Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలార్జున సత్యనారాయణ మాకే,
అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా
9110313596
ఇంకెన్నాళ్లు మౌనంగా భరించాలి..!
నాలుకలను తెగనరికిన ఉన్మాదులను..
అడ్డంగా నడిరోడ్డుపై తెగనరకకుండా..!
ఇంకెంతకాలం ఓర్పుగా సహించాలి..?
వెన్నుముకలను విరిచేసే రాబందులను..
ఎముకలన్నీ నుజ్జునుజ్జుచేయకుండా..!
ఇంకెన్నాళ్లు చీకటిలో మగ్గిపోవాలి..?
బతికుండగానే బూడిదచేసే రాక్షసులకు..
అగ్నిజ్వాలల్లో ఆహుతికై చితిపేర్చకుండా..!
ఇంకెంతకాలం నిశ్శబ్దంలో కలిసిపోవాలి..?
మానంచెరిపే వికృతచేష్టల మృగాళ్ళను..
పిడుగులైగర్జించి ప్రకృతిలో కలిపేయకుండా..!
ఈ కీచకపర్వానికి అంతంపలికేదెప్పుడు..?
స్త్రీ,పురుష అసమాన వివక్షతాధోరణి
ఈ కర్కశత్వానికి ఓ కారణంకాదా..?
అంతర్జాల ఆధునిక పోకడలమాటున
విచ్ఛిన్నమైపోతున్న కుటుంబానుబంధాలు
మగాళ్ళ మృగత్వానికీ ఓ కారణంకాదా..?
ఒక్కసారైనా గుర్తుకురావడంలేదా..?
అమ్మఒడి నేర్పిన మానవతావిలువలు..!
ఒక్కక్షణమైనా గుర్తుకురావడంలేదా..?
నీకు జన్మనిచ్చిందీ..ఒక ఆడదేనని..!
'మనిషా'ల నాలుకల్ని తెగనరికిన తలలుతెగేదెప్పుడు..?
ఈ దేశానికి స'దిశ'ను నిర్దేశించేదశ ఎప్పుడు..?
పసిమొగ్గలనుసైతం చిదిమేస్తున్న మృగాళ్లు..
"మానవీయసంస్కారం"తో మారేదెప్పుడు..?
'నిర్భయ'గా సాగిపోతున్న అకృత్యాలకు..
"మానసికపరివర్తన"తో అంతమొందించేదెప్పుడు..??