Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది శక్తివి నీవు
అఖిల జగతిని యేలు
నవదుర్గ మాతల్లివి నీవమ్మా
మమ్మేలు జనని మహిమలే జూపవమ్మ ''మహిమ''
కొండ కోనలాయందు
గిరులు ధరులాయందు
చెట్టుపుట్టా గుట్ట నీవు
శైలపుత్రీ రావమ్మా శరణమ్ము లీయమ్మా ''శరణ''
భక్తి ముక్తివి నీవు
శక్తియుక్తివి నీవు
భవము శివము నీవు
బ్రహ్మచారిణీవై భ్రమలుబాప రావమ్మా ''భ్రమ''
చంద్ర బింభము నీవు
సుగుణ సుందరం నీవు
నెలవంక తారలు నీవమ్మా
చంద్రఘంటా దేవి చల్లంగ జూడరావమ్మా ''చల్లంగ''
భువన భాండము నీవు
నీతి నియమమూ నీవు
కౄరహరిణి కువలయేషిణి రావమ్మా
కూష్మాండ రూపిణీ కుశలంబు లీవమ్మా ''కుశ''
అంద ఛందమూ నీవు
కనక కౌమారము నీవు
ఆనంద సౌభాగ్యము నీవమ్మా
స్కంధమాతా నీవు సద్గుణాలొసగరావమ్మా ''ఆది''
కష్ట సుఖమూ నీవు
దుఃఖ దురితమున నీవు
కాల కల్పము కర్మమూ నీవమ్మా
కాత్యాయినీ మాత కరుణించ రావమ్మ ''కరు''
పగలు రాత్రులు నీవు
నింగి నేలవు నీవు
నిత్యముగ సత్యమై వెలుగంగ
కాళరాత్రి నీవు కాపాడగా రావమ్మా ''కాపా''
జలములోనా నీవు
జఢములోనా నీవు
శుభ మంగళము నీవమ్మా
మహాగౌరి మాయమ్మ మా యింటనిలువమ్మ ''మా''
పాడిపంటలు నీవు
పసిడి రాసులు నీవు
విధివి నీవు వినయ విద్యల నిధివి నీవు
సిద్దిధాత్రి స్థిరము నీవు సిరులిచ్చి బ్రోవరావమ్మా ''సిరు''
అణువణువున అవనిలోన
ప్రకృతీ మాత పరమాత్మ రూపిణి
ఇష్టముగ గొలువ ఇలవేల్పు నీవు
బంగారు మాతల్లి బతుకమ్మ రావమ్మ
సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట