Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వురిమళ్ల సునంద ఖమ్మం
9441815722
మనసు మూగబోయింది
కలం కదలనంటోంది
మానవత్వపు చిరునామా
మాయమై పోతుంటే..
కళ్ళు కన్నీటి సంద్రాలవుతున్నాయి!
ఉవ్వెత్తున ఎగసిన బాధా తరంగాలు
హృదయాన్ని సునామీలా ముంచెత్తుతుంటే..
మనసు మూగబోయింది
కలం కదలనంటోంది.
అమ్మ ఒడిలో ఆదమరచి ఆడుకునే చిరుదివ్వెలు
అనుభూతుల అర్థం తెలియని
అమాయక తూనీగలు
అభం శుభం తెలియని స్వచ్చమైన వెన్నెల సోనలు..
నేడు
తోడేళ్ళ గుంపుల వేటలో బలి అవుతున్న లేడి కూనలు
మృగోన్మాదుల కామాగ్నికి
ఆహుతవుతున్న పాలనవ్వులు
కామాంధుల రాక్షస రతిలో
తగల బడుతున్న దేహ దేవాలయాలు
కాల కూట విషనాగుల దాడికి
ఛిద్రమవుతున్న గర్భగుడులు
బాల్యాన్ని చిదిమేసి
భవితను రక్త సిక్తం చేస్తున్న
భయంకర మద పిశాచులను
వికృత మనోపంకిలం నిండిన
అధములను
నీచ నికృష్ట క్షుద్రులను
ఎలా తిట్టాలో తెలియక
మనసు మూగబోయింది
కలం కదలనంటోంది..
ప్రతి రోజూ పత్రికల నిండా
పతాక స్థాయిలో అకృత్యాలు
గుండెల్ని పిండి చేసే దృశ్యాలు
మనో ధైర్యాన్ని ముక్కలు చేస్తున్న
సంఘటనల అదృశ్య ఖడ్గాలు..
బాల్యాన్ని చెరబట్టే కీచకులు
విలువలను వివస్త్ర చేస్తున్న దృతరాష్ట్ర సంతానం
రోజు రోజుకు పెరిగి
అధోముఖానికి దారి తీస్తున్న
సమాజ తీరును చూసి
మనసు మూగబోయింది
కలం కదలనంటోంది..
మనసున్న మానవతా వాదులారా రండీ!
మదోన్మాదుల మెదళ్ళకు శస్త్ర చికిత్స చేద్దాం!
కామోన్మాద నాడులను కత్తిరించేద్దాం!
పాపపు ఉన్మాదులను స్కానింగ్ కళ్ళతో పసిగడదాం!
అమానుష కృత్యాలకు
అంతిమ గీతం పాడుదాం!
అమాయక శాంతి పావురాలను
ఆనందంగా ఎగరనిద్దాం!
అందాల సీతాకోక చిలుకలను
బతుకు తోటల్లో జీవించనిద్దాం!
- వురిమళ్ల సునంద, ఖమ్మం
9441815722