Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ పట్టీల పాదాలొస్తే...
ప్రపంచం మొత్తం సంతోషం సంతరించుకునేది
ఆనందాలు అవనంతా అల్లుకునేవి
పాల కడవలు లాంటోళ్ళు
ఆడపిల్లల జీవనాల్లోకి..ఉప్పురాయేసా రెవరో...!
నువ్వు అందుకోలేనంత ఎత్తు తాను
నిన్ను లోకానికి పరిచయం చేసేది తానే
జీవితమంతా..వేల ప్రశ్నలతో నువ్వొస్తే
లక్షల జవాబులు తానౌతుంటుంది
పహారాలలో ఆమె కలలు.. అడుగులకు ఆంక్షల కంచెలు
పాల బుగ్గల పసిమోములూ పరిరక్షణలోనే
అకృత్యాలకు అడ్డుకట్ట వేసేలా..
ఇప్పుడా..
పువ్వులకు ప్రశ్నించడం నేర్పాలి !
నాలుకను కోసేస్తే ఫిర్యాదు లుండవనుకున్నావ్
ఎంత అజ్జానం
గాయాలు..సెల్ఫ్ ఎక్సప్లనేటరీలు
వాటికవే వాదించగలవు
తానొక్కతేనా..
స్త్రీ జాతి యావత్తూ గాయపర్చబడిందిపుడు
గాయానికి గొంతుందని తెలియదా..?
ఆమె భవితపై ఏక పక్ష నిర్ణయాలను తీసేసుకుంటూ
పద్దతుల పంజరాలలోనే తననింకా పెట్టేసి
సున్నితత్వాన్ని ఎక్కడో దారపోసుకుందీ
మానవ జాతి
అడుగడుగునా అమ్మ చెప్పిన బూచాళ్ళే
ఇప్పుడు ఆ కువకువలు తరలి పోతున్నాయ్
నిబంధనల తట్టను నెత్తిన మోస్తూ
అయినవాళ్ళ అదుపులోనే ఉన్నా
ఆగని అమానుషాలెన్నో
ఆ రెక్కల విన్యాసాలను ఆవిష్కరించుకునేందుకు
ఆమె వాటాగా
అవకాశాల ఆకాశం ఉందా ?
చితులు పేర్చి గుట్టును మట్టుబెట్టడం మినహా
ఆడబిడ్డ అస్థిత్వాన్ని బతికించే
నిక్కచ్చి నైతికత ఎక్కడుంది ?
వెలుగు చూడనివ్వని గాయాలు
వెలిబుచ్చేందుకు వెసులుబాటు లేని వెక్కిళ్లు
ఇక చాలు
కారు చీకటి కిరాతకాలలో ఆరి పోయిన వెలుగులు
నిశ్శబ్దపు రాతిరిలో గుండెలవిసే అరుపులిక చాలు
అధికార డప్పులు మ్రోగేది అందలాల పైనున్న వారికే
పరితపిస్తూ ఎంతకాలమిలా
కొత్త వెలుగులకు నాంది పలుకుతూ....
అనాదిగా ఛిద్రమౌతున్న మనః దేహాలు
కాంతివంతం చేసే స్ఫూర్తి కావాలి!
జనారణ్యంలోనే సంచరిస్తూ
సాధుచర్మాలను కప్పుకున్న మృగాల దేహాలను..
బాలికల బ్రతుకులను చిద్రం చేసే
అమానుష చేతుల్ని శిక్షించి..అదుపు చేసి..
భీతి రహిత.. సమాజాన్ని బంగారుతల్లులకు
కానుకివ్వాలి
- దారల విజయ కుమారి
9177192275
తిరుపతి