌభాగ్యములొసగునని
కలిమి బలిమిలనిచ్చు
కల్పవల్లియని
పొంగారు సంబరముల
బంగారు బతుకునిచ్చు
బతుకమ్మ తల్లి మనసు బంగారమని
నదులు, చెరువుల చెంత
పొలాల్లో, ఇళ్ళ వాకిళ్ళలో
ఇంతిలందరు జేరి
ముదముతో పాడిరి
కడు ముచ్చటైన పాటలు..
సద్దుల బతుకమ్మ
మురి'పాలవెల్లియ'ని
కాళ్ళుచేతులు కలిపి చూపిరి నృత్యభంగిమలు
తంగేడు, రుద్రాక్ష, గోరింట, గునుగు,
చెంగల్వ, చేమంతి, బంగారు రంగు బంతి, బొండు పూలతో
బతుకమ్మను
సింగారించి మురిసితిరి
బొడ్డెమ్మని చూసి
ముగ్ధమోహనంతో..
ఆయురారోగ్యములను,
అష్టైశ్వర్యములను,
పసుపు కుంకుమలతో
సిరిసంపదలనిచ్చి
సల్లంగ చూడమని
నియమముతో పూజించి
వేడుకొనిరి పడతులు
పసుపు గౌరమ్మని..
పేద సాదలను
బేధ భావము లేక
ఐకమత్యముతో కూడి
పేర్చిరందరు పూలు..
భోగభాగ్యములు కన్నా
కలిసి ఉండుట మేలని
కూర్చి ఇచ్చిరి మగువలు
శాంతి సందేశము..
ఇది తెలంగాణ సంప్రదాయ పర్వం!
సమైఖ్య కుటుంబానికి నిలువెత్తు నిదర్శనం!!
---సుజాత. పి.వి. ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.
7780153709