Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాళోజీ ..ఈ పేరు వినగానే తెలంగాణ ప్రజల హృదయాలు వినమ్రంగా నమస్కరిస్తాయి. ఆ పేరును తలవగానే మూర్తీభవించిన ధర్మాగ్రహం కళ్ళకు కనిపిస్తుంది. ఆయన ధిక్కార స్వరాన్ని విన్నప్పుడు, ఆయన జీవితాన్ని చదివినప్పుడు... కాళోజీ పుట్టుక చావుల మధ్య తన జీవిత కాలాన్ని సమాజానికి ఎంతగా అంకితం చేశారో తెలుస్తుంది.
తెలంగాణ వైతాళికుడుగా ,
ప్రజా కవిగా, నిత్య చైతన్య శీలిగా , ఉద్యమ కారునిగా జీవితమే ఉద్యమంగా
ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహా మనీషిగా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాడు.
కాలాన్ని చదువుతూ, పుస్తకాలను ఔపాసన పడుతూ, సమాజంలోని అసమానతలను నిరసిస్తూ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ నిత్యం సత్యం కోసం పోరాడే జ్వలన శక్తిగా మనకు కనిపిస్తాడు.
రాజీ ఎరుగని తత్వం దౌర్జన్యాలపై విరుచుకు పడే కెరటమై నిరంతరం వ్యవస్థతో ఏదో ఒక రూపంలో గొడవ పడటం చూస్తాం అదే ఆయన ప్రాణ ప్రద అంశంగా చూస్తాం....
90 సంవత్సరాలు పైబడిన సుదీర్ఘ జీవన యానం ఒక మహత్తర కావ్యం.
తెలంగాణ ప్రజా జీవితాన్ని తన కవితల్లో ప్రతిబింబింప చేసిన మహా కవి. అన్యాయాలను అక్రమాలను భరించలేక ..అన్యాయపు లోకంతో పోట్లాడుతూ మాటిమాటికీ గాయపడతాను/ ఓడి ఓడి అలసి పోతాను/అప్పుడే ఏకాంతంలో రోదిస్తానంటూనే నా హృదయంలో పడిన లోతైన గాయాన్ని గేయంగా చూపిస్తాను/ రాయిని కరిగిస్తానని చెబుతారు.సామాజిక, ఆర్థిక, న్యాయ, రాజకీయ విషయాలను తన కవితల ద్వారా ప్రజలకు తెలుపడానికి చురుక్కు మనిపించే వ్యంగోక్తులు ఉపయోగించడంలో ఆయనకు ఆయనే సాటి.అందుకే కాళోజీ అన్న గారైన రామేశ్వర రావు 'కాళోజీ అసలు తనకు సంబంధం ఉన్నా లేకున్నా అన్యాయం ఎక్కడ జరిగినా దిరిస్తాడు" అన్నారు.
ఇరవయ్యవ శతాబ్దపు తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక చరిత్రలో కాళోజీ జీవితం ఓ అద్భుత అధ్యాయం.తెలంగాణ యువతకు కొత్త దారులు వేసి కొత్త, శక్తి, ఆవేశాలను నింపి తెలంగాణ అభిమానానికి నిలువెత్తు నిదర్శనమైన కాళోజీ ఒక్క ఊపిరి తిత్తితోనే తోంభై ఏళ్ల జీవితాన్ని గడిపిన తత్వ జీవి కాళోజీ.ఆలోచనలో మానవతా, ఆచరణలో ధీరత్వం నింపుకున్న కవి.శ్రమ జీవికి రెండు పక్కలా నిలబడి రైతు బాంధవుడిగా నిలిచిన చెమట జీవుల లోక బాంధవుడు. చెమట పరిమళాలను,రంగును కూడా చూడ గలిగిన దార్శనికుడు.అందుకే నిగనిగ లాడే నెగణ్ణి,రేపును పొడగట్టించే దగణ్ణి అంటూ
ఆలోచనలో మానవత, ఆచరణలో ధీరత్వం నింపుకున్న కవి.చెమ్మగిల్లిన కన్నుల్లో తడిని, కరుణ రసాన్ని,ఆవేశపు అగ్ని కణాన్ని రెంటినీ కలగలిపిన రూపమే కాళోజీ కవిత్వం.కాళోజీ గారిది వీటిని బట్టి తెలుస్తుంది ఆయనది బహుముఖీన వ్యక్తిత్వమనీ. ఏ ఒక్క అంశంతో ముడిపెట్టి ఆయన వ్యక్తిత్వాన్ని సమగ్రంగా వివరించడం అసాధ్యమనేది అర్థమవుతుంది.
