Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-శిఖా-ఆకాష్
నూజివీడు, 9381522247
అదేదో ఆధిపత్య ధర్మమేదో
నిగడదన్నినట్టు లేదూ...!
అప్
అచ్చు...మసీదేదో కూలినట్టే
ఆమె కుప్పకూలి పోయింది!
దేహమంతా పచ్చి పుండై
నాలుక తెగ్గోయబడి
మెదడు నరాలు చిట్లబడి
పక్కటెముకలు విరిచివేయబడి
ఆమె ఒక సామూహిక మానభంగమై మూర్ఛపోయింది!?
అత్యాచారం న్యాయమై
బంగారు మందిరం లా
నిటారుగా నిలబడి
తళ తళ మెరుస్తోంది!
వాళ్ళను పట్టుకోమని సిఫార్సు
చేయకండి ఎవరూ
అసలు వాడెప్పుడో తప్పించేయబడి
వుంటాడెప్పుడో...!
దొరికిన వాడెప్పుడైనా
దళితుడో..మైనారిటీయో
అయ్యేవుంటాడు!
సాక్ష్యాలెప్పుడూ
పదవీ విరమణతీర్పులకు
తారుమారవడం గొప్ప ధర్మం!
ఇప్పుడు అసలు దోషులంతా
నిర్దోషులుగానే ఋజువవుతారు.
రాజ్యాంగం మీదొట్టు
మనుషులంతా ఒకటే అనుకుందాం!
క్రూరత్వానిదే విజయమని
సర్దుకుపోదాం!
ఈ దేశంలో "భారత మాతలు",
జన్మనిచ్చిన అమ్మ దేవతలూ
ఎప్పటికీ కామ కుల కేంద్రాలేనని పాఠాలు చెప్పుకుందాం!
* * *
మనీషా చట్టమేదో తీసుకురండి
మరో మరో సారి నిర్భయంగా
అత్యాచారాలు కొనసాగించండి
హత్యలూ,మానభంగాలు
చేయువారు ధన్యులు!
వారు బహిరంగంగానే శిక్షలనుండి తప్పించబడుదురు!
* * *
ఎవరైనా ఒక కొత్తపేరు
పెడితే బాగుణ్ణు!
వాణ్ణి జంతువులతో పోల్చకండి
ఎందుకలా పదే పదే
చేయని నేరానికి జంతువుల్ని
అవమాన పరుస్తారు?
* * *
గాంధీ లు పుడతారో లేదో గానీ
గాడ్సేలు తయారుచేయబడే కాలం!
అధికార పీఠంమీద
హింస రాజై కూర్చున్నాక
అహింసను గూర్చి మాట్టాడడం
దేశద్రోహమౌతుంది!?
కాషాయం నెత్తుటేరులై
ప్రవహిస్తున్న చోట
త్రిశూలాలు శిష్నా లై
సామాజిక మానభంగాలు
రచిస్తున్న వేళ
ఓ నా రామ రాజ్యమా!
ఈ దేశంలో సీతలెప్పుడూ
అనుమానితులే!అవమానితులే!!
అత్యాచార గీతాలే!?
ఆటవిక న్యాయమేదో
వర్ధిల్లుతున్నది
మతోన్మాద పాలనేదో
విజృంభిస్తున్నది
అగ్రకులాహంకార హిందూత్వ
అధికార రాజకీయ ఉగ్రవాదమేదో విధ్వంస
రచన చేస్తున్నది.
వీర్యోత్సవాల మతరాజకీయ
ఋతుఒకటి దేశమంతా
ముసురుకున్నది!
మహా మానభంగాల పర్వమేదో
అణచివేతల మహోత్సవంగా
కొనసాగుతున్నది.
మనువాదమేదో పడగవిప్పి
గరుడ పురాణ శిక్షా స్మృతి ఏదో
కరుడుగట్టి
లక్మణుడు ముక్కు చెవులు
తెగ్గోసినట్టు
నాలుకల్గోసి,నడుములిరిచి,
మెదడు నరాలు చితగ్గొట్టి
సాక్ష్యాల్లేని పంచనామాలతో
భరతమాత పుణ్యపునీత అంటూ..చట్టాలూ,న్యాయాలూ
కొత్త "గీత"లై పుట్టుకొస్తున్నవి!
* * *
ఈ దేశమొక మగోన్మాద
మతఉగ్రవాద కామ కుల
దేశమని ఎందుకలా లోలోపల
గుసగుసలు పోతారు
నా దేశ ప్రజలారా!
ఓ నా గడపదాట ని
మహా పతివ్రతలారా!
ఇంకెన్నాళ్ళని మీ లోలో
గుడ్లనీళ్ళలా కుక్కుకుని
రోదిస్తారు?
ఎడవడానిక్కూడా స్వేచ్చలేని
దేశంలో...బిక్కచచ్చిన భయంతో...
ప్రశ్నించలేని నిస్సహాయులై
చావు గీతాలుగా మరిపోతారు?
మానభంగ కావ్యాలుగా
వర్ధిల్లుతారు?
కాస్త దుఃఖాన్ని పోటెత్తనీయండి.
మీ అసహనాన్ని దహనగీతంగా
రాయండి.
మీ మీ అవమానాల్ని,
అత్యాచారగీతాల్ని
మార్చింగ్ సాంగ్ లుగా పాడండి.
* * *
ఎవరైనా వాళ్లకు కొత్తపేరు
పెట్టండి.వాళ్ళని జంతువులతో
పోల్చకండి.
మీకు ధైర్యముంటే రాజ్యం తో
పోల్చండి!?
* * *
యిది దుఃఖం పండిన నేల
యుద్ధం కురిసే తీరుతుంది
చావే అంతిమమైనప్పుడు
వాళ్ళ అంగాల్ని
కోసేయండి,కొరికేయండి
యుద్ధమొక్కటే మన
మనుగడని చెప్పండి.