Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-తాళ్ళపల్లి శివకుమార్
మీదికొండ, ఘనపూర్ స్టేషన్
9133232326.
బతుకమ్మలోని అమ్మతనం
ఇయ్యాటి దినాన
అంగట్లో - "అత్రాస్"గా పాడె
నీసు ముక్కలయిపాయే
మందలలెక్క
మండుతున్న కొర్రాయిని
చేతి చేతి మార్చి
గుప్పెట్లో బిగించి పడితే
నోట్లో ఉండే గుస్స ఉవ్విసలాడిపాయే
అమ్మ లాంటి నిప్పు కనికను
చెరసాల దాటనియ్యకపోతే
అందరి గడపల గిన్నెల్లో
ఎసరు పెట్టీ, ఉమిగిలించేది ఎట్లా..?
చిన్న సూది బొట్టులో
సుతిల్ పోసను గుచ్చినట్లు
నాలుకని తెంపి, వచ్చే మాటను
గొంతు దాటనియ్యకపోతే ఎట్లా..?
యాధిబెట్టుకో..
కత్తీ గీసుకుంటేనే నీకు
అమ్మ మదిలో మెదులుతధా,
ప్రేమలోని కమ్మదనం దెలువని కసాయి
నీ ముందు రాలిన - కన్నీటి బొట్టంచునా
"అన్నా... వద్దు" అనే అరుపుల ఘోస
గింజుకున్నట్టు తోస్తలేదా..
నీలి చిత్రాల ముసుగులో
కామపు కోరలు పెంచినవ్
మగతనం విషం పూసుకొని
పంటి గాట్లతో, తనువున్న పశువైనవూ..
ఒక్కసారి బజార్లో తల లేపి చూడు
అన్నివైపులా నిన్ను - మొండిగా,
బుస బుసల సప్పుళ్ళతో
నీ పైకి దుంకెలా గుర్రునజూస్తున్నై
తంగేడు పువ్వు లాంటి వాళ్ళ జీవితానికి
మగాడొక గునుగు పువ్వై,
రంగులమయం గావాలే
ఆడబిడ్డల అగ్గి సెగల తాకిడి
కార్చిచ్చులవైపు ఉప్పొంగనియ్యకు
దుక్కి దున్నే నాగలి సాలుల
వరుస గమ్యాన్ని
చెల్లా చెదురు గానియ్యకు
బతుకమ్మ నడిమిట్ల
గౌరమ్మను బెట్టి కొలసినట్టు
"స్త్రీ శక్తిని" గుండెల్లో నిలబెట్టి
అపురూపంగా మనమే జూడాలే..!!