కాళోజీ జీవితం వడ్డించిన విస్తరి కాదు.నిత్య వసంతం కాదు . నిరంతర పోరాటాలతో సంఘర్షించిన గ్రీష్మం. విశ్వాసాలు, సిద్దాంతాలు ఆశయాలు,ఆదర్శాలలో ఏమాత్రం రాజీపడని యోధుడు. ఓ ఝంఝా మారుతం. వెన్న కన్నా మెత్తని మనసున్న మానవతా వాది. ప్రజలే ఆయనకు ముఖ్యం. ప్రజల మాటే ఆయనకు శిరోధార్యం. తెలంగాణాతో ఇంతగా ముడిపడి ఉన్న కాళోజీ నారాయణరావు పూర్వీకులు మహారాష్ట్రకు చెందిన వారు. మహా రాష్ట్ర నుంచి తెలంగాణ కు వలస వచ్చారు. మొదటి ప్రపంచ యుద్ద కాలం 1914 లో కర్నాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా 'రట్ట హల్లి' గ్రామంలో సెప్టెంబర్ తొమ్మిదిన రమాబాయి, రంగారావు దంపతులకు జన్మించారు. తండ్రి మహారాష్ట్రియన్.తల్లి కన్నడిగ.
కాళోజీ పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాంరాజా కాళోజి.. ఇంటిపేరు మహా రాష్ట్రలోని కాళీ శబ్దానికి రూపాంతరం. వీరి పేర్ల చివర పంత్ అనే శబ్దం కనుమరుగై తెలంగాణలో వాడబడే రావు శబ్ధం వచ్చి చేరింది. వీరు మహారాష్ట్రకు చెందిన నియోగి బ్రాహ్మణులు.కాళోజీ జన్మించిన రట్ట హళ్లి కర్నాటక ప్రాంతంలో పాత బొంబాయి ప్రెసిడెన్సీలో ఉండేది. ఈయన చిన్నతనం కొంత మహారాష్ట్రలో "సాయం రాం" గ్రామంలోనూ ఆ తర్వాత తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లెందులోని, కారేపల్లి గ్రామంలోనూ, ఆ తర్వాత హనుమకొండ, మడికొండలలో గడిచింది.
కాళోజీ తల్లిగారికి కన్నడం, మరాఠీ వచ్చు. తండ్రి తెలుగు, ఉర్దూ మాట్లాడే వారు ఇలా బహు భాషలు మాట్లాడే కుటుంబం నుంచి వచ్చినందు వల్ల తెలుగు, మరాఠీ, ఉర్దూ,హిందీ భాషలు వచ్చాయి. కాళోజీ పై తల్లిగారి ప్రభావం బలంగా ఉంది. ఆమె చదువుకున్న స్త్రి అవడం వల్ల పిల్లలకు మరాఠీ పత్రికలలోని విశేషాలతో పాటు వీర సావర్కర్ చరిత్రను వివరించి చెప్పేది. ఆమె కులమతాల పట్టింపులేని గొప్ప వ్యక్తి. ఆ కాలంలో వారి ఇంటికి ఎంతోమంది నాయకులు, కవులు, సామాన్యులు కూడా వచ్చేవారు. ఎలాంటి భేదభావం లేకుండా మహాకవి విశ్వనాధ సత్యనారాయణ గారి ప్రక్కన పిల్లలను కూర్చోబెట్టి భోజనం ఎలా పెట్ఠేదో గుర్రం జాషువా గారు వచ్చినప్పుడు కూడా అట్లాగే పిల్లలను కూర్చోబెట్టి భోజనం పెట్టేది. ఈ సంస్కారమే కాళోజీకి అబ్బిందని చెప్పొచ్చు. తన మేనమామ నర్దేవ్ శాస్త్రి సాహచర్యం వలన చిన్నప్పుడే దేశ సమాచాలు, రాజకీయ వాతావరణం తెలిసాయి.
