Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాకునేను
అర్థం కావడం లేదు...
ఇక ఇతరులకు ఏమర్థమవుతాను!!??
ఏదో అర్థం కాని లోతు ఉంది
వ్యర్థమైన గుణముంది
కర్తవ్యం మరిచిన కాలముంది
అందుకే అర్థం కాని వ్యక్తిగా...
ఇప్పుడిప్పుడే
ఆత్మశోధనలో అడుగులువేస్తున్నా!!
కోరికల గుర్రాలకు కళ్లెం వేసిన
ఆదర్శాల మేలిముసుగు కింద
ఉన్న లొసుగులను తెలుసుకున్నా!!
కనిపించని ప్రతిబింబం...
వినిపించని నిశ్శబ్దం...
నన్ను నేను దాటి ముందుకుపోలేదు!
నిన్నటి దారుల్ని దాటివచ్చినా
రేపటి దారికొరకు వెతుకుచున్నా!!
సహజంగా ఉన్న నేను
మళ్లీ వెనక్కు తిరిగివచ్చినా..
నన్ను నేను సాగిపోతున్నా!!
అమ్మప్రేమను ఆస్వాదించని వాణ్ణి..
నిర్లిప్తంగా జారిపోయిన వాణ్ణి..
బతుకుమీద ఆశచావక
తిరిగి మళ్లీ రావడం జరిగింది..
చావును బతుకును శాసిస్తున్నా!..
కనిపించని నేను వినిపిస్తా!..
ఎన్నెన్ని రూపాలో..నాలో!!
తెలియని పాపాలు కూడా ఉన్నాయి..
ఏదో మరపురాని స్నేహం..
మరచిపోని ప్రేమ బంధం..
నిద్రపోతున్న నన్ను లేపుతాయి!..
మొక్కవోని ధైర్యం ఇచ్చి నిలబెట్టుతాయి...
కారణాలు వెతుకుతున్నా...
అసలైన ప్రవర్తన చూస్తున్నా..
పటిష్ఠతను కోల్పోయి
విశిష్టతకు దూరమై
ఏదో స్వార్థానికి దగ్గరైనట్లుంది...
అందుకే అర్థం కావడంలేదు..
ఎదలోతుల్లో..మనసు పొత్తిళ్ళల్లో
ఏదో కుళ్ళు నిండినట్లుంది...
మనిషి నుంచే పుట్టుకొస్తాయి!
మంచితనపు వెన్నుపోట్లు..
మరిచిపోని గుణపాఠాలు...
ఆదర్శం కాదు ఉండవలసింది
నిండైన విలువైన ఆదరణ ఉండాలి..
ఇవి అన్నీ లేనందుకు
నాకు నేను అర్థం కావడం లేదు..
మంచి విలువలు ఉన్నప్పుడే
అర్థం కావాలంటే లోపల
సామర్థ్యం ఉండాలి..అప్పుడే
సులువుగా అర్థమవుతాం...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801