Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కృపాకర్ మాదిగ
9948311667
భూమి లేనితనం
ఇల్లు లేనితనం
కక్కసుదొడ్డి లేనితనం
కనీస వేతనం లేనితనం
చదువు లేనితనం
అంటరానితనం
గౌరవంతో బతకలేనితనం
చావు కంటే హీనం కాదా?
కూడు లేనితనం
పోషక విలువల్లేనితనం
చిరిగిన గుడ్డ పేలికలతనం
స్వయంగౌరవ పరిరక్షణ చేసుకోలేనితనం
ఆత్మరక్షణ చేసుకోనివ్వనితనం
కూటి గురించే తప్ప
కుర్చీ గురించి ఆలోచించనివ్వనితనం
చావు కంటే హీనం కాదా?
రోగమొస్తే మందులేనితనం
మత్తు నుంచి బైటకు రానివ్వనితనం
పనిలో బందీఅయినతనం
ఒసే,ఒరేలతో గాయపడేతనం
బతుకంతా లోకువైనతనం
ఆధిపత్యాల కింద కాయం కాలిపోయేతనం
చావు కంటే హీనం కాదా?
జోగినీతనం
మాతంగితనం
మాతమ్మతనం
బసివినీతనం
లైంగిక వెట్టితనం
సిగ్గుకి తడికల్లేనితనం
చావు కంటే హీనం కాదా?
బాధతో అరిచినా వినిపించనితనం
పశువులతో జమకట్టినతనం
తలెత్తితే పొడవటం అనిపించేతనం
ఒళ్ళు విదిల్చితే ఉగ్రమనిపించేతనం
మనిషిగా చూడమంటే తృణీకరించేతనం
ప్రశ్నిస్తే పగతో రగిలేతనం
చావు కంటే హీనం కాదా?
మేము మా ప్రత్యేక బాధల గొంతులు విప్పినపుడల్లా
మీరు మీ సాధారణ సమస్యలు అడ్డం తెస్తారు!
మేము కూలీల సమస్యలు మాట్లాడినపుడల్లా,
మీరు రైతే రాజని నినదిస్తారు!
మాపై అత్యాచారాలు రద్దు కావాలని మేము
డిమాండ్ చేసినపుడల్లా,
మా నడతల్లోనే తప్పులు పుట్టించి ఎదుర్కొంటారు!
మేము మా సోషల్ జాగ్రఫీల గురించి మాట్లాడినపుడల్లా,
మీరు గూడెంనీ,తండానీ,పాలెం నీ రద్దు చేస్తారు!
ఊరంతా ఒక్కటేనని
మనుషులంతా ఒక్కటేనని లంకించుకుంటారు!
మేము మా బిడ్డల,తల్లుల దుఃఖంలో మునిగివున్నప్పుడల్లా
మీరు మా మట్టి మహిళల సమస్యలను
ఊరి మహిళల సమస్యల్లో కలిపేస్తారు!
మహిళలంతా ఒక్కటేనని దబాయిస్తారు!
ఒరే ప్రభువా!
ఒరే దొరా!
ఒరే ఆసామీ!
వామ్మా దొరసానీ!
ఎవురు మాత్రం కోరుకుంటారు ఇట్టా పుట్టాలని?
ఎవురు మాత్రం కోరుకుంటారు ఇట్టా బతకాలనీ?
ఎవురు మాత్రం కోరుకుంటారు
ఊపిర్ల పంట కోసుకునే దేశంలో
ఊపిర్లతో ఉండాలని?
బతుకు జోగు పట్టం
బాంచ పట్టం
చావు పట్టం అయిన కాడ
బతుకు పట్టమేముంటది?
బానిసత్వంతోనైనా ఇక బతికేదేముంటది?
మనీషా,మనీషా!
మా బంగారు కూనా!
వాల్మీకి తాత కన్నీటి పావురమా!
మట్టి మాతల మహా కావ్యమా!
మా దుఃఖాల కొండా!
నాలుక తెగింది, నీక్కాదమ్మా
నోళ్ళు మూసుకుపోయిన మా అందరికీ
వెన్నెముక విరిగింది నీక్కాదమ్మా
దెబ్బతిన్నది మా స్వేచ్ఛా శిఖరం
చిద్రమయ్యింది,నీ గర్భకోశం కాదమ్మా
మా ఆత్మగౌరవం
ఆరిపోయింది నువ్వు కాదమ్మా
మన అమ్మ జంబూద్వీపమ్మ
గడ్డిని గొడ్లకు వేద్దామనుకున్నవుగానీ
పెట్టాల్సింది,దొరసాన్ల బిడ్డలకేనమ్మా
కొడవలెత్తాల్సింది గడ్డిపరకల కోసం కాదమ్మా
గడ్డిమేసే మృగాళ్ల మీదకేనమ్మా
ఒకసారి నీ కొడవలి ఇయ్యమ్మా
పౌరుషం కోల్పోయిన మా సాంఘిక జడత్వాన్ని కోసేసుకుంటాం
ఒకసారి నీ లిక్కి ఇటియ్యమ్మా
గడ్డ కట్టిన మా చీమూ,నెత్తుర్లను వత్తేసుకుంటాం
బండరాళ్లమని తిట్టుకోకమ్మా
కక్కుబెట్టుకుంటున్న కొడవళ్ళమౌతాం
రెల్లివారి శబరి
మాదిగవారి ఆరంజోతి
జాంబవతీ, తలగల్ల ఎల్లమ్మ తల్లీ
పడవ నడిపే ఫూలన్ దేవి
మాతంగ కన్యలంతా మీటింగులెయ్యాలి
వాల్మీకి వనితలూ,జాంబవజాతి పుత్రికలంతా
జంగు జెయ్యాలి
దొరహంకారాలపై దండోరా వెయ్యాలి
దొరస్వామ్యాలను దునుమాడే
కొంగవాలు కత్తులై లేవాలి
( మనీషా స్మృతిలో )