వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించాడు మంచి ఎక్కడున్నా స్వాగతించాడు అన్యాయం అనిచివేత లపై తిరగబడ్డాడు. తెలంగాణ వైతాళికుడు అని పేరుగన్నాడు. ఈనేల సాంస్కృతిక వారసత్వంలో నుండి ఎదిగిన మహనీయుడే కాళోజి. కాళోజీ నారాయణరావు తెలంగాణ రాష్ట్ర సాధన సమరంలో కొందరు తమ గళాన్ని అస్త్రంగా సంధించాడు మరికొందరు తమ కలంతో ఉత్తేజం నింపారు. అలాంటి గొప్ప కలం వీరులలో అగ్రగణ్యుడు మన కాళన్న.
"పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానికి" అనే విశ్వమానవ విశాల హృదయం అందరికీ ఉండదు అందుకే ఆయన ప్రజాకవి అయ్యాడు. కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస్ రావు రామ్ రాజు కాళోజీ తెలంగాణ ప్రజల మనసుల్లో పాతుకుపోయిన ప్రజా కవి సమాజ గొడవను తన గొడవగా చేసుకుని నా గొడవ పేరుతో అనేక కవితలు రాసి వాటిని 8 సంపుటాలుగా వెలువరించారు.
ప్రాంతీయ దృక్పథం దేశీయ దృక్పథం అంతర్జాతీయ దృక్పథం కలిగిన కాళోజీ నిజానికి అంతర్జాతీయ కవి.
తెలంగాణ సాహిత్యానికి సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనం
1000 గన్నులు చేయలేని పనిని ఒక పెన్నుతో చేసి చూపించాడు. ఒక్క సిరా చుక్కతో లక్ష మెదళ్ళకు కదిలించాడు. కాలే కడుపులు రగిలే గుండెలను చూసి తన చురకత్తిలాంటి కవితలతో ఉద్యమ సమరం శంఖం పూరించాడు.
కవితలు అంటే నల్లని సిరాతో తెల్లని కాగితాల పై రాసిన అక్షరాలా.. అవి కావు కవితలంటే కణకణ మండే నిప్పు కణికలు నిజాం నిరంకుశ పాలనను నిలువునా తూర్పార పట్టిన గళం కాళోజి కలం ఒక్కో అక్షరాన్ని ఆయుధంగా మలిచి ప్రజలకు అందించిన నిత్య సత్యాగ్రహ సమరశీల కాళోజీ అవే అక్షరాలతో తెలంగాణ అస్తిత్వం కోసం అలుపెరుగని పోరాటం చేసిన అక్షర యోధుడు.
తెలంగాణ పక్షాన నిలిచి తాడిత పీడిత ప్రజల గుండెల్లో కొలువైన కవి కాళోజీ. మాటలలో చేతలలో ఆలోచనలలో ఆవేదనలో దేశ భాషలలో ప్రవర్తనలో తెలంగాణ స్వరూపం సంపూర్ణంగా కనిపిస్తది దాశరథి అన్నట్లు తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం కాళోజీ. తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్ళి ప్రజాకవిగా పేరుపొందినాడు
కాళోజీ 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా రట్టహల్లి అనే గ్రామంలో రంగారావు రమాబాయమ్మ దంపతులకు జన్మించాడు. ఆ తరువాత బీజాపూర్ నుండి తెలంగాణకు వలస వచ్చిన రంగారావు కుటుంబం వరంగల్ జిల్లాలోని మడికొండ గ్రామం లో స్థిరపడింది. కాళోజీ తండ్రి మహారాష్ట్రీయులు తల్లి కన్నడికురాలు. కాళోజీ పుట్టిన ఆరు నెలలకే ఆ కుటుంబాన్ని కాలం కాటేసింది. తల్లి రమాబాయమ్మ కన్నుమూసింది. అన్న రామేశ్వరరావు అన్నీ తానే అమ్మలా పెంచాడు. కాళోజీని ఒకసారి తన కన్న ఎనిమిది సంవత్సరాలు పెద్దవాడైనా తన అన్న గురించి చెబుతూ ఏడు నెలల వయసులో నా అన్న భుజం ఎక్కిన నేను 80 ఏళ్లు వయసులో కూడా అన్ననే ఆసరాగా చేసుకుని ఉన్నానని అచంచలమైన తన అన్న పై ఉన్న ప్రేమను చాటుకున్న ప్రేమమూర్తి.
మన కాళోజీ నారాయణరావు కాళోజీ తన హైస్కూల్ చదువుని హనుమకొండలోని యెట్ హై స్కూల్ లో హైదరాబాద్ పాతబస్తీలోని చౌమహాల్లా పాఠశాలలో పూర్తి చేశాడు. తర్వాత 1939లో హైదరాబాద్ హైకోర్టు అనువదకంగా ఉన్నా లా కాలేజీలో న్యాయవాద పట్టా అందుకున్నారు. కానీ అబ్దుల్ భావాలే నిండైన ఆదర్శంగా గల కాళోజీ దండిగా డబ్బులు దండుకునే అవకాశం ఉన్నా న్యాయవాద వృత్తిని పక్కనపెట్టి. ఆ కాలంలో జోరుగా సాగుతున్న గ్రంథాలయ ఉద్యమం లోకి దూకాడు. సత్యాగ్రహ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సమాజ అసమానతలపై కవితల తూటాలు పేల్చిన ప్రజాకవి నీతి నిజాయితీ అంతకుమించిన చిత్తశుద్ధి నీ తన కవితలలో అనువనువున చూపిన మహనీయుడు.