కాళోజీ బాల్యం-చదువు
కాళోజీ చిన్నప్పుడు శ్రీ రామచంద్రం, శ్రీ సాంబ సిద్దయ్య గార్ల వద్ద విద్యను అభ్యసించాడు. ఆ సమయంలో పల్లా దుర్గయ్య, వానమామలై వరదా చార్యులు కాళోజీ సహాధ్యాయులు.కాళోజీ అన్నయ్య గారు న్యాయ శాస్త్రం చదవడానికి హైదరాబాద్,ఆ తర్వాత తనతో పాటు హన్మకొండ, మరోసారి వచ్చి వరంగల్ లోని కాలేజియేట్ హైస్కూల్ లో చేరి 1939లో 'లా' పూర్తి చేశారు.
కాళోజీ వివాహం
క్రీ.శ 1940లో మేనమామ గవిచర్ల వేలూరీ మాణిక్య రావు కూతురు రుక్మిణీ దేవితో జరిగింది. కాళోజీ వ్యక్తిత్వం ఉద్యమ కారుడిగా గుర్తింపు పొందిన కాళోజీ వ్యక్తి గత జీవితానికి, సామాజిక జీవితానికి ఏమాత్రం తేడా లేదు. చాలా నిరాడంబరమైన జీవితం. ఆచరణే ఆదర్శం. ఆదర్శమే ఆచరణ. సొంత ఆస్తి అంటూ లేదు. ఒకానొక సమయంలో చలసాని ప్రసాద్ గారితో ఆయన ఆస్తి వివరాల గురించి చెప్పినది వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళింట్లో ఓ బీరువా. అందులో ఒక అరలో కాగితాలు, మరో అరలో బట్టలు"ఇవే తన ఆస్తి అంటారు. కాళోజీ పదవులకు, ప్రలోభాలకు, ఆస్తులకు అంతస్తులలకు లోబడని ఉన్నతుడు.
కాళోజీ సామాజిక జీవితం
కాళోజీలో సామాజిక స్పృహ ఆయననో ప్రత్యేక వ్యక్తి గా నిలిపింది. చుట్టూ ఉన్న రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులు చిన్న నాటి నుంచి కాళోజీ వ్యక్తిత్వం పై ముద్ర వేశాయి. ఆనాటి నిజాం రాజ్యంలో రాజకీయ సాంస్కృతిక పరిస్థితులు పరిశీలించి చూస్తే మనకు కాళోజీ సామాజిక జీవిత కోణాలను తెలుసుకోవచ్చు. సామాజిక జీవితంలోని తెగింపు, రాజీలేని తత్వం ఆయనను ప్రజా కవిగా మారడానికి ఉపయోగపడ్డాయి.ఆ రోజుల్లో ఎన్నో రకాల ఉద్యమాలు ఆయన సామాజిక జీవితాన్ని విస్తృతం చేశాయి. వాటిలో భాషా, సాంస్కృతిక,మత, రాజకీయ సంబంధించిన ఉద్యమాలు ముఖ్యమైనవి.
కాళోజీ జైలు జీవితం
నిజాం పాలనలో మొదటి సారి 1939లో మూడు రోజుల పాటు జైల్లో ఉన్నారు.ఆ తర్వాత రెండో సారి, మూడోసారి కూడా జైలు జీవితం అనుభవించారు. ఆ సమయంలో పోరాటాలు ఉదృతం అవుతున్న కొద్దీ ప్రజల్లో తిరుగుబాటు భావాలు బలపడేలా చేసిన నాయకుల్లో కాళోజీ నారాయణరావు ఒకరు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో తెలంగాణ ప్రాంతం నైజాం పాలనలో నే ఉంది.ఆ సమయంలో నిజాం రాజ్యంలో జెండా ఎగరేసిన ధీశాలి కాళోజీ. గ్రంథాలయోద్యమం, జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం లాంటి ఎన్నో ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.పోరాటాల అగ్రస్థానంలో నిలబడి పోరాడిన రాజకీయ కవి సింహం కాళోజీ. విశ్వకవి రవీంద్రుడు మరణం గూర్చి రాసిన కవితలోని మృత్యు దేవత వచ్చి/ నా ఇంటి తలుపు తడితే/ రిక్త హస్తాలతో ఆమెను ఎన్నడూ పంపను/ జీవితమనే సంపూర్ణ పాత్రను/: ఆమె చేతులందుంచుతాను "అన్న మాటలు/ వాక్యాలు కాళోజీకి పూర్తిగా వర్తిస్తాయి.
