Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అయిత అనిత
జగిత్యాల,8985348424
వెలిగిపోతున్న ముఖంతో ఆనందంగా ఉన్న కొడుకును చూసి
'' IIT అడ్వాన్స్ రిజల్ట్స్ వచ్చాయేమో? నా కొడుకు క్వాలిఫై అయినట్టున్నాడు'' అందుకే ''వాడి మొహం అంత కళకళలాడుతుంది''. అనుకొని
కొడుకు చందుకు ఇష్టనైన పిండివంటలన్నీ చేయసాగింది అమల. కొడుకుకు చిన్న సర్ప్రైజ్ చేద్దామని. తండ్రి కొడుకులిద్దరూ నాకు సర్ప్రైజ్ ఇచ్చేలోగా వారికి స్వీట్ తినిపించి నేనే సర్పైజ్ ఇద్దామని అనుకొని హడావిడిగా వంటింట్లో సందడిచేయసాగింది.
అంతలోనే కూరగాయలన్నీ విసిరేస్తూ కస్సుబుస్సుమంటు రవి రానే వచ్చాడు.
''ఏమైంది? ఎందుకంత చిరాకు? ఈ రోజైనా కాస్త నవ్వుతూ ఉండొచ్చుకదా! నీ కొడుకు సాధించిన విజయాన్ని ఆస్వాదిస్తూ..'' అంది అమల.
''ఆహా! నీ ముద్దుల కొడుకు ఘనకార్యం సాధించాడని మేళతాళాలతో ఊరేగించాలా? ఛీ సిగ్గుచేటు.
ఎన్ని లక్షలు పోసి చదివించాను వాన్ని. వాడు ప్రయోజకుడవ్వాలని మొక్కని దేవుడు లేడు. వాడి భవిష్యత్తుకై ఎంత ఆరాటపడ్డాను.'' అన్నాడు రవి.
మార్కులు.. నువ్వు అనుకుంత రాకపోయినా పాస్ అయ్యాడు కదా! ఏదో ఒక కాలేజీలో చేర్పిద్దాము. పెద్దోడిలా IIT చేస్తూ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. అన్నది రవితో అమల.
''ఓసి పిచ్చి మొహమా! నీ కొడుకు కనీసం పాస్ కూడా అవలేదే'' ...అంతా నా తలరాత అంటూ బాధగా కోపంతో లోపలికెళ్లాడు రవి.
ఆమాట విన్న అమలకి ఒక్కసారిగా దిమ్మదిరిగింది. ''ఇప్పటిదాక కొడుకుపాస్ అయ్యాడని తెగసంబరపడ్డాను. నా ఆశంతా అడియాశ ఆయే అని మనసులో మథనపడుతూ'' ...
కొడుకు దగ్గరికెళ్లింది.
'' ఏరా చందు! నిన్నటి దాక నీలో ఉన్న దిగులు ఈ రోజులేదు. పైగా పరీక్ష కూడా పాస్ అవలేదు''. మరి నీ ఆనందానికి కారణం ఏంటి? అని నిదానంగా కొడుకు తల నిమురుతూ ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ప్రేమగా అడిగింది అమల.
''అమ్మా! నా కసలు ఆ..IIT చదువంటేనే భారంగా ఉండేది. ఎంత కష్టపడి చదివినా లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాను. చదివి చదివి కళ్లుగుంజుతున్నాయి. మెడనరాలు పట్టేస్తున్నాయి...తలనొప్పితో ఏం చేయాలో అర్థం కాక నాపై గంపెడు ఆశలు పెట్టుకున్న మిమ్మల్ని నితుత్సాహపరచలేక ఇన్నాళ్లు లోలోన కుంగిపోయాను.''
నా అసహనాన్ని కోపాన్ని ఎవ్వరిమీద చూపాలో అర్థం కాక రాత్రినిద్ర కూడా సరిగాపోయేవాన్ని కాదు.
ఇప్పుడు పరీక్ష పాస్ కాలేదు కాబట్టి ఇక నేను ఆ పెద్ద కాలేజ్ లలో చదవాల్సిన అవసరం లేదు కదా. అర్థం గాని సబ్జెక్టుతో కుస్తీపడాల్సిన అవసరం లేదు కదా. నా తెలివితగ్గ చదువేదో చదివితే సరిపోతుంది. మామూలు కాలేజీలో
అమ్మా! ''నాకు ఇప్పుడు పంజరం నుండి విముక్తి పొందిన చిలకలా హాయిగా తేలికగా ఉందమ్మా మనసు'' అన్నాడు.
తలుపు చాటునుండి కొడుకు మాటలు విన్న రవికి తమ తపప్పేంటో తెలిసివచ్చింది. కొడుకు మానసిక స్థితిని అంచనావేయలేక తలకు మించిన భారం పెట్టామని ఇకనుండైనా పిల్లల ఆసక్తి ఏంటో తెలుసుకొని మసలుకోవాలి. అనుకున్నాడు.
''తల్లిదండ్రుల ఆశలను ఆశయాలను పిల్లలపై బలవంతంగా రుద్దకూడదని, వారికి నచ్చిన చదువులు ఎంచుకునే అవకాశం పిల్లలకే ఇవ్వాలని, వారి ఆనందాలను ఆవిరి చేయవద్దని'' తెలుసుకొని
కొడుకు ముందుకు వచ్చి ఆర్తిగా చూసాడు. కరెక్టే అంటూ చూస్తున్న తన భార్య చూపులకు వంతపాడుతూ..!