కవితావేశం నిండిన గొంతుకతో తెలంగాణ ప్రజలను మేల్కొల్పిన కాళోజీ. తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయుడు. ప్రజల గుండెల్లో పది కాలాలు నిలిచిపోయే ధన్యజీవి. తన గొడవతో లక్షల మెదళ్లను కదిలించిన ధీరుడు. 1940 లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది వీరికి ఒక కుమారుడు రవి కుమార్.
తెలంగాణ సాయుధ పోరాటంలో వరంగల్ జిల్లా బైరాన్‌పల్లిలో రజాకారులు ఒకేరోజు 90 మందిని కాల్చి చంపారు. ఈ ఘటన కాళోజీని తీవ్రంగా కలవరపెట్టింది. ఈ సందర్భంలో కాళోజీ ఇలా అన్నాడు
మన కొంపలార్చిన
మన స్త్రీలను చెరచిన
మన పిల్లలను చంపి
మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి.
కసి ఆరి పోకుండా
బుస కొట్టు చుండాలే
కాలంబు రాగానే కాటేసి తీరాలె అంటూ నిజాం నవాబును కలంతో ప్రతిఘటించాడు.
తెలంగాణ భాషను చులకనగా చూసిన వారికి చురకలంటించేవారు. కాళోజీ కవితలలో ప్రత్యేక శైలి కనిపిస్తుంది ఆయన రచనలు భావావేశ రసగుళికలు. సామాన్యు డి భాష యాస లోనే కొనసాగేవి. అవి కూడా ప్రజల గుండెలను తట్టి లేపుతాయి.
అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి
అన్యాయాన్నెదిరించినోడు దిక్కరించి నోడు వాడు మనోడైన మావో వాడైనా
నాకిష్టం మన్నారు ఇవి చాలు తన రచన విశిష్టతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా
అంటూ పరుష పదజాలంతో విమర్శించిన ఆయనకే చెల్లు . ఆయన రచనల్లో నా గొడవ కాళోజి కథలు సుప్రసిద్ధమైనవి. పౌర సమాజానికి ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల పై దౌర్జన్యం జరిగిన ప్రతిఘటిస్తాం ప్రజల పక్షాన పోరాడుతాం ఘాటుగా సమాధానం చెప్పిన కాళోజీ. ఒక పోలీస్ కానిస్టేబుల్ అడిగిన ప్రశ్నకు
స్వాతంత్ర ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు కాళోజీ అలుపెరుగని పోరాటం చేశారు నిజాం నిరంకుశత్వాన్ని అంతమొందించడం లో ప్రముఖ పాత్ర పోషించారు.
ఏ ఇజానకి కట్టుబడని ప్రజా ఇజం ఆయనది. ఆర్య సమాజ్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇలా అందరితో కలిసి అన్యాయంపై పోరాడారు. మొదట్లో విశాలాంధ్రను సమర్ధించిన 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పూర్తి మద్దతు నిచ్చారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించారు కాళోజీ ధిక్కార స్వరం వినిపించిన ప్పటికీ రచనలకి పురస్కారాలు కూడా దక్కాయి. జీవన గీతం రచనకు 1968 లో ఉత్తమ అనువాద రచన అవార్డు వచ్చింది.
1992లో పద్మవిభూషణ్ లభించింది. ఆయన ఎప్పుడూ అవార్డులను ఇష్టపడేవారు కాదు
ఎనిమిది దశాబ్దాలకు పైగా ప్రజాజీవితంలో ముడిపడ్డ బతుకు ఆయనది. బ్రతుకంతా దేశంగా ప్రజలుగా ఉద్యమాలుగా బ్రతికిన ప్రజా కవి కాళోజీ నారాయణరావు తన సామాజిక జీవితం ద్వారా ఆయన ఇచ్చిన స్ఫూర్తి భావప్రసారం ముందు తరాలకు శక్తినిస్తుంది.
ఆయన జీవితం కవిత్వం భావితరాలకు ఆదర్శం జీవితాన్ని ప్రజలకు అర్పించిన కాళోజీ పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానికే అన్న నినాదాన్ని నిజం చేస్తూ 2002 నవంబర్ 13న కన్నుమూశారు.
ప్రజల కోసం నిత్యం పరితపించిన ఈ కవితా మూ ర్తి ఆశయాలు భవిష్యత్ తరాలకు ఆదర్శం. ప్రజా కవి కాళోజీ నారాయణ రావు గారి వర్ధంతి సందర్భంగా నా అక్షర నీరాజనాలు