Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముత్యాల వారి సుమ
అనంతపురం, 9441362139.
నవమాసాలు అమ్మ బొజ్జలో బజ్జోని ఆసక్తిగా ఎదురు చూశాను
బిడ్డగా మారేటప్పుడు అందాల లోకాన్ని చూడాలని ఆరాట పడ్డాను
లింగ నిర్ధారణ చేసేటప్పుడు తెలిసింది నేను ఆడపిల్లనని
ఎక్కడ నన్ను చిదిమివేస్తారోనని భయపడ్డాను అమ్మ అండ దండలతో ఎదిగి ఒదిగా ఆడపిల్లనై
అప్పుడే తెలిసింది ఆడపిల్ల ఈ సమాజం లో దూది పింజేనని ,
ఆవేదనకు చిరునామా ఆమె అని
కంపచెట్లు కుప్పతొట్లు ప్లాస్టిక్ సంచులే మా నివాసాలని
నిర్భయంగా బతకలేని దుర్భర జీవితాలని
దిశ లేని వ్యథలని కంచికి చేరని కథలని దశదిశలా దశకంఠుల దాడులేనని
మా లేత శరీరాలు సజీవ కళేబరాలని
మగ బూచోళ్లు మా కోసం పొంచి ఉంటారని
పగవాడి దాడిలో రాలిపోయే పసిమొగ్గలమనీ
మా ఆర్తనాదాలకు పంచ భూతాలే మౌన సాక్షాలని
గర్భవిచ్చిత్తి కన్నా ఘోర ప్రవృత్తి నీచులదని విన్నాను
వద్దమ్మా !నన్ను తిరిగి నీ గర్భగుడిలో చేర్చుకో
మనసులేని మానవ మృగాల మధ్యకు పంపకు
నాకు నీ గర్భాశయమే ప్రశాంతమైన ఆశ్రయము
నీ వెచ్చని పొత్తిల్లే నాకు రక్షణ కవచం
దయలేక నన్ను పంపితే కరిగే కన్నీటి మేఘమై వర్షిస్తాను
కామాంధుల కర్కశ గొడ్డలిధాటికి లతనై నేలకొరిగిపోతాను
జాలి లేక నన్ను మృగాలా వాంఛలకు బలి చేయకమ్మా!
పాడులోకంలో నాకు బ్రతుకు లేదు, బలం లేదు
ఎప్పటికీ నీలోనే దాచుకో, నన్ను దూరంగా పంపకమ్మా!