Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి. ప్రజల మనిషిగా ప్రజల మధ్య జీవించి,ప్రజల కోసం బ్రతికిన వట్టి కోట ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎలా ఉండాలో ఆచరణ ద్వారా తెలిపిన ఆచరణ శీలి.
బాల్యం నుండే బతుకును పోరాటంగా మలుచుకుని, కులమతాల అడ్డుగోడలను కూల్చి అంతరాలు లేని మానవ సమాజం నిర్మించడానికి జీవితాన్ని అంకితం చేసిన మానవతా వాది.అందుకోసం ఓ వైపు ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూనే అక్షరం మనిషిని మార్చే చైతన్య కిరణమని గ్రహించి ప్రజా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన క్రియాశీల రచయిత వట్టికోట. ప్రజల జీవిత గనులను తవ్వి, వారిలోని ఉద్యమ జీవితాలను వెలికి తీసి ప్రజలకు అందించడంలో జీవితం మొత్తాన్ని వెచ్చించిన ఉద్యమ శీలి.
"ఆశ్రయింపు లెరుగని వాడు/ విశ్రాంతి తెలియని వాడు/స్వసుఖం కోరని వాడు/ వారం వారం మారని వాడు/ రంగులద్దు కోలేని వాడు/ అతనిదే సార్థకమైన జీవితం... అని ఎంతో అభిమానంతో మరెంతో గౌరవంతో దాశరథి కృష్ణమాచార్యులు తన'అగ్నిధార'ను అంకితం చేస్తూ వట్టికోట ఆళ్వారుస్వామి గారి గురించి రాస్తూ అసలు ఆళ్వారులు పన్నెండు మందే కానీ పదమూడో ఆళ్వారు మన వట్టికోట ఆళ్వారుస్వామి అని కీర్తిస్తూ అన్న మాటలివి.
జీవితమంతా తెలంగాణ ప్రజల కోసం పోరాడిన యోధుడు.ప్రజా సాహిత్యాన్ని బతికించడానికి పాదులు చేసి, ప్రాణం పోసి తెలంగాణ ప్రజా సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తెలంగాణ మట్టి బిడ్డ వట్టి కోట.రచయిత,సేవాశీలి,ఉద్యమ నేత, ప్రచురణ కర్త, పాత్రికేయులు, ప్రచారకుడు.అంతే కాకుండా
ఆయన ఓ కథకుడు, వ్యాసకర్త, నవలా రచయిత, విమర్శకుడు, ఉపన్యాసకుడు, కవి, పరిశోధకుడు,,గ్రంథాలయ నిర్వాహకుడు... ఇలా ఆయనకు అక్షరానికి అవినాభావ సంబంధం. ఆ అనుబంధం తోనే ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, అధ్యయన శీలత పెంపొందించడానికి అవిరళ కృషి చేశారు. సామాజిక అంశాలతో తను రాసిన అనేక రచనల ద్వారా,తాను నిర్వహిస్తున్న ఉద్యమాల ద్వారా ప్రజలను ఉత్తేజితులను , చైతన్య వంతులను చేసేందుకు చేసిన ప్రయత్నం కృషి ఎనలేనిది.
దేశోద్ధారక గ్రంథ మాలను స్థాపించి సమాజాన్ని పుస్తకాలు చదివించే దిశగా, పఠనాసక్తి పెంపొందించే దిశగా నడిపించిన ప్రయత్నం శ్లాఘనీయం. దానితో పాటు 35 పుస్తకాలను ప్రచురించడం.తెలంగాణ విశేషాలను ఏర్చి కూర్చి తెలంగాణ పేరుతో సంపుటాలను కూడా ప్రచురించారు. ఆ విధంగా
ప్రచురించిన వాటిని ఊరూరా అమ్మడం ద్వారా సాహిత్యాభిలాష పెంపొందించడానికి చేసిన కృషిని గమనిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఓకే వ్యక్తి ఇన్ని పనులు, కార్యక్రమాలు ఎలా నిర్వహించ గలిగాడా అనిపిస్తుంది.
