Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మా బాధకు భాష లేదు
మా కన్నీటికి లిపి లేదు
మా మమతకు మాట లేదు .
రాగాలతో ,గారాలతో
మా గారాబు బిడ్డగా జన్మించితివి నీవు
నీ బుడిబుడి అడుగుల సవ్వడి
మా గుండెలు నిండిన సందడి
నీ కిలకిల నవ్వులే విరిసిన వన్నెలై
నీ తడిపొడి మాటలే కురిసిన వెన్నెలై
నీ భవితను మా చరితగ తలచాం .
రక్తమాంసములు కరుగబెట్టి
ఉన్న ఆస్తులు కుదువబెట్టి
చదువులెన్నో చదువబెట్టి
నీ ఉన్నతికి మెట్టు మెట్టు పేర్చిబెట్టీ
నీ కోసం మేం ఎదురు చూస్తే . . . . . .
చిలుకలాగా పలుకనైనా పలుకరావు
నీ ఇంట చేరిన చూడనైనా చూడరావు.
రెక్కలు తెగి ఓపికుడిగి
దిక్కుతోచని ముదిమిలోన
మము లక్ష్యపెట్టని నిన్ను చూస్తే
మాబాధకు భాష లేదు
మా కన్నీటికి లిపిలేదు .
డబ్బు మాత్రమే కాదు ముఖ్యం
డబ్బులోనే లేదు సౌఖ్యం
జీవమే లేని ఆ పచ్చనోట్లు
నీ జీవనానికి కావు కావవి అభివృద్ధి మెట్లు .
ఆస్తులమ్మి ,పుస్తెలమ్మి పస్తులండీ
నీ చదువు కోసం మేం పడిన కష్టం
నీకు గురుతు లేదాయె ! గురుతు రాదాయె !
నీ పెద్ద హోదా నిను నిలువనీదాయె !
మము చూడనీదాయె !
మా కన్న కడుపుకు
శాపమీయగ నోరు రాదు
పాపమన్నది నీవు చేయరాదు.
ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్నడైనా
మా కష్టమన్నది గురుతుకొస్తే
పండుటాకులని పారద్రోలక
పనికిరామని పారవేయక
నీ పసిడి మనసును మాకు పంచి
మా కన్నీటిని పన్నీటిగ మార్చితే
మా ఆనందానికి అవధి లేదు
మా కన్నీరుబికేందుకు దారి లేదు .
- సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట
సేల్ : 9573996828