Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనశ్రీ కుడికాల జనార్ధన్
9703275050
పల్లవి:
పువ్వులనే పూజించే పావన నేల!
తెలంగాణ సాంప్రదాయ జీవన హేల!!
ప్రకృతిలో వికసించే ప్రతి పవ్వూ పువ్వు!
బతుకమ్మ మోమున కనిపించే నవ్వు!! ౹౹ పువ్వులనే ౹౹
చరణం 1:
తీరు తీరు పువ్వులతో తీర్చిదిద్దు బతుకమ్మ
ఊరు వాడ ఒక్కటై ఆడిపాడు బతుకమ్మ
కన్నెపిల్ల పడచుపిల్ల మూలనున్న ముసలమ్మ
కలిసిమెలిసి చిందులేయ కనువిందు బతుకమ్మ ౹౹ పువ్వులనే ౹౹
చరణం 2:
బంతిపూల బతుకమ్మ బతకమను బతుకమ్మ
చేమంతిపూల బతుకమ్మ చెలిమి కూర్చునమ్మ
గునుగుపూల బతుకమ్మ గుణగణాల బొమ్మ
తంగేడుపూల బతుకమ్మ తరింజేయు జన్మ ౹౹ పువ్వులనే ౹౹
చరణం 3:
పట్టుచీరగట్టి పసిడి నగలు పెట్టి
నుదుట బొట్టు పెట్టి బతుకమ్మ చేతబట్టి
తరలిపోవు తరుణులు సంధ్యావేళ
తరతరాల తెలంగాణ రంగు పూలమేళ ౹౹ పువ్వులనే ౹౹
చరణం 4:
ఏనాడూ ఇంటిగడప దాటని ప్రతి నారి
ఏడాదికి ఒక్కసారి చెరువుగట్టు దారి
ప్రతి మగువ మనసులో మమతలే ఊరి
ప్రతి పల్లె పట్టణాన ప్రతిధ్వనించు భేరి ౹౹ పువ్వులనే ౹౹
చరణం 5:
కలిమి లేమి కలగలిసిన కళయే బతుకమ్మ
కులకాంతల కేరింతల వేడుకయే బతుకమ్మ
కులాలన్ని కలిసేటి పండగే బతుకమ్మ
కలకలల కిలకిలల సందడియే బతుకమ్మ ౹౹ పువ్వులనే ౹౹