Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జె. సూజాత, జోగులాంబ గద్వాల్
యాడుంది? ఎక్కడుంది? నాకు భద్రత
నా పుట్టుకే భయంతో మొదలవుతుంది
గర్భంలో ఉన్నప్పుడు భయం భయం
ఎప్పుడు యంత్రాలతో చిదిమేస్తారని
అదృష్టం కొద్దీ భూమి మీద పడితే
పురిటి గండం ఏ రూపంలో వస్తుందోనని భయం భయం
పురిటి గండం గట్టెక్కి
ఆనందంతో బడి మెట్లెక్కాను
కానీ ఆనందం అంతలోనే ఆవిరయ్యే
ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే
అపహరిస్తారు కొందరు
బెదిరించి లొం గ దీసుకుంటారు ఇంకొందరు
యాసిడ్ పోసి ఒళ్లంతా కాల్చేస్తాడు ఒకడు
గొంతు కోసి పొడిచి చంపుతాడింకొకడు
వరకట్న తాడుతో ఉరేస్తారు కొందరు
అందుకే అడుగుతున్నాను నాకు ఏది భద్రత?
మొన్న నిర్భయ నిన్న దిశ
నేడు హత్రాస్ ఘటన
కామం నిండిన కళ్ళకు పసిబిడ్డ అయినా
అమ్మాయి అయినా పండు ముసలి అయినా
ఒక్కటే అత్యాచారం చేసి చంపేస్తారు
నిందితులకు ఏమో చట్టాలు చుట్టాలాయే
ఇవన్నీ ఏలికలకు పట్టని సమస్యలా యే
అందుకే అడుగుతున్నాను
స్త్రీని దేవతగా పూజించే దేశంలో
స్త్రీ భద్రతకు ఇంకెన్నాళ్లు కావాలి అని?
మానవత్వం గల మనుషుల్లారా ఆలోచించండి
మమ్మల్ని భద్రంగా బతకనివ్వండి
అమ్మా బతుకమ్మా
ఆడపిల్లలకు ధైర్యాన్ని ఊపిరిగా ప్రసాదించమని వేడుకుంటున్నాను.