Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్
చెన్నై
9445360139
మన భారతదేశం గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఈ సాంప్రదాయాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ,ఒక్కో ప్రత్యేకత తో ఉంటాయి. ఈ సంస్కృతి, సాంప్రదాయాలు, ఒక తరం నుండి ఇంకో తరం వారికి వారసత్వంగా వస్తాయి. ఇలా ఒక్కో తరం వారికి చేరడం వలన సంస్కృతి, సాంప్రదాయాలు బ్రతికి ,భవిష్యత్ తరాలవారికి వారధిగా నిలిచి అందరికి మన గొప్ప సాంప్రదాయం తెలిసేట్టుచేస్తుంది. తెలంగాణ ప్రాంతంలో మాత్రమే జరుపుకునే అతిముఖ్యమైన పండుగ బతుకమ్మ. మహిళలు,చిన్న పిల్లలు, ఎంతో ఆసక్తిగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ ఇది. ఈ బతుకమ్మ పండుగ గురించి అనేక కథలు ప్రచారం లో ఉన్నాయి.
ముందుగా చారిత్రక పరంగా ఈ బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుందాం.
తెలంగాణా ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పాలించారు.వారిదగ్గర వేములవాడ చాళుక్యులు సామంతులుగా వుండేవారు.క్రీ.శ.973 సం. లో ఈ చాళుక్య రాజైన 'తైలపాడు' రాష్ట్రకూటులలో చివరి రాజైన 'కర్కుడిని' చంపి కళ్యాణ చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. క్రీ.శ 997 సం. లో తైలపాడు చనిపోవడంతో అతని కుమారుడు 'సత్యస్రాయుడు' రాజ్యాధికారాన్ని చేపట్టారు. ఆ సమయంలో వేములవాడలో ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో కొలువైన 'రాజరాజేశ్వరి' అమ్మవారు ఆపదలో ఉన్నవారికి అండ దండ గా ఉండేదనిదని అప్పటి ప్రజల నమ్మకం. ప్రజలే కాదు చోళ రాజు 'పరాంతక సుందర చోళ' కూడా రాష్ట్ర కూటుల నుండి ఆపద వున్నప్పుడు రాజరాజేశ్వరి అమ్మ వారికి భక్తుడిగా మారాడు. ఆ అమ్మ వారే తనను రక్షించింది అని నమ్మి అతని కుమారుడికి 'రాజ రాజ' అని పేరు పెట్టాడు. అతనే క్రీ.శ.985 నుండి క్రీ.శ 1014 వరకు ఆ రాజ్యాన్ని పాలించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది.
రాజరాజ కుమారుడు 'రాజేంద్ర చోళ' సేనాపతిగా ఉండి , చాళుక్య రాజైన సత్యస్రాయుడిని ఓడించి విజయం సాధించారు. ఆ విజయానికి గుర్తుగా ఆ రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చి వేసి అందులో ఉన్న శివ లింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. ఆ శివలింగం కోసం 1006 సం. లో ఒక ఆలయనిర్మాణం చేపట్టారు. రాజరాజ చోళ క్రీ.శ.1010 సం. లో ఆ అలయనిర్మాణం పూర్తి చేసి, భారీగా ఉన్న ఆ శివలింగాన్ని ఆ ఆలయంలో ప్రతిష్టించాడు. ఆ ఆలయమే ప్రఖ్యాతిగాంచిన 'బృహదీశ్వరాలయం'. ఈ సమాచారం శాసనాల ద్వారా చోళ రాజులు తెలియబరచారు. ప్రస్తుతం వేములవాడ లోని ఉన్న భీమేశ్వరాలయ శివలింగానికి తంజావూరు లోని బృహదీశ్వరాలయం లోని శివలింగానికి మధ్య సారూప్యత కనిపిస్తుంది. వేములవాడ లోని శివలింగాన్ని పార్వతీదేవి నుండి వేరుచేసి తంజావూరు కి తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు బాధ పడింది. బృహదమ్మ (పార్వతీదేవి) నుండి శివలింగాన్ని వేరు చేసినందుకు తమ దుఃఖాన్ని చోళులకు తెలియచేయడానికి మేరు పర్వతం లాగా పూలను పేర్చి బతుకమ్మ ను చేయడం మొదలు పెట్టారని తెలంగాణ వాసులు చారిత్రక ఆధారాలతో విశ్వసిస్తున్నారు. బృహదమ్మ పేరు నుండి ఈ బతుకమ్మ అనే పేరు పుట్టిందని ఇక్కడి వారి విశ్వాసం. అలా తెలంగాణా మహిళలు ప్రతిసంవత్సరం బతుకమ్మను పేర్చి 9 రోజులు ఈ బతుకమ్మ పండుగ ఆనవాయితీగా చేయడం మొదలుపెట్టారు అంటారు.