Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బి.కళాగోపాల్
నిజామాబాద్
9441631029
చీకటి గర్భంలో చిదిమేసిన నెత్తురు మరక
ఇంకా వెలుగు చూడకముందే ఓడిన స్వరపేటిక
ఎన్నాళ్ళ మౌనం తర్వాత ఇప్పుడిప్పుడే ప్రశ్నలు
ఎగసే ధిక్కార స్వరాలై ప్రతిధ్వనిస్తున్నాయి
ఎన్నాళ్లీ అమానుషమంటూ
ఎన్నాళ్లీ అకృత్యాలంటూ
ఎన్నాళ్లీ వికృత చేష్టలంటూ సమాజాన్ని నిగ్గదీస్తున్నాయి.
ఇంటికి దీపమంటూ..అందానికి ప్రతిరూపమంటూ
కొన్ని విశేష అర్థాలను ఆపాదించి చూసే
కామపు వికార చూపులకిక చెల్లుచీటీ పలకాలి
నవ్వేపువ్వు సాక్షిగా ఒక్కో పువ్వేసి నువ్వే చెప్పాలి బ్రతుకమ్మా
బ్రతుకంతా పచ్చగా బతకాలని దీవెనిచ్చి సాగనంపే గౌరమ్మా!
ప్రతియేటా ఇలాంటి ఘోరకలికి ఒక ఆడకూతురు బలికావల్సిందేనా??
కత్తులు నూరుతున్న కామపు దృక్కులను దునుమాడి..
వంకర చూపులు..వెకిలిచేష్టలను దగ్థం చేస్తూ..విశ్వరూపిణివై
ఇలాంటి కామాసురుల పాలిట అపరకాళివై..దుష్టశిక్షణ గావించు
వికసించే మొగ్గల సురభిళపరిమళాలను
చిదిమేసే కొన్ని గండుతుమ్మెదల నడుమ ఎదుగుతున్న యౌవనాన్ని కాపాడుకోలే
నిస్సహాయ ఆక్రందనలో బలవుతున్న ఎందరో అభాగినుల ఆర్తనాదాల సాక్షిగా
ఆడబిడ్డ ల ఉయ్యాల పండుగ అంటూ
చెయ్యెత్తి జై కొట్టే గాజుల చప్పుళ్ళే
నేడు యమపాశాలై గర్జిస్తూ
తీరొక్క పువ్వుల బ్రతుకమ్మ రాజసంలా నర్తిస్తూ
అపరకీచకుల పాలిట ఉరికంబాలవుతాయి జాగ్రత్తగ!
ఖబడ్దార్ అంటూ గులాబీ రెక్కల మార్దవాలే
నేడు గుచ్చుకునే గాజుముళ్ళై
మహిషాసురుల పీచమణుస్తాయి మహోగ్రంగా..!!