అలాగని వట్టికోట ఆళ్వారుస్వామి ధనవంతుడు ఏమీ కాదు. సామాన్య కుటుంబంలో జన్మించారు. ఎన్నో ఒడిదుడుకులను,కష్ట నష్టాలను చవిచూస్తూనే స్వయం కృషితో ఎదిగారు.
జీవిత విశేషాలు
1914 నవంబర్ ఒకటిన నల్లగొండ జిల్లా మాదారం గ్రామంలో సింహాద్రమ్మా, రామచంద్ర చార్యులు దంపతులకు జన్మించారు. వీరిది నిరుపేద వైష్ణవ సాంప్రదాయ కుటుంబం.వట్టికోట గారికి చిన్న నాటనే తండ్రి చనిపోవడంతో సీతారామారావు అనే ఉపాధ్యాయుడికి సేవలు చేస్తూ విద్యను అభ్యసించారు.ఆయన ద్వారా అనేక సాహిత్య విషయాలను అవగాహన చేసుకున్నారు.
పుట్టుకతోనే పేదరికంతో పోరాడటం నేర్చుకున్న వీరు జీవనం కోసం అనేక రకాల పనులు చేశారు.వంటపని, హోటల్లో సర్వరుగా, ప్రింటింగ్ ప్రెస్ గోల్కొండ పత్రిక లో ప్రూఫ్ రీడర్ గా ..ఇలా దొరికిన పనులెన్నో చేశారు. ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రతి పని నుండి అతడు పొందిన అనుభవాలే ఆయన్ను ప్రజల మనిషి గా,బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలబెట్టాయి.అంచెలంచెలుగా నాయకుడిగా ఎదిగేందుకు దోహదపడ్డాయి.
వారి సాహిత్యాన్ని విశ్లేషించి చూస్తే జనం నుండి జనంలోకి సాహిత్యమని నమ్మిన వ్యక్తిగా కనిపిస్తారు.
వీరి జీవితానుభవాలు-రచనలు :-
వట్టికోట ఆళ్వారుస్వామి జీవితమంతా అనుభవాల సారమే.. నిరంతరం ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నమై ఉండేవారు.భాషా సాహిత్యాల నుండి పౌర హక్కుల దాకా అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల్లో ఉద్యమ స్పూర్తి ని, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన వారిలో వట్టికోట ఆళ్వారుస్వామి అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి గా పేర్కొనవచ్చు. ఆళ్వారు స్వామి జాతీయ వాది.మతసామరస్యం నెల కొల్పడం కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు.
తెలంగాణ జన జీవితాన్ని సంస్కృతీ వారసత్వాన్ని,భాషా సౌందర్యాన్ని, తిరుగు బాటు తత్వాన్ని, పోరాట నేపథ్యాన్ని తన రచనల్లో పొందుపరచడమే కాకుండా జనం వాడే పలుకు బళ్ళు,మాట్లాడే తీరు తెన్నులతో సహజత్వం ఉట్టిపడేలా రచనలు చేశారు. యాస, జాతీయాలతో రాసిన కథలు, నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి. వారు కథలు,నవలలతో పాటు అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు రాశారు.
ఆంధ్ర మహా సభ ద్వారా కమ్యూనిస్టు పార్టీ లో కార్యకర్తగా నిజాం నవాబు కు వ్యతిరేకంగా చేసిన సాయుధ పోరాటంలో ఒక చేత పెన్ను,మరో చేత గన్ను పట్టి ప్రజల కోసం పోరాడి మూడు సార్లు జైలు జీవితం అనుభవించారు.
