Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవీందర్ కొండ ( రవీంద్ర)
హైదరాబాద్,9848408612
అర్ధరాత్రి
స్త్రీ ఒంటరిగా తిరిగినప్పుడే
నిజమైన స్వాతంత్ర్య మన్నాడు
గాంధీజీ ఆనాడు !
పట్టపగలే సమూహంగా
తిరగలేని నవ నాగరికత
సమాజంలోని దుస్థితి ఈనాడు !
రాజ్యాంగం ప్రసాదించిన
చట్టాలు -సమానత్వాలు
నీటిమీద రాతలయినవి
రెక్కలు తొడిగిన స్వేచ్ఛ గీతం
పంజరంలో రామచిలుక లా
బందీయై పోయిందీ. !
ప్రాశ్చాత్య మోహంలో పడి
అంగడి సరుకును చేసి
ఆట బొమ్మలా మార్చి..
ఆనాగరికత సంస్కృతి కి
తెరలేపింది ఈ సమాజం
హత్రాస్, దిశ, నిర్భయ..
ఇంకెందరో..
పశువాంఛ క్రీడకు బలవుతున్నా..
నాలుకలు తెగ్గోసి.. పెట్రోలు
మంటల్లో బూడిద చేస్తున్నా..
చలనం లేని మానవత్వం మరిచిన
నర రూప రాక్షసులు..
ప్రజాస్వామ్య చట్టాల
ముసుగులో తప్పించుకుంటూ
దొరలై మీసం మెలేస్తున్నారు
ఏ తప్పు చేయని అభాగ్యులు
అశ్రుధారలు కారుస్తూ..
ఆత్మ హత్యలని ముద్దు పెట్టుకుంటుంటే
ఇన్నాళ్లు..
భూదేవతంతా ఓపిక వహించింది చాలు
సముద్రమంత శాంతి మంత్రం వల్లించింది చాలు
ఇకా......మనం
సునామీలా విరుచుకుపడాలి..
భూకంపాలై దద్దరిల్లాలి..
పెను తుపానులై గర్జించాలి..
బలిసిన ఆంబోతుల్లా మెడలు వంచి
కామంతో కొవ్వెక్కిన మేకపోతులను
బలి పీఠం ఎక్కియాల్సిందే..
మహిషాసుర మర్దనం జరపాల్సిందే..
అప్పుడే..
బతుకమ్మ పూల పెదవులపై
చిరునవ్వులు హాసిస్తాయి. !
రేపటి పురిటిబిడ్డల
వెన్నెల కాంతులు
వికసిస్తాయి.. !!
అంకితం: హత్రాస్, నిర్భయ, దిశ లాంటి బాధిత ఆడబిడ్డలకు అంకితం.