దాదాపు 1000 సం పైనుండి ఈ పండగను ప్రతి సంవత్సరం ఘనంగా ఈ తెలంగాణా మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో మాత్రమే జరుపుకునే అతి ముఖ్యమైన ఈ పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగ తెలంగాణ ప్రజలందరికీ ప్రీతిపాత్రమైనది. భగవంతుణ్ణి పూలతో పూజించటం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆనవాయితీ. అయితే,పూలనే గౌరీదేవిగా భావించి పూజించటం ఈ ప్రాంతవాసుల ప్రత్యేకత. మహిళల మధ్య, కుటుంబాల మధ్య, ప్రేమానురాగాలను పెంచి సమాజంలో ఐకమత్యం పెంచే అద్భుతమైన పండుగ ఈ బతుకమ్మ.
బతుకమ్మ పండుగను పెత్రమావాస్య (భాద్రపద బహుళ అమావాస్య) నుండి తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఆశ్వయుజ శుక్ల అష్టమి అనగా, దుర్గాష్టమి నాడు అత్యంత వైభవంగా పుట్టింటి నుండి అత్తగారింటికి బతుకమ్మను పంపిస్తున్నట్టు భావించి స్త్రీలంతా కలిసి దగ్గరలోని చెరువులో అయినా, కొలనులో అయినా ఓలలాడిస్తారు. నీటిలోవదులుతారు.
బతుకమ్మ పండగకు సంబంధించి ప్రచారంలో ఉన్న ఒక కథ:-
పూర్వము చోళ దేశములో ధర్మాంగుడు అనే రాజు వుండేవారు. అతని భార్య సత్యవతి. వారు సంతానం కోసం నూరు నోములు నోముకుని నూరు మందిని కంటారు. వారు అత్యంత శూరులైనా కూడా శత్రువుల చేతిలో చనిపోతారు. ఆ బాధతో రాజు,రాణి రాజ్యం వదిలిపెట్టి వనములో నివసిస్తూ లక్ష్మీ దేవి గురించి ఘోర తపస్సు చేస్తారు. ఆ లక్ష్మీ దేవి వీరి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం అయి ఏ వరం కావాలో తెలుపండి అంటుంది. అప్పుడు రాణి సత్యవతి లక్ష్మీ దేవితో నువ్వే నాకు కుతురిలా నా కడుపున పుట్టాలి అని కోరుతోంది. అందుకు లక్ష్మీ దేవి సంతోషం చెంది తథాస్తు అని ఆ రాణి కి కూతురిలా పుడుతుంది లక్ష్మీ దేవి. ఆ సమయంలో మునులు, ఋషులు, అత్రి, వశిష్ఠ మహ ఋషులు కూడా వచ్చి ఆ లక్ష్మీ దేవికి బ్రతుకడానికి వచ్చినది కనుక 'బతుకమ్మ' అని పేరు పేరు పెడతారు. ఆ రాజు రాణి ధన్యులుగా భావించి సంతోషముగా వారి రాజ్యానికి వెళ్ళి చక్కగా రాజ్యపాలన చేస్తాడు. కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు 'చక్రాంగుడు' అనే పేరు తో రాజు వేశములో ఈ రాజు ఇంటికి వచ్చి, వారి పుత్రికైనా లక్ష్మీ దేవిని వివాహం చేసుకుని ఇల్లరికంగా ఉంటాడు. వారు పిల్లా పాపలతో, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో ఉంటారు. రాజ్యం సకల సౌకర్యాలు, అష్టైశ్వర్యాలతో సుభీష్టంగా ఉంటుంది. రాజు, రాణి, బతుకమ్మ రూపంలో లక్ష్మీదేవి, విష్ణువు రూపంలోని చక్రాంగుడు పిల్లా పాపలతో సిరిసంపదలతో సంతోషంగా ఉంటారు.