వారి జైలు జీవిత అనుభవాలు 'జైలు లోపల' పేరు తో కథల సంపుటి గా వెలువడింది.ఈ సంపుటి లో పరిగె, మెదడుకు మేత, పతితుని హృదయం, అవకాశమిస్తే.విధిలేక, మాకంటే మీరేం తక్కువ' అనే ఆరు కథానికలు ఉన్నాయి. వీటన్నింటిలో ప్రజలను చైతన్యవంతులను చెయ్యడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. 'పరిగె'కథానికలో భూస్వామ్య వైఖరి ని, మెదడుకు మేత లో మనుషుల మధ్య చీలికలు తెస్తున్న మత కలహాలు,'పతితుని హృదయం' లో ఉరిశిక్షల నేపథ్యం గురించి, 'అవకాశమిస్తే' కథానిక లో సమానావకాశాలు స్వేచ్ఛ లభిస్తే స్త్రీలు రాణిస్తారనే సందేశం...ఇలా ప్రతి కథలో సమస్యల పట్ల అవగాహన కలిగించడమే కాకుండా 'చిన్నప్పుడే' అనే కథానికలో ఆనాటి పరిస్థితులు పిల్లల ద్వారా చెప్పించడమే కాకుండా నాయకుడు ఎలా ఉండాలో ఆ వూరి వెంకట్రావు అనే నాయకున్ని చూపిస్తారు. వీరి కథానికలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి.
ఇక నవలల విషయానికి వేస్తే 'రామప్ప రభస' , తెలంగాణ వ్యాసాలు, 'ప్రజల మనిషి', గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి.
తెలంగాణ చరిత్ర లో జరిగిన సాయుధ పోరాటం వట్టి కోట గారిని ప్రజా రచయిత గా నవలాకారుడిగా మార్చింది.తెలుగు సాహిత్యానికి ఓ గొప్ప రచయితను ఇవ్వడంతో పాటు ఆనాటి నిజాం పాలనలో కోరలు విప్పిన భూస్వామ్య రాకాసి, సామాన్యుల అణచివేత లాంటి వెన్నో ఇందులో పొందు పరచబడి.. ప్రాంతీయేతర రచయితలకు కూడా స్ఫూర్తి దాయకం గా నిలిచింది.నాటి అమలిన జీవితాన్ని, ప్రేమ, ఆప్యాయతలు, వేదనలను ఎంతో ఆర్ద్రత గా చిత్రీకరించారు. ఆనాటి ప్రజల ఆలోచనలు, విధానాలు సాంఘిక ఆర్థిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు.గిర్థావర్ అనే పుస్తకం లో నాటి భూస్వాముల ఆరాచకాల గురించి, పరిసరాలు అనే పుస్తకం లో ముస్లింల వ్యధార్త గాధలను రాశారు.
1948లో వట్టి కోట ఆళ్వారుస్వామి దాశరథి తో కలిసి మూడు నెలలు జైలు జీవితం గడిపారు.ఆ సమయంలో దాశరథి కృష్ణమాచార్యులు గారు నిజాం నవాబు నిరంకుశ పాలనపై రాసిన పద్యాలను ఆళ్వారుస్వామి కంఠస్థం చేసి వాటిని జైలు గోడల మీద బొగ్గు తో రాసేవారు. జైలు అధికారుల చేత చీవాట్లు కూడా తినేవారట.
.. ఆయన మరో నవల 'గంగు' ఇది పూర్తి కాలేదు.తెలంగాణ మట్టి బిడ్డ వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణ ప్రజల గుండెల్లో అత్యంత అభిమాన పాత్రులై పటిష్టమైన గట్టి కోట కట్టుకున్నారు. కాళోజీ, దాశరథిలా ఆయన తెలంగాణ సమాజానికి చేసిన సాహిత్య సేవ చిరస్మరణీయం.
చిన్న వయసులోనే 1961 ఫిబ్రవరి 5 నా 47వ యేటనే మరణించడం సాహిత్యానికి తీరని లోటు.
వారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన స్ఫూర్తి పోరాట పటిమ నాటి నేటి తరాలకు తరగని ఆస్తి.
తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న వట్టికోట ఆళ్వారుస్వామి కి ఈ సందర్భంగా మనం ఇచ్చే అసలైన నివాళి. ఆయన బాటలో నడుస్తూ ఆశలను ఆశయాలను ఫలవంతం చేసేందుకు చేయి చేయి కలిపి ముందుకు సాగుతూ మత రహిత సమాజం దిశగా సమ సమాజం వైపు అడుగులు వేద్దాం. ఇదే ప్రజల మనిషి కి మనమిచ్చే ఘనమైన నివాళులు.