Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బి.రాణి లీలావతి
జోగులాంబ గద్వాల .8500100829
బతుకమ్మ ....బతుకు
పుట్టినింటిని మెట్టినింటిని
వెలిగించే దీపం నేడు
కసి ఊపిరులకు కొడగట్టి పోతుంది .....
ఆకాశంలో సగమని
ఓర్పులో అవనివని
జగతికి జననివని
నీకెవరు సాటికారని ,లేరని
ప్రస్తుతించిన నోళ్ళు
ప్రణమిల్లిన వారలు
యిప్పుడేరీ ? కనబడరే ?
పెడరెక్కలు విరిచిపట్టి
పక్కటెముకలు విరగగొట్టి
నాలిక కోసి పైశాచికత్వం
ప్రకోపించిన కసాయిలకు
శిక్షేమిటనే మాట వినబడదేం ?
సిగ్గుపడండి ...పరిణితి చెందిన
ప్రజాస్వామ్య దేశంలో అబలలకు
జరుగుతున్న అన్యాయాన్ని
దునుమాడలేనందుకు ....
మృగాలు సమాజంలో యథేచ్ఛగా
తిరుగాడే వ్యవస్థలో ఉన్నందుకు .....
నీతిలేని నేతలూ ...రాసుకున్న రాతలూ ..
అన్నీ నేతిబీరలో నేయి చందమే ....
తల్లీ !నీకు నీవే రక్ష ఇక్కడ
నిన్ను కాపాడే శక్తి నువ్వె నని తెలుసుకో ..
ఎదురాడు వేళ నీ పిడికిల్లె సమ్మెట లవ్వాలి ...
నీ ధైర్యమే శత్రువును దెబ్బకొట్టే ఆయుధం ...
నిస్సహాయురాలవు కాదు నువ్వు
ముష్కరులను నిర్జించే దుర్గవు కావాలి ....
శక్తి స్వరూపిణి ! నిండు నూరేళ్లు నువ్వు
బతుకమ్మ బతుకు ...ధైర్యం వహించి .....