అలా ఈ జగతిలో శాశ్వతంగా ఆ లక్ష్మీ దేవి బతుకమ్మగా ప్రతి సంవత్సరం వచ్చి తొమ్మిది రోజులు పుట్టింటికి వచ్చినట్టు వచ్చి, ప్రజల మధ్య ఉండి అందరికి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు కలిగించి చివరి రోజు అత్తవారింటికి వెళ్తున్నట్టుగా ఆ పూలబతుకమ్మను నీటిలో సాగనంపి, మళ్ళీ ఏడు రావాలని ఆ గౌరిదేవిలా, లక్ష్మీ దేవి రూపంలో ఉన్న బతుకమ్మను మహిళలంతా వేడుకుంటారు. ఈ పండుగలో పూలకెంత ప్రధాన్యముందో పాటలకీ అంతే ప్రాధాన్యముంది. బతుకమ్మ పాటలన్నీ ఎప్పుడో పూర్వకాలంలో అజ్ఞాత మహిళలు ఆశువుగా అల్లినవే. సరళమైన భాషతో, రాగయుక్తమైన శైలిలో బతుకు చిత్రాన్నిఆవిష్కరించే అందమైన పాటలివి. వీటిలోని సాహిత్యవిలువలు అమూల్యమైనవి. ఎంతో సులువైన పదాలతో అందరూ పడుకునేట్టు ఉంటాయి.
జానపద,పురాణేతిహాస, చారిత్రక ఘట్టాలతోపాటు సున్నితమైన మానవ సంబంధాలు పాటలలో ప్రధాన వస్తువులు.
బతుకమ్మ పండుగ వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి అంతా పూల వనంలా అందంగా కనిపిస్తూ కనువిందు చేస్తుంది. రకరకాల, రంగురంగుల పూలు విరబూస్తాయి. ఈ కాలంలో ప్రకృతిలో లభించే అడవిపూలనే ఎంచుకొని బతుకమ్మను పేర్చుతారు. తంగేడు, గునుగు, కట్ల, గోరంట, గుమ్మడి, రుద్రాక్ష, మందార, గన్నేరు, సీతజడల పూలు మొదలైనవాటితో ఎంతో ఆకర్షణీయంగా బతుకమ్మను తీర్చిదిద్దుతారు.
ఔషధ గుణాలున్న ఈపూలను వాడటం వలన వర్షాకాలంలో వచ్చే జలుబు, జ్వరాలను నివారించుకోవచ్చు. పూర్వం ప్రతి ఊరిలో చెరువులు తటాకలు ఉండేవి. ఆ నీరే ఊరివారంతా తాగేవారు.ఈ బతుకమ్మ ఆడిన తర్వాత ఔషధ విలువలున్న బతుకమ్మలను ఆ నీటిలో వదలడంతో ఆ నీరు తాగిన వారికి ఆ వర్షాకాలం లో వచ్చే జలుబు, జ్వరాలు లాంటివి తగ్గిపోయేవి.ఎన్నో జబ్బులు నివారించడంలో తంగేడు వంటి అడవిపూలు మంచి ఔషధంలాగా పనిచేస్తాయి. ఆధునిక వైద్యులు కూడా ఈవిషయాలను ఒప్పుకుంటున్నారు.
