Authorization
Mon March 03, 2025 05:07:16 am
- శైలజామిత్ర
9290900879
అవును
అమ్మ మళ్ళీ మరణించింది
మరో జన్మకు అమ్మ అయ్యే జన్మ
మళ్ళీ మళ్ళీ మరణిస్తూనే ఉంది
మనసుతో అనేకసార్లు, మనిషిగా ఆఖరిసారి
మరణించడం ఆమెకు అలవాటైపోయింది
పట్టెడన్నంతో ఆకలి తీరుతుంది అని అమ్మ
ఎంత చెప్పినా వినకుండా
కంచం లో అమ్మతనపు అవయవాలను
వడ్డించుకుని తిన్నాక
తట్టుకోలేని అమ్మ మరణిస్తూనే ఉంది..
మీకు తెలుసా
మనకో కొత్త భాష దొరికింది
అదే దేహ భాష
మాతృ దినోత్సవానికి అమ్మకు బహుమతేమో
అంతర్జాతీయ మహిళా దినోత్సవాలకు ఊరటమో
ఆకాశంలో సగభాగం నువ్వే అంటూ చాటిన
అబద్ధపు శాలువా కింద
అస్థిత్వాన్నే పూడ్చిపెట్టిన వారికిది సత్యమేమో
మేము మీకోసమే ఉన్నాం అనే
రక్కసి రక్షణ సూత్రాల కంటి తుడుపుల్లో
పదవుల మగత తాలూకు పెత్తనమేమో
ఏదైతేనేమి
కమ్ ఛీ కాళ్ళను మైళ్ళుగా రూపాంతరిస్తూనే
అమ్మను చిదిమేస్తున్నారు
ఇప్పుడు అమ్మ ఒక వాణిజ్య సరుకైంది
పానుపుకి, కానుపుకి మధ్య వేళ్ళాడే బొమ్మై
వంశాంకురాలకు ముద్రణాలయమై
పరాయితత్వానికి పరాకాష్టగా మారిన ఈ అమ్మ
నేడు కీచకుల బారిన పడే దారుణమైంది
తన సృష్టిని తానే శిక్షించుకునే దారిలో
ఒక మృత శిశువైంది .
తప్పించుకోలేని సమయంలో
ఆమె మరణానికే చిరునామా అయింది
అమ్మంటే మనోహర కావ్యం
అవ్వకున్నా పర్వాలేదు
నిరంతర నిశ్చల సంగీతంలా
వినిపించకున్నా బాధలేదు
కనిపించినప్పుడల్లా
అశ్రు కల్లోల సాగరంలో
ముంచకుంటే అంతే చాలు
ఆ పవిత్ర దేహాన్ని
ధ్వంసం చేయకుంటే అంతే చాలు
ఒక్క అమ్మ అమానుషంగా చనిపోవడం అంటే
నూరు ఆత్మహత్యల సంతకాల్ని మోయడం
ఆమె కన్నీటి చుక్కల్నించి రాలిన ఈ అక్షరాల
కరగని పురుష రాతి హృదయాలపై పోద్దాం
జన్మే ఇవ్వమని తేల్చి చెప్పేద్దాం ...