Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుమ్మ జనార్దన్
దిల్ సుఖ్ నగర్, రంగారెడ్డి జిల్లా
9440710501
తెలుసుకో తల్లీ, తెలిసి నడుచుకో చెల్లీ
మాటలతో నిన్ను సతాయిస్తే మట్టికరిపించు
దుష్టచూపు చురకత్తులైతే చూపించు ప్రతాపం
తాకవస్తే తాటతియ్యి, తోసుకొస్తే తోలుతీయ్యీ
దాడిచేస్తే దంచికొట్టు, ధైర్యలక్ష్మిగా అడుగువెయ్యి. ||తెలుసుకో తల్లీ||
అపర కాళి అవతారమెత్తు, దుర్మార్గుల చెయ్యి చిత్తు
ఆదిశక్తి స్వరూపమని నువ్వు మరువబోకమ్మా
చెరచవచ్చిన దుష్టులను నువ్వు వదలబోకమ్మా
నిను చెరచవచ్చిన దుష్టులను నువ్వు వదలబోకమ్మా. ||తెలుసుకో తల్లీ||
ఆహరహం ఎరుకతో వుండు, అప్రమత్తత వైపు మొగ్గు
స్వంతశక్తితో అడుగులేయ్యి, ఆడపులిలా సాగు ముందుకు
భయంలేని బ్రతుకువైపుకు, ఆడపులిలా సాగు ముందుకు.
సాయమందదు అన్నివేళల, నీదు ధైర్యమే నీకు రక్ష
స్వాతంత్ర్యమంటే కాదు భిక్ష, అనుభవించకూ ఇంకా శిక్ష
గీసుకో నువ్వు రక్ష రేఖ, దాటితే వెయ్ మరణశిక్ష. ||తెలుసుకో తల్లీ||
ఆడదంటే అలుసుకాదని, ఆటబొమ్మ అస్సలు కాదుని
ఆడదంటే ఆదిశక్తియని, ఆమెతోనే జీవితంయని
ఆమె కాదు తోలుబొమ్మని, ఆదరిస్తే ఆమె అమ్మని
ఆగ్రహిస్తే కాళికమ్మని, ఆమె లేక లేదు జన్మని
తెలియజెప్పు ఈ దుష్ట దుర్మార్గులకు. ||తెలుసుకో తల్లీ||
నీవే నిర్మించుకో రక్షణదరి, సాగిపో నీ కలల రహదారి
నింగి మాత్రమే నీకు హద్దు, నిన్ను నీవే నమ్మి సాగు
స్వంత భయమును విడిచిపెట్టు, స్వాభిమానానికే జైకొట్టు
నిలిచి వుంది నీకు తోడు తెలంగాణ బతుకమ్మ,
చెల్లెమ్మా, నిలిచి వుంది నీకు తోడు తెలంగాణ బతుకమ్మ. ||తెలుసుకో తల్లీ||