ఇక నైవేద్యాల విషయానికొస్తే... ఈ తొమ్మిది రోజులూ ఆరోగ్యాన్ని ప్రసాదించే ధాన్యాలనే నైవేద్యాలలో ఉపయోగిస్తారు. రోజుకొక రకమైన పులిహోర, చివరి రోజైన సద్దుల బతుకమ్మ రోజు తొమ్మిది రకాల సద్దులు(పులిహోరలు) చేస్తారు. చింతపండు, నువ్వులు, కొబ్బరి, పల్లీలు, పెసరపొడి, ఆవపొడి, దద్దోజనం (పెరుగన్నం),బెల్లం అన్నం, నిమ్మకాయ, మామిడికాయ... ఇలా అందుబాటులో ఉన్నవాటితో చేస్తారు. సద్దుల బతుకమ్మను తీసుకొని చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రసాదంగా నువ్వులపొడి, పల్లీలపొడి, కొబ్బరిపొడి, నెయ్యి కలిపిన సత్తుపిండి, తులసీదళాలు మొదలైనవి నైవేద్యంగా తీసుకెళ్తారు. వర్షాకాలంలో శరీరానికి వేడి కలగాలని నువ్వులు, పల్లీలుమొదలైనవి బెల్లంతో కలిపి నైవేద్యం చేస్తారు. దీని ద్వారా ఐరన్, ప్రోటీన్లు లభించి ఆరోగ్యంగా ఉంటారు అందరూ. అందుకే ఈపండుగ ఆరోగ్య ప్రదాయిని అని కూడా చెప్పుకోవచ్చు.
కొన్ని పాటల పరిశీలన
బతుకమ్మకు పాడే పాటలు జీవితంలోని ఎన్నో రకాల కోణాలను తెలియజేస్తూ మంచి విషయాలు చెప్పేవిగా ఉంటాయి. అటువంటి కొన్ని పాటలను పరిశీలిద్దాం. బతుకమ్మ పండుగ తెలిసిన ప్రతీ ఆడపడుచుకు తెలిసే పాట ఇది...
ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ
ఏమేమి కాయప్పునే గౌరమ్మ
తంగేడు పువ్వప్పునే గౌరమ్మ
తంగేడు కాయప్పునే గౌరమ్మ
తంగేడు పువ్వుతోని ఆడెవారెవ్వరో పాడెవారెవ్వరో
అందాన పుట్టినా బంగారు బాలలు
నెలకొన్న నెలరాజులే గౌరమ్మ
ఎప్పటికి వైభోగమే గౌరమ్మ
ఇంకేమి పువ్వప్పునే గౌరమ్మ
ఇంకేమి కాయప్పునే గౌరమ్మ
ఇలా గుమ్మడి, గునుగు, గోరంట, కట్ల, మందార అంటూ రకరకాల పూలను చెప్తూ పాట పాడుతారు. దీన్ని బట్టి ఆకాలంలో దొరికే ఔషధ గుణాలున్న పూల గురించి మనకు తెలుస్తుంది.
జనకు జనకునింట్లో కోల్
సత్య జనకునింట్లో కోల్
పుట్టింది సీతమ్మ కోల్
పురుడే కోరింది కోల్
పెరిగింది సీతమ్మా కోల్ పెళ్ళి కోరింది కోల్ అంటూ సీతాకళ్యాణం పాట.
శ్రీగౌరి నీపూజ ఉయ్యాలో
చేయబూనితినమ్మ ఉయ్యాలో
కాపాడి మమ్మేలు ఉయ్యాలో
కైలాస రాణి ఉయ్యాలో అంటూ మహిళలందరూ తమ పసుపుకుంకుమలను కాపాడి, సకల సౌభాగ్యాలు ఇవ్వమని ఆ గౌరీదేవిని కోరేపాట. ఈ పాట ద్వారా స్త్రీల భక్తి తెలుస్తుంది.
గొల్లభామలమ్మా చక్కని
గోపిక స్త్రీలమ్మా చక్కని
పదహారు వేల స్త్రీలు భామలు
పడుచు కన్యలమ్మా భామలు అంటూ గోకుల కృష్ణుడు, గోపికల మధ్య రాసక్రీడల పాట. ఈ పాట ద్వారా కృష్ణ లీలలు తెలుస్తాయి.
కలవారి కోడలు కోల్
కలికి కామాక్షి కోల్
వచ్చిరి అన్నలు కోల్
వనములు దాటి కోల్ పండుగకి అన్నలు అక్కచెల్లెళ్ళని పుట్టింటికి తీసుకెళ్ళడానికి వాళ్ళ ఇంటికి వచ్చి వారి అత్తమామల అనుమతి తీసుకొని తోబుట్టువులను తమతో తీసుకెళ్ళే పాట. ఇటువంటి పాటల వల్ల కుటుంబం, సంస్కృతి, సాంప్రదాయం, బాంధవ్యాలు, బాధ్యతలు తెలుస్తాయి. చక్కటి ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను తెలిపే పాట ఇది.