కాళోజీ కవితలు- విశ్లేషణ
ప్రజా కవిగా పేరొందిన కాళోజీ తన గూర్చి తన కవితా స్వభావాన్ని గూర్చి 'నా గొడవ' అనే కవితలో స్పష్టంగా వివరించారు.....నఖరాలు లేనట్టిది/ నాజూకు కానట్టిది/నా గొడవ మనది/అక్షరాల జీవనది/నానా భావనా నది// నీనా భావన లేనిది ..అంటారు.
ఇక దేశంలోని సామాజిక వ్యవస్థలో ఉన్న భేదాలను విశ్లేషిస్తూ 'అన్నపురాసులు ఒక చోట/ ఆకలి మంటలు ఒకచోట/హంస తూలిక లొకచోట/అలసిన దేహాలొకచోట.. అంటారు.
తెలుగు భాష మాట్లాడని వారిపై ధ్వజమెత్తి రాసిన కవిత 1942లో . ఆంధ్రుడా కవితలో తెలుగు బిడ్డవురోరి/ తెలుగు మాట్లాడుటకు/ సంకోచ పడియెదవు సంగతేమిటి రా/అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు/ సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా ..అని ఘాటుగా విమర్శించాడు.
మరో కవితలో ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ/ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ/ ఈ చీకటి ఉండదు/సూర్యుడు తప్పక ఉదయిస్తాడు/ఆ వెలుతురు నిలవదు సూర్యుడు మళ్లీ అస్తమిస్తాడు..అంటూ తన రాసిన పునరావృతి లోని కవితలో అంటారు.
ఇక తెలంగాణ భాష కోసం, రాష్ట్రం కోసం ఉద్యమిస్తూ..
రెండున్నర జిల్లాలదే దండిభాష అయినప్పుడు/తక్కినోళ్ళ నోళ్ల యాస/తొక్కి నొక్క బడ్డప్పుడు/ ప్రత్యేకంగా రాజ్యం పాలు గోరడం తప్పదు/ అని ఆంధ్ర భాషా వాదులను హెచ్చరించారు.
పరాభవ వసంతం, గ్రీష్మం,వర్షం,శరత్తు,హేమంతం, శిశిరం, ఈ విధంగా ఆరు సంపుటాలు వెలువరించారు.
కవితలే కాదు కథలు కూడా రాశారు. రాసినవి తక్కువే అయినా వాసికెక్కిన కథలు ఉన్నాయి.
మనమే నయం, విభూతి లేదా ఫేస్ పౌడర్,లంకా పునరుద్ధరణ,భూత దయ లాంటి కథల్లో దీర్ఘ కాలిక స్పృహ, విజ్ఞత గాఢమైన వివేచన, ఆలోచన కలగలిసిన అంశాలు కనిపిస్తాయి.
అలాగే భాష రెండు తీర్లు ఉంటుందని బడి పలుకుల భాష, పలుకు బడుల భాష అని.. అందులో తనది పలుకు బడుల భాష అంటారు. అదే విద్యార్థులకు కావాలని అలాగైతేనే భాష సజీవంగా ఉంటుందన్న మాటలు అక్షర సత్యాలు.
కాళోజీ -పురస్కారాలు
- కాకతీయ విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది స్వాతంత్ర్య సమర యోధుడిగా కేంద్ర ప్రభుత్వం నుండి తామ్ర పత్రం పొందారు.
- రామినేని ఫౌండేషన్ గాడిచర్ల ఫౌండేషన్ మరికొన్ని సంస్థలు వివిధ రకాల పురస్కారాలు ఇచ్చాయి.
- ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చి గౌరవించింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్రం కాళోజీ జయంతి సెప్టెంబర్ తొమ్మిదిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం తెలుగు సాహిత్యంలో కృషి చేసిన సాహితీ వేత్తలకు ఆయన పేరిట పురస్కారాలు ఇచ్చి గౌరవిస్తోంది.
కాళోజీ-వ్యక్తిగత జీవితం
కాళోజీ నారాయణరావు జీవితాన్ని పరిశీలిస్తే ఆయన జీవితం అంతా సమాజం, సాహిత్యంతో ముడిపడి ఉంటుంది. ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఆరోగ్యంతో పోరాడి గెలిచిన వ్యక్తి. కాళోజీకి ఒకసారి క్షయవ్యాధి సోకినప్పుడు ఉస్మానియా ఆస్పత్రి వారు ఒక ఊపిరి తిత్తి తీసివేశారు. ఆ జబ్బుకు చికిత్స చేయించుకుంటున్న సమయంలో డాక్టర్లు కాళోజీని ఎవ్వరితో మాట్లాడవద్దని అలా మాట్లాడితే ఆరు నెలల్లో చనిపోతానని హెచ్చరించినప్పుడు... కాళోజీ నేను మాట్లాడకపోతే ఆరు రోజుల్లోనే చనిపోతానని డాక్టర్ మాటలకు జవాబు ఇచ్చారట. ఇలా తన మనసులోని మాటను నిర్మొహమాటంగా నిర్భయంగా చెప్పే మనస్తత్వం కాళోజీది.
కాళోజీ భార్యా బిడ్డల భారం కూడా అన్నయ్య రామేశ్వరరావు గారే మోశారు. రెండు కుటుంబాల భారాన్ని మోసిన అన్నను ఉద్దేశించి అక్కడ తమ్ముడు అన్నకు సేవ చేస్తే ఇక్కడ అన్నే తమ్ముడి భారాన్ని మోశాడని చెప్పుకునే వారు. తన అన్నయ్య చనిపోయిన సమయంలో ఎంతో ఆవేదనతో నా ఆరవ యేట అన్న భుజాలమీదికెక్కాను. ఆయన మరణించే వరకు దిగలేదు. డెబ్బై యేండ్ల వరకు ఆయన నన్ను దించకుండా ఉండటం అన్న గొప్పతనమని చెబుతూ తాను రాసిన నా గొడవ కవితా సంపుటి నుండి అన్న గారికి అంకితం చేశారు.
ముగింపు
కాళోజీ జీవితం మహోన్నత శిఖరం.. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తూ ఆదర్శవంతంగా జీవించిన మహా మనీషి. బ్రతికి నంత కాలం ప్రజల కోసం ప్రజల బాధలు వేదనలు తనివి గా వారి గొడవ తన గొడవగా బ్రతికిన కాళోజీ మరణానంతరం తన దేహాన్ని మెడికల్ కాలేజీ కి ఇవ్వాలని చెప్పారు. ఆయన మరణానంతరం ఆయన మృతదేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థుల పరిశోధన కోసం అంకితం చేశారు.
కాళోజీ జీవితం నాడు నేడు కవులకు రచయితలకు మాత్రమే కాకుండా అందరికీ ఆదర్శం. మన ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు గారు కాళోజీ నా అంతరాత్మ, నా అనుభూతి, మార్గాలు వేరైనా నా అంతరంగం లోనే ఉన్నాడు ఆయన నాకు మార్గదర్శి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ సిద్ధాంత కర్త కొత్త పల్లి జయశంకర్ సారు పీడిత,బాధిత,ప్రజల పక్షాన గళం విప్పి, కలం పట్టిన సమర యోధుడు కాళోజీ.. ఆయన యుగ పురుషుడు.ఆయన ఊహించిన సిసలైన ప్రజాస్వామ్యం ఏర్పడే వరకు జన్మిస్తూనే ఉంటాడని" అన్నారు. తెలంగాణ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించిన పేరు కాళోజీ ది. తెగువ, సాహసం, త్యాగం ఒకటేమిటి ఆయన జీవితంలోని ప్రతి కోణం భావితరాలకు స్ఫూర్తి దాయకం.
వురిమళ్ల సునంద,
ఖమ్మం