ఇద్దరక్క చెల్లెల్లు ఉయ్యాలో
ఒక్కురికిచ్ఛే ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో
వచ్చన్న పోడాయే ఉయ్యాలో అంటూ ఈ బతుకమ్మ పండగ 9 రోజులు అక్క చెల్లెళ్ళను తొడబుట్టిన అన్నలు తీసుకెళ్ళి కట్నకానుకలు పెట్టి పంపించే ఆచారం మనకు తెలుస్తుంది. ఆచార వ్యవహారాలు,సాంప్రదాయం ,కుటుంబ బాంధవ్యాలు తెలుస్తాయి.
రోజు బతుకమ్మను ఓలలాడించే పాట పాడుతారు.
ఇసుకలో పుట్టిన గౌరమ్మా
ఇసుకలో పెరిగిన గౌరమ్మా
పసుపులో పుట్టిన గౌరమ్మా
పసుపులో పెరిగిన గౌరమ్మా ఇలా కుంకుమలో, పూలలో,అక్షింతలలో పుట్టిన గౌరమ్మా అంటూ అన్నింటినీ కలిపి చెప్తూ, అన్ని కులాల పేర్లు కూడా చెప్తూ పాట పాడుతారు. అంటే, అందరూ కులమతాలను వీడి, వాటికి అతీతంగా కలసికట్టుగా ఈ పండుగను స్త్రీలు, పిల్లలు కలసి చేసుకుంటారని అర్థమవుతుంది.
చివరగా బతుకమ్మను నీళ్ళలో వదిలి మళ్ళీ ఏడు రావాలని వేడుకుంటూ ఓలలాడించే పాట.
హిమవంతు నింట్లో పుట్టి
హిమవంతు నింట్లో పెరిగి
అంటూ శ్రీమహాలక్ష్మి రూపమైన బతుకమ్మను గౌరీదేవిగా భావించి పుట్టింటి నుండి అత్తవారింటికి పంపిస్తున్నట్టుగా భావిస్తూ అత్తవారింట్లో ఎలా మసలుకోవాలో తెలియజేస్తూ సాగే పాట ఇది.
అత్తమామల పట్ల బుద్ధి కలిగి వుండాలి, ఎవరితో ఎదురు తిరిగి మాటకు మాట సమాధానం ఇవ్వకూడదు, ఎక్కువగాబయట తిరుగకూడదు సాయంత్రం నిద్రపోవటం మంచిది కాదు, కాళ్ళతో భూమిని తన్నకూడదు,పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్లల ప్రవర్తన వలన తల్లిదండ్రులకు, అత్తమామలకు చెడ్డపేరు రాకుండా, కుటుంబ గౌరవమర్యాదలు కాపాడాలి అని, అసలు స్త్రీలు ఎలా మసులు కోవలో తెలియజేస్తున్నట్టుగా ఉంటుందీ పాట.
పెళ్ళైన ఆడపిల్లలు పండుగ సందర్భంగా పుట్టింటికొచ్చే ఆనవాయితీ ఉండబట్టి చిన్ననాటి స్నేహితులందరినీ
కలుసుకోవచ్చని పెళ్ళైన మహిళలంతా ఈ పండుగ కోసం ఆసక్తిగా, ఉత్సాహంగా ఎదురు చూస్తూంటారు. ప్రతి సంవత్సరం స్త్రీలు అందరూ వారి చిన్ననాటి స్నేహితులను ఈ తొమ్మిది రోజులలో ఒకసారైనా తప్పక కలుస్తారు. స్నేహానికి,ఐకమత్యానికి ప్రతిరూపం ఈ బతుకమ్మ పండుగ.
ఈ విధంగా బతుకమ్మ పండుగ భక్తిని పెంపొందించే పండుగ. అంతేకాక ఆరోగ్యాన్ని, కుటుంబబాంధవ్యాలను, ప్రకృతిని,సుఖసంతోషాలను, సంస్కృతీ సాంప్రదాయాలను,ఐకమత్యాన్ని తెలియజేసే సంపూర్ణమైన విశిష్టత కలిగిన పండుగ.